ఎలాన్ మస్క్ ట్విట్టర్ సీఈఓగా ఛార్జ్ తీసుకున్నాక ఛార్జీల బాదుడు ఎక్కువైపోయిందన్న విమర్శలు ఉన్నాయి. వెరిఫైడ్ ఖాతాలను నిర్ధేశించే బ్లూ టిక్ కోసం సబ్ స్క్రిప్షన్ ప్లాన్స్ ను ప్రవేశపెట్టారు. అయితే కొంతమంది వినియోగదారులు డబ్బులు చెల్లించి బ్లూ టిక్ తీసుకుంటుండగా.. కొందరు మాత్రం మాకు బ్లూ టిక్కు వద్దు, బొటిక్కు వద్దు అని అంటున్నారు. ఇదిలా ఉంటే తాజాగా ట్విట్టర్ కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. కొంతమందికి ఉచితంగా బ్లూ టిక్ ను ఇవ్వాలనుకుంటున్నట్లు తెలుస్తోంది.
ఎలాన్ మస్క్ సీఈఓ అయ్యాక పెయిడ్ ట్విట్టర్ బ్లూ టిక్ సబ్ స్క్రిప్షన్ విధానాన్ని తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. వినియోగదారుల ఖాతాలకు చెందిన పాత వెరిఫైడ్ బ్లూ టిక్ బ్యాడ్జిని తీసేసి.. బ్యాడ్జి కొనుగోలు చేసిన వారికి మాత్రమే బ్లూ టిక్ సదుపాయం కలిపిస్తుంది ట్విట్టర్. ఇప్పటికే గతంలో ఉన్న బ్లూ టిక్ లను తొలగించి ఏప్రిల్ 1 నుంచి పెయిడ్ బ్లూ టిక్ సబ్ స్క్రిప్షన్ విధానాన్ని ప్రవేశపెట్టింది. ఈ కారణంగా ప్రసిద్ధ మీడియా సంస్థ న్యూయార్క్ టైమ్స్ తమ ట్విట్టర్ ఖాతా బ్లూ టిక్ ను కోల్పోయింది. ఇక తమ ఉద్యోగుల ట్విట్టర్ ఖాతాలను వెరిఫై చేసేందుకు డబ్బులు చెల్లించబోమని వైట్ హౌస్ ఇప్పటికే ప్రకటించింది. వ్యాపార సంస్థలైతే వెరిఫైడ్ బ్లూ టిక్ కోసం ప్రతి నెలా రూ. 82 వేలు చెల్లించాల్సి ఉంటుంది.
అయితే తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం.. కొంతమందికి ఉచితంగా బ్లూ టిక్ లు అందించాలని ట్విట్టర్ సంస్థ నిర్ణయించుకుంది. కొన్ని సంస్థలు నెలవారీ ఛార్జీలను చెల్లించే పని లేకుండా మినహాయింపు ఉంటుందని తెలుస్తోంది. ట్విట్టర్ ను ఎక్కువగా వాడే 500 మంది ప్రకటన కర్తలకు బ్లూ టిక్ ను ఉచితంగా అందిస్తోంది. అలానే ఫాలోవర్లు అధికంగా ఉన్న 10 వేల అగ్రశ్రేణి సంస్థలకు కూడా వెరిఫైడ్ బ్లూ టిక్ ను ఉచితంగా అందిస్తున్నట్లు న్యూయార్క్ టైమ్స్ ఓ కథనాన్ని ప్రచురించింది. ఎలాన్ మస్క్ ట్విట్టర్ ను కొనుగోలు చేసినప్పటి నుంచి సంస్థకు ప్రకటనల ద్వారా వచ్చే ఆదాయం తగ్గిపోయింది.
డబ్బులిచ్చి బ్లూ టిక్ కొనుక్కోవడం అవసరమా అని చెప్పి.. చాలా కంపెనీలు నిరాకరించాయి. వీటిలో భారీ అడ్వర్టైజింగ్ ఏజెన్సీలు కూడా ఉన్నాయి. ఈ ఏజెన్సీలు ట్విట్టర్ వినియోగంపై తమ క్లైంట్స్ కు జాగ్రత్తలను సూచించాయి. ఈ నేపథ్యంలో వెరిఫైడ్ బ్యాడ్జిని ఉచితంగా అందిస్తే బాగుంటుందన్న అభిప్రాయంలో ట్విట్టర్ ఉన్నట్లు తెలుస్తోంది. అడ్వర్టైజర్స్ కు ఉచితంగా బ్లూ టిక్ ఇవ్వడం ద్వారా తమ కంపెనీ ప్రకటనల ఆదాయాన్ని పెంచుకోవచ్చునని ట్విట్టర్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఇదే నిజమైతే గనుక ఇక నుంచి ప్రకటన కర్తలు బ్లూ టిక్ కోసం డబ్బులు చెల్లించే పని ఉండదు. అయితే కేవలం 500 మందికి మాత్రమే అవకాశం ఉంటుంది. మరి దీనిపై మీ అభిప్రాయమేమిటో కామెంట్ చేయండి.