సామాన్యుడి జేబుకు చిల్లు పెట్టడానికి ఉన్న ఏ మార్గాన్ని ప్రభుత్వం వదులుకోవడం లేదు. ఇప్పటికే పెరిగిన ధరలతో ఇబ్బందిపడుతున్న జనాల నెత్తిన టోల్ ట్యాక్స్ పెంపు రూపంలో మరో బాంబు వేసేందుకు రెడీ అవుతోంది ప్రభుత్వం. ఆ వివరాలు..
ఓవైపు నిత్యవసరాల ధరలు, ఇంధన ధరలు, బంగారం ధరలు రాకెట్ వేగంతో దూసుకెళ్తూ.. సామాన్యులకు చుక్కలు చూపిస్తున్నాయి. పెరుగుతున్న ధరలతో సామాన్యులు విలవిల్లాడుతున్నారు. కానీ ప్రభుత్వాలు ఏమాత్రం పట్టించుకోకుండా.. అవకాశం ఉన్న ప్రతి రంగంలో ధరల పెంపు చేపడుతూ పోతుంది. ఇప్పటికే ఇంధన ధరలు, రవాణా ఛార్జీలు పెరిగి.. ప్రయాణాలంటేనే భయపడుతున్న జనాల నెత్తిన మరో బాంబ్ వేసేందుకు ప్రభుత్వం రెడీ అవుతోంది. వాహనదారులకు మరో షాక్ ఇచ్చేందుకు నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియ రెడీ అవుతోంది. ఏప్రిల్ 1 నుంచి టోల్ ఛార్జీలను భారీగా పెంచేందుకు సిద్ధమవుతున్నట్లు సమాచారం.
ఏప్రిల్ 1 నుంచి టోల్ ఛార్జీల మోత మోగనున్నట్లు తెలుస్తోంది. వచ్చే నెల నుంచి టోల్ ఛార్జీలు 5-10 శాతం పెరిగే అవకాశం ఉందని సమాచారం. ఇప్పటికే ఇంధన ధరలు చుక్కలను తాకడంతో.. ఇబ్బంది పడుతున్న వాహనదారులు.. టోల్ ఛార్జీలు పెంచితే మరింత ఇబ్బంది పడాల్సి వస్తుంది అంటున్నారు. జాతీయ రహదారులు రుసుములు నిబంధనలు 2008 ప్రకారం ప్రతి ఏడాది నూతన ఆర్థిక సంవత్సరం ప్రారంభం నుంచి అనగా ఏప్రిల్ 1 నుంచి టోల్ ఛార్జీలను సవరించాల్సి ఉంటుంది. ప్రతి ఏటా మార్చి చివరి వారంలో నేషనల్ అథారిటీ ఆఫ్ ఇండియా ఈ విషయమై సమావేశమై టోల్ ఛార్జీలపై.. కేంద్ర ఉపరితల రోడ్డు రవాణా మంత్రిత్వ శాఖకు సిఫారసులు చేస్తుంది. ఈ ప్రతిపాదనల మేరకు ఛార్జీలు పెంచడం లేదా తగ్గించడం చేస్తుంది మంత్రిత్వ శాఖ.
ఈ ఏడాది కూడా మార్చి చివరి వారంలో సమావేశం నిర్వహించారు. ఈ క్రమంలో టోల్ ఛార్జీల పెంపెకు ప్రభుత్వం ఆమోదం తెలిపిందని సమాచారం. కేంద్ర ప్రభుత్వ వర్గాల సమాచారం ప్రకారం కార్లు, లైట్ వేట్ మోటార్ వెహికిల్స్‌కు టోల్ గేట్ ఛార్జీలు 5 శాతం మేర పెంచే అవకాశాలు కనిపిస్తున్నాయి. అలానే లారీల వంటి హెవీ వెయిట్ వాహనాలకు టోల్ ఛార్జీలు 10 శాతం పెంచనున్నారని సమాచారం. ఇటీవలే అందుబాటులోకి వచ్చిన డిల్లీ-ముంబాయి ఎక్స్‌ప్రెస్ వేపై టోల్ ఛార్జీలు కిలోమీటరుకు రూ.2.19 వసూలు చేస్తున్నారు. దానిని మరో 10 శాతం పెంచే అవకాశాలు ఉన్నయి. అలాగే ముంబాయి-పుణె హైవేపై 18 శాతం టోల్ ఛార్జీలు పెంచుతున్నట్లు నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా బుధవారం ప్రకటించిన సంగతి తెలిసిందే.
టోల్ గేట్ ప్రాంతానికి 20 కిలోమీటర్ల దూరంలో ఉన్న ప్రజలకు నెల వారీ పాసులు జారీ చేస్తారు. ఏప్రిల్ 1 నుంచి ఈ పాస్ ఛార్జీలు సైతం దాదాపు 10 శాతం మేర పెంచే అవకాశాలు ఉన్నాయని అధికారులు చెబుతున్నారు. నేషనల్ హైవేస్ ఫీ రూల్స్ 2008 ప్రకారం టోల్ ప్లాజాలకు సమీపంలోని వారికి సైతం మినహాయింపులు లేవు. కానీ, 2022-23 ఆర్థిక సంవత్సరంలో అన్‌లిమిటెడ్ ట్రిప్పులతో నెలకి రూ.315 ధరతో నెల వారి పాసులు ఇస్తున్నారు. ఇక పాస్ ఛార్జీలను సైతం పెంచనున్నారు అని తెలుస్తోంది. మరి టోల్ ఛార్జీల పెంపుపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.