ఆఫీసుకు రాకుండా ఇంట్లో హాయిగా నిద్రపోండని ఓ కంపెనీ ఉద్యోగులకు బంపర్ ఆఫర్ ఇచ్చింది. అసలు ఏంటా కంపెనీ, ఈ ఆఫర్ ఎందుకు ఇచ్చిందో తెలుసుకుందాం..
ఉరుకుల పరుగుల జీవితంలో చాలా మంది సరైన సమయానికి భోజనం చేయడం లేదు. కరెక్ట్ టైమ్‌కు నిద్రపోవడం లేదు. ఈ లైఫ్ స్టైల్ వారి ఆరోగ్యంతో పాటు కెరీర్ పైనా ప్రభావం చూపిస్తోంది. అదే కంటికి సరిపడా నిద్రపోతే.. ఒంటికి అలసట తీరుతుంది. రోజు ఎంతో ఉత్సాహంగా కనిపిస్తుంది. పనిలో, ఆలోచనల్లో చాలా స్పష్టత వస్తుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ప్రపంచ నిద్ర దినోత్సవం వేళ బెంగళూరుకు చెందిన వేక్‌ఫిట్ సొల్యూషన్స్ కంపెనీ ఓ వినూత్న నిర్ణయం తీసుకుంది. ఇవ్వాళ తమ ఉద్యోగులకు ఐచ్ఛిక సెలవును ప్రకటించింది. సిబ్బందికి ఆరోగ్యకరమైన జీవనాన్ని అలవర్చే దిశగా ఈ నిర్ణయం తీసుకుంది వేక్‌ఫిట్. ఈ విషయాన్ని ఆ సంస్థ లింక్డ్ఇన్లో పోస్టు చేసింది.
‘వరల్డ్ స్లీప్ డే సందర్భంగా మార్చి17, 2023న వేక్‌ఫిట్ ఎంప్లాయీస్ అందరికీ ఒకరోజు విశ్రాంతి ఇస్తున్నాం. ఈ లాంగ్ వీకెండ్‌లో తగినంత సేదదీరడానికి ఇది సరైన ఛాన్స్’ అని ఉద్యోగులకు వేక్‌ఫిట్ మెయిల్ చేసింది. పరుపులు, సోఫాలు విక్రయించే ఈ కంపెనీ.. ఇలా ఉద్యోగులకు నిద్రను కానుకగా ఇచ్చిందని చెప్పొచ్చు. ‘గ్రేట్ ఇండియన్ స్లీప్ స్కోర్ కార్డు పేరిట నిర్వహించిన ఆరో విడత సర్వేలో.. 2022 నుంచి చూస్తే పనివేళ్లల్లో నిద్రముంచుకు వచ్చే వారి సంఖ్య 21శాతం పెరిగిందని తేలింది. అలసటతో నిద్ర లేచేవారి విషయంలో 11 శాతం పెరుగుదల కనిపించిందని స్పష్టమైంది. ‘ఈ నిద్రలేమి పరిస్థితులను గమనిస్తే.. ప్రస్తుత కాలంలో నిద్ర బహుమతికి మించిందేముంది చెప్పండి! నిద్ర ప్రియులుగా ఈ రోజును మేం ఓ పండుగగా పరిగణిస్తాం’ అని వేక్‌ఫిట్ తన మెసేజ్‌లో పేర్కొంది.