నాలుగు రోజుల క్రితం భారీగా పెరుగుతూ వచ్చిన బంగారం తగ్గుతుంది. కాబట్టి బంగారం కొనేందుకు ఉత్సాహం చూపిస్తుంటారు. కానీ ఇది తగిన సమయమేనా? కాదా?
పసిడి ప్రియులకు శుభవార్త. వరుసగా రెండో రోజు బంగారం ధరలు తగ్గాయి. భారత్ లో ఆరేళ్ళ కనిష్టానికి బంగారం ధర పడిపోయిందని వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ వెల్లడించిన విషయం తెలిసిందే. 2023 మొదటి త్రైమాసికంలో 17 శాతానికి పడిపోయింది. బంగారం ధరలు పెరిగిపోవడంతో తగ్గినప్పుడు కొందాంలే అని మహిళలు బంగారం కొనేందుకు ఆసక్తి చూపించలేదని గోల్డ్ కౌన్సిల్ వెల్లడించింది. ఈ కారణంగానే బంగారం డిమాండ్ అనేది తగ్గిందని తేలింది. దీంతో బంగారం ధరలు దిగొస్తాయన్న అంచనాలు నెలకొన్నాయి. డిమాండ్ అండ్ సప్లై సూత్రం ఆధారంగా డిమాండ్ తక్కువ ఉండి సరఫరా అనేది ఎక్కువగా ఉంటే దాని ధర అనేది తగ్గుతుంది. బంగారం విషయంలో కూడా అదే జరుగుతుంది.
భారీగా పెరుగుతూ వచ్చిన బంగారం ధరలు ఆదివారం, సోమవారం బాగా తగ్గాయి. ప్రస్తుతం అంతర్జాతీయ మార్కెట్లో స్పాట్ గోల్డ్ ఔన్సు ధర 2020.16 డాలర్ల వద్ద కొనసాగుతుండగా.. ఔన్సు వెండి 25.68 డాలర్ల వద్ద ట్రేడ్ అవుతోంది. అయితే దేశీయంగా మాత్రం బంగారం ధరలు దిగొచ్చాయి. గడిచిన పది రోజులుగా చూసుకుంటే.. 22 క్యారెట్ల బంగారం ఏప్రిల్ 29న రూ. 55,850 ఉండగా.. మే 1న రూ. 150 తగ్గి రూ. 55,700కి చేరుకుంది. ఆ తర్వాత మే 3, 4, 5 వ తేదీల్లో రూ. 1500 పెరిగింది. దీంతో 10 గ్రాముల బంగారం రూ. 57,200 అయ్యింది. అయితే డిమాండ్ తగ్గిన కారణంగా మే 6, 7వ తేదీల్లో రూ. 710 తగ్గింది. దీంతో ప్రస్తుతం 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ. 56,490 వద్ద కొనసాగుతోంది. ఇక 24 క్యారెట్ల బంగారం కూడా తగ్గింది.
ఏప్రిల్ 29న రూ. 60,930 ఉన్న బంగారం.. మే 1న రూ. 170 తగ్గడంతో 60,760కి చేరుకుంది. మే 3, 4, 5 వ తేదీల్లో ఏకంగా రూ. 1640 పెరిగింది. దీంతో 24 క్యారెట్ల బంగారం రూ. 62,400కి చేరుకుంది. మే 6, 7 వ తేదీల్లో రూ. 770 తగ్గింది. దీంతో ప్రస్తుతం 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 61,630కి చేరుకుంది. ఈ ధరలు ఇంకా తగ్గే అవకాశం కనబడుతుందని నిపుణులు చెబుతున్నారు. అయితే వెండి ధర మాత్రం స్థిరంగా ఉంది. ఏప్రిల్ 29న కిలో వెండి రూ. 80,400 ఉండగా.. మే 5న గరిష్టంగా రూ. 83,700 కి చేరుకుంది. ఈ నెలలోనే వరుసగా 4 సార్లు పెరిగింది. ఏకంగా రూ. 3500 పెరిగింది. ఈ నెలలో కేవలం రెండు సార్లు మాత్రమే వెండి ధర తగ్గింది. మే 1న రూ. 200, మే 6న రూ. 1300 తగ్గింది. 7,8 తేదీల్లో వెండి ధర మాత్రం స్థిరంగా ఉంది. ప్రస్తుతం హైదరాబాద్ మార్కెట్లో కిలో వెండి ధర రూ. 82,400 వద్ద కొనసాగుతోంది.