టెస్లా వ్యవస్థాపకుడు ఎలన్ మాస్క్ గురించి ప్రత్యేక పరిచయం అక్కరలేదు. ఎప్పుడూ ఏదో ఒక కాంట్రవర్సీతో తరచూ వార్తల్లో నిలుస్తుంటారు. తనకు సంబంధించిన ప్రతి అప్ డేట్ సోషల్ మీడియాలో పంచుకుంటాడు. ఎలాన్ మాస్క్ 44 బిలియన్ డాలర్లతో ట్విట్టర్ కొనుగోలు చేసిన విషయం తెలిసిందే. మాస్క్ ట్విట్టర్ పగ్గాలు చేపట్టిన తర్వాత టాప్ పోస్టుల్లో ఉన్న వ్యక్తులతో పాటు వేల సంఖ్యల్లో ఉద్యోగులను తొలగించారు. అంతేకాదు తన వద్ద పనిచేయాలంటే.. తాను పెట్టిన రూల్స్ తప్పకుండా పాటించాల్సిందే అంటూ హెచ్చరికలు జారీ చేశారు ఎలాన్ మాస్క్.
భారత దేశంలో దాదాపు తొంబై శాతం వరకు ట్విట్టర్ ఉద్యోగులను తొలగించింది. దీనిపై పెద్ద దుమారమే చెలరేగుతుంది. ఎలాన్ మాస్క్ ట్విట్టర్ పగ్గాలు చేపట్టిన తర్వాత కొత్త పాలసీ విధానాల్లో తనదైన మార్క్ చూపిస్తున్నారు. అంతే కాదు ఏ స్థాయి ఉద్యోగి అయినా సరే 12 గంటలు ఖచ్చితంగా పని చేయాల్సిందే అని హుకుం జారీ చేశాడు. ఒకవేళ అలా పనిచేయలేని వారు నిర్మోహమాటంగా తన సంస్థ నుంచి తొలగిపోయవాలని.. వారికి మూడు నెలల జీతం కూడా చెల్లిస్తానని తెలిపినట్లు సమాచారం. ఎలాన్ మాస్క్ నిర్ణయంపై పలువురు ఎంప్లాయిస్ అసంతృప్తితో ఉన్నట్లు తెలుస్తుంది.
ఇదిలా ఉంటే ట్విట్టర్ కార్యాలయాలు తాత్కాలికంగా మూసివేస్తున్నారు. త్వరలో మళ్లీ తెరుచుకుంటాయని.. ఉద్యోగులకు సమాచారం అందించినట్లు ట్విట్టర్ సంస్థ పేర్కొంది. అయితే ఇప్పటికిప్పుడు ఆఫీస్ బిల్డింగ్స్ ఎందుకు మూసి వేస్తున్నారన్న విషయంపై ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు ట్విట్టర్ సంస్థ. ఇటీవల ఎలాన్ మాస్క్ ఉద్యోగులు ఎక్కువ గంటలు పనిచేయాలని.. మెరుగైన పనితీరు చూపించిన వారిని మాత్రమే గుర్తిస్తామని క్లారిటీ ఇచ్చారు.
ఈ నేపథ్యంలో ఆ కంపెనీలో చాలా మంది ఉద్యోగులు సంస్థను వీడుతున్నట్లు.. వందల సంఖ్యలో తమ ఉద్యోగాలకు రాజీనామా చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. పలువురు ఇంజనీర్లు కూడా సంస్థను వదిలి వెల్లిపోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇక ట్విట్టర్ విజయవంతం చేయడానికి మీరు చేసిన ప్రయత్నాలకు ధన్యవాదాలు అని ట్విట్టర్ లో పేర్కొన్నారు ఎలాన్ మాస్క్.