అందరూ ఇ-కామర్స్ సైట్స్, ఆన్ లైన్ షాపింగ్ కు బాగా అలవాటు పడిపోయారు. గుండుసూది మొదలు ప్రతి వస్తువు ఇ-కామర్స్ సైట్స్ నుంచే కొనుగోలు చేస్తున్నారు. దాదాపుగా అన్నిసార్లు నాణ్యమైన, అసలైన వస్తవులు పంపించే ఇ-కామర్స్ సైట్లు.. కొన్నిసార్లు మాత్రం పొరపాట్లు చేశాయి. అంటే ఫోన్ బుక్ చేస్తే మామిడికాయలు, సబ్బు బిళ్లలు, రాళ్లు రావడం చూశాం. ఇలాంటి ఘటనలు సాధారణంగా అందరినీ భయాందోళనకు గురిచేసినవే. అయితే ఆ తర్వాత సంస్థలు సెల్లర్స్ విషయంలో కఠినంగా వ్యవహరిచడంతో అలాంటి ఘటనలు జరగలేదు. కానీ, ఇప్పడు ఒక ఘటన దేశం మొత్తాన్ని నోరెళ్లబెట్టేలా చేసింది.
ఒక వస్తువు బదులు ఒకటి రావడం, రాళ్లు రప్పలు రావడం ఓకేగానీ.. ఇప్పుడు నయా మోసం వెలుగు చూసింది. ఏకంగా ఒక డూప్లికేట్ వస్తువుని డెలివరీ చేశారు. ఒక వ్యక్తి ఐఫోన్ 14 ప్రో మ్యాక్స్ బుక్ చేయగా.. అచ్చు అలాగే ఉండే డమ్మీ ఐఫోన్ ఒకటి సెండ్ చేశారు. ఐఫోన్ కొన్నాన్న సంతోషం ఆ వ్యక్తి చాలా కొద్దిసేపు మాత్రమే ఉంది. ఎంతో ఆత్రుతగా బాక్స్ ఓపెన్ చేసి.. కాసేపటికే అది ఒరిజినల్ కాదని తెలుసుకుని గగ్గోలు పెట్టాడు. వెంటనే స్టోర్ కి పరిగెత్తాడు. అక్కడ కాసేపు పరీక్షించిన తర్వాత అది డూప్లికేట్ అని తేల్చారు. చేసేది లేక నా డబ్బు నాకు వెనక్కి ఇవ్వండి అంటూ రిక్వెస్టులు పంపాడు. అమెజాన్ వంటి సంస్థ నుంచి ఇలాంటి ఘటన జరగడంతో.. ఇప్పుడు ఆన్ లైన్లో షాపింగ్ చేసేవారు భయాందోళనకు గురవుతున్నారు.
అక్షయ్ తుంగా అనే వ్యక్తి అమెజాన్ లో యాపిల్ ఐఫోన్ 14 ప్రో మ్యాక్స్ ని బుక్ చేశాడు. అతని అనుభవం గురించి పోస్ట్ చేశాడు. “నేను ఫిబ్రవరి 5న అమెజాన్ లో ఐఫోన్ 14 ప్రోమ్యాక్స్ బుక్ చేశాను. తర్వాతిరోజే డెలివరీ కూడా వచ్చింది. ఎంతో ఆసక్తిగా ఫోన్ ఓపెన్ చేశాను. కాసేపటికి నాకు ఆ ఫోన్ మీద అనుమానం వచ్చింది. దాని డిస్ ప్లే సరైందిగా అనిపించలేదు. పైగా కెమెరాలో పోట్రెయిట్ ఆప్షన్ లేదు. ట్విట్టర్, ఫేస్ బుక్, వాట్సాప్ ముందే ఇన్ స్టాల్ చేసున్నాయి. ఆ ఫోన్ ఫాంట్ కూడా ఐఫోన్ లా అనిపించలేదు. యాపిల్ సైట్ లో సీరియల్ నంబర్ ఎంటర్ చేస్తే సరైందిగానే ఉంది. వెంటనే దగ్గర్లో ఉన్న యాపిల్ స్టోర్ కు పరిగెత్తాను. అక్కడ సేల్స్ ఎగ్జిక్యూటివ్ అది ఒరిజినల్ కాదని చెప్పాడు. ఎందుకైనా మంచిది సర్వీస్ యూనిట్ కి వెళ్లమన్నాడు.”
“నేను సర్వీస యూనిట్ కి వెళ్లాను. అక్కడ పరీక్షించిన తర్వాత ఆ యాపిల్ ఐఫోన్ ఒరిజినల్ కాదని తేల్చారు. బాక్స్ మీదున్న సీరియల్ నంబర్ ఒరిజినల్ అని వచ్చింది. కానీ ఎక్స్ టర్నల్ వీఎంఐ మాత్రం కరెక్ట్ కాదని చూపించింది. అప్పారియే రిటైల్ అనే సెల్లర్ నుంచి నేను ఈ ఫోన్ కొనుగోలు చేశాను. వెంటనే అమెజాన్ కు రిటర్న్ రిక్వెస్ట్ పెట్టాను. రిఫండ్ కావాలని కోరాను. పలు ఫాలోఅప్స్ తర్వాత రీప్లేస్మెంట్ ఆర్డర్ రిక్వెస్ట్ తీసుకున్నారు. నేను జాతీయ కన్జ్యూమర్ ఫోరంలో కూడా కంప్లైంట్ రైజ్ చేశాను. అమెజాన్ లో నాకు ఇలా జరగడం ఇదే మొదటిసారి. అమెజాన్, దాని సెల్లర్ నుంచి ఇలాంటి ఒక పరిస్థితి వస్తుందని ఊహించలేదు” అంటూ అక్షయ్ తుంగా చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం ఈ మొత్తం వ్యవహారం దేశవ్యాప్తంగా వైరల్ అవుతోంది.