బంగారం అంటే ప్రేమలేని వాళ్లు ఎవరుంటారు చెప్పండి. పైగా మన దేశంలో అయితే బంగారు ఆభరణాలను ఇష్టపడని ఆడవారు ఉండరు అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. అందుకే భారతదేశంలో బంగారానికి బాగా డిమాండ్ ఉంటుంది. గత కొన్నేళ్లుగా బంగారాన్ని పెట్టుబడి సాధనంగా కూడా వాడుతున్నారు. గత కొన్నిరోజులుగా బంగారం ధర పెరుగుతున్న విషయం తెలిసిందే. కార్తీకమాసంలో పెళ్లిళ్లు జరగడం, ఈ మధ్యకాలంలో డిమాండ్ పెరగడంతో బంగారం ధర పెరుగుతూనే ఉంది. గత నెల రోజుల్లో ఒక్కరోజు మాత్రమే బంగారం ధర తగ్గింది. తాజాగా శుక్రవారం కూడా ధర పెరిగింది. అయితే ప్రస్తుతం బంగారం ధర ఎంతో ఉందో చూద్దాం.
బంగారం ధరను క్యారెట్లను బట్టే నిర్ణయిస్తారని తెలిసిందే. హైదరాబాద్‌లో శుక్రవారం 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.49,750కి చేరింది. గురువారం రూ.49,500 ఉండగా శుక్రవారం రూ.49,750కి చేరింది. ఇంకో రూ.250 పెరిగితే.. 22 క్యారెట్ బంగారం రూ.50 వేల మార్క్‌ని దాటిపోతుంది. ఇంక 24 క్యారెట్ బంగారం 10 గ్రాముల ధర చూస్తే.. రూ.280 పెరిగి రూ.54,000 నుంచి రూ.54,280కి చేరింది. ఈ పెరుగుదల ఇలాగే కొనసాగితే త్వరలోనే 24 క్యారెట్ బంగారం ధర రూ.55 వేల మార్కును చేరుకుంటుంది. ప్రస్తుతం పసిడి ప్రియులు బంగారం కొనేందుకు తటపటాయిస్తున్నారు. ఈ ధర ఇలాగే పెరుగుతూ పోతే.. ఎంత దూరం పోతుందో అంటూ ఒకింత కంగారు కూడా పడుతున్నారు.
మరోవైపు హైదరాబాద్‌లో ఒక్క బంగారం మాత్రమే కాదు.. వెండి ధరలు కూడా పెరుగుతూనే ఉన్నాయి. 50 రోజుల వ్యవధిలో వెండి ధర కిలోకి రూ.12 వేలు పెరిగింది. అక్టోబర్ 17న కిలో వెండి రూ.60,500 ఉండగా.. ప్రస్తుతం రూ.72,500కి చేరింది. పెళ్లిళ్ల సీజన్ వల్లే వెండి ధర కూడా పెరిగినట్లు చెబుతున్నారు. మరోవైపు బంగారం, వెండి ధరలు పెరుగుతుంటే ఆనంద పడేవారు కూడా ఉన్నారు. ప్రస్తుతం చాలామంది డిజిటల్ గోల్డ్, వెండిపై పెట్టుబడులు పెడుతున్న విషయం తెలిసిందే. ఇప్పుడు ఈ ధరలు ఇలా పెరిగిపోవడం చూసి పెట్టుబడిదారులు అంతా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. కొందరైతే ఈ తరుణాన్ని వాడుకుని సొమ్ము చేసుకుంటున్నారు.