డబ్బులను పొదుపు చేయాలనే ఆలోచన రావడం భవిష్యత్ లో ఎవరికైనా మంచిదే. ఇలా దీర్ఘకాల పొదుపు మూలంగా మీరు ఒక వయసుకు వచ్చాక మీకు ఆర్థిక భరోసా కూడా ఉంటుంది. అందుకే.. ఇప్పటివరకు అలాంటి ఆలోచన చేయనివారు సైతం.. పొదుపు గురుంచి ఒక ఆలోచన చేయండి. ఎటువంటి రిస్క్ లేకుండా పెట్టిన పెట్టుబడులపైన మంచి ఆదాయం రావాలంటే పోస్ట్ ఆఫీస్ డిపాజిట్ స్కీమ్స్ ఉత్తమమైనవి అని చెప్పుకోవాలి. వీటితో భద్రతతో పాటు రాబడి కూడా అధికంగా ఉంటుంది. అలాంటి ప్రజాదరణ పొందిన కొన్ని తపాలా కార్యాలయ పథకాల వివరాలు మీకు అందిస్తున్నాం. సుకన్య సమృద్ధి యోజన, సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీం, పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్, కిసాన్ వికాస్ పత్ర, నేషనల్ సేవింగ్స్ సర్టిఫికేట్ స్కీమ్ వంటివి ఉన్నాయి. వీటి గురుంచి పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
సుకన్య సమృద్ధి యోజన:
ఆడబిడ్డ జన్మించిన క్షణం నుంచి 10ఏళ్ల వయసు వచ్చేలోపు ఈ పథకం కింద అకౌంట్ తెరవచ్చు. 10 ఏళ్ళు దాటితే అకౌంట్ తెరవడానికి సాధ్యపడదు. ఆడపిల్లకు 18 సంవత్సరాల వయసు వస్తే.. ఖాతా ఆమె ఆధీనంలోకి వస్తుంది. అప్పటివరకు తల్లిదండ్రులకు మాత్రమే అకౌంట్ పై అధికారం ఉంటుంది.
సుకన్య సమృద్ధి ఖాతా ఇన్వెస్ట్‌మెంట్ పీరియడ్ 15 సంవత్సరాలు కాగా.. మెచ్యూరిటీ కాలం 21 ఏళ్లు. అమ్మాయికి 18 ఏళ్లు వచ్చిన తర్వాత కొంత డబ్బులు విత్‌డ్రా చేసుకోవచ్చు. 21 ఏళ్ల తర్వాత పూర్తి డబ్బులు పొందొచ్చు. సుకన్య సమృద్ధి యోజన పథకంపై ప్రస్తుతం 7.6 శాతం వడ్డీ రేటు లభిస్తోంది. ఈ పథకంలో ఒక ఆర్థిక సంవత్సరంలో కనిష్టంగా రూ.250, గరిష్టంగా రూ.1,50,000 వరకు జమ చేయవచ్చు.
సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్:
సీనియర్ సిటిజన్స్ సేవింగ్స్ స్కీమ్ ఖాతా తెరవాలంటే 60 ఏళ్లు పైబడి ఉండాలి. అలాగే సదరు వ్యక్తి భారతీయ పౌరుడై ఉండాలి. 55 ఏళ్లు పైబడిన 60 ఏళ్ల కంటే తక్కువ వయస్సు ఉన్న రిటైర్డ్ సివిల్ ఉద్యోగులు, పదవీ విరమణ ప్రయోజనాలను స్వీకరించిన ఒక నెలలోపు పెట్టుబడి పెట్టాలనే షరతుకు లోబడిన వారు ఈ స్కీమ్ ఖాతాను తెరవడానికి అర్హులు.
ఈ స్కీమ్ మెచ్యూరిటీ కాలం 5 ఏళ్లు. ప్రస్తుతం సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్‌పై 7.4 శాతం వడ్డీ లభిస్తోంది. రూ.1000తో ఈ స్కీమ్‌లో ఖాతా తెరవొచ్చు. గరిష్టంగా రూ.15 లక్షల వరకు డబ్బులు ఇన్వెస్ట్ చేయొచ్చు.
పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్:
పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్(పీపీఎఫ్) ఖాతాను ఎవరైనా తెరవవచ్చు. అయితే పిల్లలకు 18 ఏళ్లు వచ్చే వరకు గార్డియన్ అకౌంట్ నిర్వహణ చూసుకుంటారు. ఇకపోతే పీపీఎఫ్ మెచ్యూరిటీ కాలం 15 ఏళ్లు. అవసరం అనుకుంటే పీపీఎఫ్ మెచ్యూరిటీ కాలాన్ని ఐదేళ్ల చొప్పున పొడిగించుకోవచ్చు.
ఆర్థిక సంవత్సరంలో కనీసం రూ.500, గరిష్టంగా రూ.1,50,000 నగదు జమ చేయవచ్చు. ప్రస్తుతం 7.1 శాతం వడ్డీ రేటు లభిస్తుంది.
పీపీఎఫ్‌లో డబ్బులు పెడితే ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్ 80సీ కింద పన్ను మనిహాయింపు లభిస్తుంది. పీపీఎఫ్ ఖాతాలో ఏడాదికి రూ.1.5 లక్షలు ఇన్వెస్ట్ చేస్తే.. 15 ఏళ్ల తర్వాత చేతికి రూ.40 లక్షలకు పైగా వస్తాయి.
కిసాన్ వికాస్ పత్ర:
కిసాన్ వికాస్ పత్ర పథకానికి సంబంధించిన అకౌంట్‌లో ముగ్గురు సభ్యులవరకు జాయింట్ అకౌంట్ తెరవొచ్చు. పదేళ్ల వయసున్న మైనర్లు కూడా తమ పేరు మీద నేరుగా ఖాతా తెరవొచ్చు.ఇందులో పెట్టుబడి పెట్టడానికి పరిమితి లేదు. కానీ కనీస పెట్టుబడి రూ.1000 ఉండాలి. అంటే మీరు ఎంత డబ్బునైనా 1000 రూపాయల గుణిజాల్లో పెట్టుబడి పెట్టవచ్చు. అంటే.. రూ. 1,000, రూ. 2,000, రూ. 3,000.. ఇలా పొదుచేయాల్సి ఉంటుంది.
ప్రస్తుతం కిసాన్ వికాస్ పత్రపై సంవత్సరానికి 6.9 శాతం వడ్డీ లభిస్తోంది. ఇందులో పెట్టుబడి పెడితే, మీరు డిపాజిట్ చేసిన మొత్తం 124 నెలల్లో (10 సంవత్సరాల 4 నెలలు) రెట్టింపు అవుతుంది. ఉదాహరణకు, మీరు ఈ పథకంలో రూ. 5 లక్షలు పెట్టుబడి పెట్టారని అనుకుందాం.. 124 నెలల తర్వాత మీకు రూ. 10 లక్షలు వస్తాయి.
నేషనల్ సేవింగ్స్ సర్టిఫికెట్:
ఖాతాను రూ.100లతో ప్రారంభించాలి. ఎంతైనా పొదుపు చేసుకోవచ్చు. గరిష్ఠ పరిమితి లేదు. ఆదాయ పన్ను 80సీ ప్రకారం ఉద్యోగులు, వ్యాపారులకు ఎంతో మేలైన పథకం. వార్షిక వడ్డీ రేటు 6.8శాతం. ఐదేళ్ల కాల పరిమితి ముగిసిన తర్వాత మళ్లీ కొనసాగించవచ్చు. నామినీ సౌకర్యం ఉంటుంది. ఎన్‌ఎస్‌సీ స్కీమ్‌లో రూ.15 లక్షలు ఇన్వెస్ట్ చేస్తే ఐదేళ్ల తర్వాత చేతికి దాదాపు రూ.21 లక్షలు వస్తాయి. ఈ ప్రభుత్వ పథకాలపై.. మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
ఇదీ చదవండి: Post Office Scheme: ఈ పథకంలో రూ. లక్ష ఇన్వెస్ట్ చేస్తే, రూ. 2 లక్షలు పక్కా.. కేంద్ర ప్రభుత్వ హామీ!
ఇదీ చదవండి: Post Office Scheme: పోస్టాఫీసులో అద్భుత స్కీం.. రోజుకు రూ. 50 పొదుపుతో రూ. 35 లక్షల ప్రయోజనం!