సాధారణంగా ప్రజలు తమ దగ్గర ఉన్న డబ్బులను బ్యాంకుల్లో జమ చేస్తారు. తమకు అవసరం ఉన్నప్పుడల్లా కొద్ది మెుత్తంలో తీసుకుంటూ ఉంటారు. ఇలా బ్యాంకుల్లో డబ్బు రోటేషన్ అవుతూ ఉంటుంది. అయితే ఈ క్రమంలో కొన్ని ఖాతాల్లో డబ్బు అలాగే మూలకు పడి ఉండడాన్ని ఆర్బీఐ గుర్తించింది. వాటిని క్లెయిమ్ చేయని నిధులు అంటారని పేర్కొంది. ఈ నిధుల గురించి మరిన్ని వివరాలను రిజర్వ్ బ్యాంక్ వెల్లడించింది. మరి ఆ వివరాల్లోకి వెళితే..
బ్యాంకింగ్ రంగంలో క్లెయిమ్ చేయని నిధులు మొత్తం భారీగా పెరిగినట్లు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) వార్షిక నివేదిక పేర్కొంది. దీని ప్రకారం.. 2020–21 ఆర్థిక సంవత్సరంలో రూ.39,264 కోట్లు ఉండగా, 2021–22 ఆర్థిక సంవత్సరంలో ఏకంగా రూ.48,262 కోట్లకు పెరిగాయి. ఈ నిధుల్లో అధిక మొత్తం రెండు తెలుగు రాష్ట్రాలతో సహా.. తమిళనాడు, పంజాబ్, గుజరాత్, మహారాష్ట్ర, బెంగాల్, కర్ణాటక, బిహార్‌లు ఈ జాబితాలో ఉన్నాయి.
క్లెయిమ్ చేయని నిధులు అంటే..
సెంట్రల్ బ్యాంక్ నిబంధనల ప్రకారం.. 10 సంవత్సరాల పాటు బ్యాంక్ ఖాతా నుంచి డబ్బును తీయకుండా అలాగే ఉంచితే లేదా మెచ్యురిటీ తేది నుంచి అంటే! పలానా తారిఖు నుంచి ఖాతాలో డబ్బును తీసుకోవచ్చు అని చెప్పినా ఆ ఖాతాలో నగదు ఎవరూ తీయక పోవడం. ఇలాంటి ఖాతాల్లో ఉన్న నగదునే క్లెయిమ్ చేయని నిధులుగా పిలుస్తారు.
ఈ తరహా డబ్బును బ్యాంకులు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నిర్వహించే ‘డిపాజిటర్ ఎడ్యుకేషన్ అండ్ అవేర్ నెస్ ఫండ్’కు బదిలీ చేస్తాయి. అయితే డిపాజిటర్లు తమ డబ్బు ను వడ్డీతో పాటు బ్యాంక్ వద్ద ఎప్పటికైనా క్లెయిమ్ చేసుకోవచ్చు. బ్యాంకులు, అలాగే ఆర్‌బీఐ ఎప్పటికప్పుడు ప్రజలకు అవగాహన కల్పిస్తున్నప్పటికీ ఇలా ఖాతాల్లో డబ్బు పెరగడం ఆలోచించాల్సిన అంశం అని అధికారులు పేర్కొంటున్నారు.
ఈ డిపాజిట్లు పెరగడానికి ప్రధాన కారణం సేవింగ్స్, కరెంట్ ఖాతలను మూసివేయక పోవడమే. ఒకే వ్యక్తి నాలుగైదు ఖాతాలను తెరచి అందులో కొద్దో గొప్పో నగదును వదిలివెలుతూ ఉంటారు. అదీ కాక నామినిలకు సంబంధించిన డబ్బును తీసుకోవడానికి వారసులు ముందుకు రాకపోవడమూ ఓ కారణంగా అధికారులు చెప్తున్నారు. ఇలా డబ్బు ఖాతాల్లో ఉండటం పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.