తరచూ క్యాబ్ బుక్ చేసుకునే అలవాటు మీకుందా? ఎక్కువగా క్యాబ్స్‌లో ప్రయాణిస్తున్నారా? అయితే మీ ఫోన్ ఛార్జింగ్‌కు, క్యాబ్ కంపెనీలు ఛార్జ్ చేసే దానికి సంబంధం ఉందని తెలుసా!
సాంకేతికత రోజురోజుకీ మరింతగా అభివృద్ధి చెందుతోంది. స్మార్ట్ ఫోన్ల వినియోగం బాగా పెరిగినప్పటి నుంచి టెక్నాలజీ అందరికీ అందుబాటులోకి వచ్చేసింది. ఫోన్ చేతిలో ఉంటే అన్నీ మన దగ్గర ఉన్నట్లే అనేలా పరిస్థితి తయారైంది. ఏదైనా కొనాలన్నా యూపీఐ యాప్స్‌తో పేమెంట్స్ చేసేస్తున్నారు. ఫుడ్ కావాలన్నా మొబైల్లో నుంచే ఆర్డర్ చేస్తున్నారు. ఇంక ఎక్కడికైనా వెళ్లాలన్న ఓలా, ఉబర్ లాంటి ట్యాక్సీ సర్వీసులను ఫోన్లోనే బుక్ చేసుకుంటున్నారు. అయితే ఈ ట్యాక్సీ సర్వీసుల్లో చెల్లింపుల గురించి కొన్ని సందేహాలు ఎప్పటి నుంచో ఉన్నాయి. ఈ సమస్య మీద ఒక బెల్జియన్ వార్తాపత్రిక రీసెంట్గా కొన్ని నిజాలను బయటపెట్టింది.
ఉబర్ క్యాబ్స్ మొబైల్ ఫోన్లో బ్యాటరీ తక్కువగా ఉన్నప్పుడు ఒక ఛార్జ్, ఎక్కువగా ఉన్నప్పుడు మరోలా ఛార్జ్ వసూలు చేస్తున్నట్లు ఒక రీసెర్చ్ ద్వారా వెల్లడైంది. దీనికి కొన్ని ఉదాహరణలను కూడా ఆ పరిశోధన చూపించింది. డెర్నియల్ హ్యూర్ బ్రస్సెల్స్‌లోని కార్యాలయం నుంచి సిటీ సెంటర్‌కు వెళ్లేందుకు రెండు ఐఫోన్ మొబైల్స్ ద్వారా ట్యాక్సీ బుక్ చేశారు. 84 శాతం ఛార్జ్ ఐఫోన్లో 16.6 యూరోలు (రూ.1,498), 12 శాతం బ్యాటరీ ఉన్న ఫోన్‌కు 17.56 యూరోలు (రూ.1,585) చూపించింది. దీంతో ఫోన్ ఛార్జింగ్‌లో ఉన్న తేడా ట్రిప్ ఛార్జ్ మీద ప్రభావం చూపిస్తోందని నిరూపితమైంది. కాగా, దీనిపై ఉబర్ సంస్థ స్పందిస్తూ.. బ్యాటరీ లెవల్స్ ఏ విధంగా ఉన్నా ధరల మధ్య ఎలాంటి వ్యత్యాసం ఉండదని, ఫోన్ ఛార్జింగ్‌కు ధరలకు ఎటువంటి సంబంధం లేదని స్పష్టం చేసింది.