ప్రధాన మంత్రి సురక్ష బీమా యోజన పథకం ద్వారా ప్రతి ఏడాది కేవలం రూ.20 చెల్లించి రూ. 2 లక్షల ప్రమాద బీమా పొందవచ్చు. ఏదేని అనుకోని ప్రమాదం జరిగినప్పుడు పాలసీదారులు మరణించినా లేదా అంగవైకల్యం పొందినా ఈ బీమా ప్రయోజనం లభిస్తుంది.
దేశంలో రోడ్డు ప్రమాదాల బారిన పడి ప్రాణాలు కోల్పోతున్న వారు కోకొల్లలు. నిత్యం దేశంలో ఎక్కడో ఓచోట ఇలాంటి ఘటనలు జరుగుతూనే ఉన్నాయి. అర్థాంతరంగా తనువు చాలిస్తూ వారి కుటుంబాలను విషాదంలోకి నెట్టే వారు కొందరైతే, శాశ్వత అంగవైకల్యం పొంది వారి కుటుంబీకులను బాధ పెట్టేవారు మరికొందరు. అలాంటి వారిపాలిట అండగా ఉండడం కోసం ఉద్దేశించిందే.. ఈ పథకం. ప్రధాన మంత్రి సురక్షా బీమా యోజన(పీఎంఎస్ బీవై) అనేది ఒక సామాజిక భద్రతా పథకం. దీని గురుంచి ఇంకా వివరించి చెప్పాలంటే.. ఇదొక ప్రమాద బీమా పథకం. పాలసీ తీసుకున్న వ్యక్తి ప్రమాదవశాత్తు మరణించినా లేదా అంగవైకల్యం పొందినా ఈ పథకం అండగా ఉంటుంది.
18 నుంచి 70 సంవత్సరాల మధ్య వయసున్న వారు మాత్రమే ఈ పథకంలో చేరేందుకు అర్హులు. ఇందుకోసం ఏదేని బ్యాంకులో పొదుపు ఖాతా తప్పనిసరిగా ఉండాలి. ఒకవేళ ఒకటి కంటే ఎక్కువ బ్యాంకు ఖాతాలను కలిగి ఉంటే, అప్పుడు ఏదేని ఒక బ్యాంకు ఖాతా ద్వారా మాత్రమే ఈ పథకంలో చేరే అవకాశం ఉంటుంది. ఉమ్మడి ఖాతా విషయానికి వస్తే, ఖాతాలో పేర్లు ఉన్నవారందరూ ఈ పథకంలో చేరవచ్చు. ఎన్నారైలు కూడా ఈ పథకంలో చేరడానికి అర్హులు. కానీ క్లెయిమ్ డబ్బును మాత్రం నామినీకి భారత కరెన్సీలో చెల్లింపు చేస్తారు. ఏడాదికి రూ.20 ప్రీమియం చెల్లించాలి. దీని కాలపరిమితి ఒక సంవత్సరం. ప్రతి ఏటా దీన్ని పునరుద్ధరించుకోవాల్సి ఉంటుంది.
ఈ పథకంలో చేరిన పాలసీదారుడు ఏదేని ప్రమాదానికి గురై మరణించినా లేదా శాశ్వత అంగవైకల్యం పొందినా రూ.2 లక్షలు చెల్లిస్తారు. పాక్షిక వైకల్యానికి గురైతే రూ.1 లక్ష పరిహారం లభిస్తుంది. ప్రమాదంలో రెండు కళ్లు పూర్తిగా కోల్పోయినా లేదా రెండు చేతులు/కాళ్ళు కోల్పోయినా దానిని శాశ్వత వైకల్యంగా గుర్తిస్తారు. అదే ప్రమాదంలో ఒక కాలు లేదా ఒక చెయ్యి కోల్పోవడం, కంటి చూపు కోల్పోవడం వంటి వాటిని పాక్షిక వైకల్యంగా గుర్తిస్తారు. అంటే సహజ విపత్తుల కారణంగా జరిగిన ప్రమాదాలు, మరణం లేదా వైకల్యం మాత్రమే ఈ పథకం కింద వర్తిస్తాయన్నమాట. ఆత్మహత్య చేసుకున్న సందర్భాల్లో ఈ పథకం వర్తించదు. ఒకవేళ చందాదారుడు హత్యకు గురైతే బీమా కవరేజ్ లభిస్తుంది.
ప్రమాదవశాత్తు పాలసీదారుడు మరణించినా లేదా శాశ్వత అంగవైకల్యం పొందినా దానిని ధ్రువీకరించడానికి సరైన పత్రాలను సాక్ష్యంగా చూపించి క్లెయిమ్ మంజూరు చేసుకోవచ్చు. అదే రోడ్డు, రైలు, బైక్ ప్రమాదాలు, నీటిలో మునిగిపోవడం, హత్యకు గురికావడం వంటి ఘటనలు చోటుచేసుకున్నట్లైతే వాటిని పోలీసులకు ధ్రువీకరించాలి. ఇక పాము కాట్లు, చెట్టు పై నుంచి కింద పడి చనిపోవడం వంటి ఘటనలైతే ఆసుపత్రి సిబ్బంది వాటిని ధ్రువీకరించాల్సి ఉంటుంది. పాలసీదారుడు మరణించిన సందర్భంలో క్లెయిమ్ కోసం నామినీ అభ్యర్థన దాఖలు చేయాలి. ఒకవేళ నామినీ పేరును పాలసీదారుడు పొందుపరచకపోతే, అప్పుడు చందాదారుని చట్టపరమైన వారసుడు క్లెయిమ్ కోసం దాఖలు చేసుకోవచ్చు. క్లెయిమ్ డబ్బులు నామినీ బ్యాంకు ఖాతాలో జమవుతాయి.
గమనిక: పాలసీదారులు ఇది మెడిక్లెయిమ్ పాలసీ కాదు అన్న విషయాన్ని గుర్తుంచుకోవాలి. అందువల్ల ఈ పథకం కింద మీకు ఎలాంటి ఆసుపత్రి ఖర్చులు చెల్లించరు. కేవలం ప్రమాదంలో మరణించినా లేదా శాశ్వత, పాక్షిక వైకల్యానికి గురైనప్పుడు మాత్రమే ప్రయోజనాలు అందుతాయి.