గత ఐదు రోజులుగా తగ్గుతూ వచ్చిన బంగారం పసిడి ప్రియులకు షాక్ ఇచ్చింది. అక్షయ తృతీయ దగ్గర పడుతున్న క్రమంలో బంగారం ధర మళ్ళీ పుంజుకుంది. వెండి ధరలు కూడా బంగారం బాటలోనే పెరిగాయి. హైదరాబాద్ మార్కెట్లో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే?
బంగారం కొనేవారికి ఇది నిజంగా కాస్త బాధపెట్టే న్యూసే. ఈ నాలుగు రోజుల్లో బంగారం ధర తగ్గినప్పుడు కొన్న వారికి పర్లేదు. కానీ ఈరోజు బంగారం కొనాలనుకునేవారికి మాత్రం చేదు వార్తే. ఎందుకంటే బంగారం ధర మళ్ళీ పుంజుకుంది. ఏప్రిల్ 22న అక్షయ తృతీయ సందర్భంగా డిమాండ్ ఎక్కువ ఉంటుంది కాబట్టి బంగారం, వెండి ధరలు పెరుగుతున్నాయి. గత ఐదు రోజులుగా తగ్గుతూ వచ్చిన బంగారం ఇవాళ మాత్రం ఊహించని విధంగా పెరిగింది. 60 వేలకు పడిపోతుందనుకున్న బంగారం మళ్ళీ 61 వేలకు వెళ్ళిపోయింది. వెండి ధర కూడా బంగారం వెనకే పరుగులు పెడుతోంది. ప్రస్తుతం హైదరాబాద్ మార్కెట్లో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో చూద్దాం.
ప్రస్తుతం అంతర్జాతీయ మార్కెట్లో ఔన్సు స్పాట్ గోల్డ్ ధర 1993 డాలర్ల వద్ద ట్రేడ్ అవుతుంది. ఇక ఔన్సు వెండి ధర 25 డాలర్ల వద్ద ట్రేడ్ అవుతోంది. ప్రస్తుతం అయితే బంగారం, వెండి ధరలు అంతర్జాతీయ మార్కెట్లో తగ్గుతున్నాయి. నిన్న ఉదయం స్పాట్ గోల్డ్ 2005 డాలర్ల వద్ద ట్రేడ్ అవ్వగా ఇవాళ మాత్రం భారీగా పతనమైంది. ఏకంగా 12 డాలర్లు పడిపోయింది. వెండి ధర అయితే స్థిరంగానే ఉంది. అయినా గానీ దేశీయ మార్కెట్లో బంగారం, వెండి ధరలు పెరిగాయి. అక్షయ తృతీయ సందర్భంగా ఈ ధరల్లో మార్పులు కనిపిస్తున్నాయి. పది రోజులుగా బంగారం ధరలు పరిశీలిస్తే.. ఏప్రిల్ 10న 22 క్యారెట్ల బంగారం పది గ్రాముల వద్ద రూ. 55,400 వద్ద ఉంది. ఏప్రిల్ 11న సరాసరి రూ. 300 పెరిగి రూ. 55,700కి చేరుకుంది. ఏప్రిల్ 12న మళ్ళీ రూ. 500 పెరిగి రూ. 56,200కి చేరుకుంది. ఏప్రిల్ 13న రూ. 100 తగ్గింది. ఏప్రిల్ 14న మళ్ళీ రూ. 550 పెరిగింది.
ఏప్రిల్ 15 నుంచి ఏప్రిల్ 18 వరకూ వరుసగా నాలుగు రోజులు మాత్రం బంగారం ధర తగ్గుతూ వచ్చింది. ఈ నాలుగు రోజుల్లో రూ. 800 తగ్గింది. ఏప్రిల్ 19న రూ. 200 పెరిగింది. దీంతో 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం నేడు రూ. 56,050కి చేరుకుంది. ఇక 24 క్యారెట్ల బంగారం చూసుకుంటే.. ఏప్రిల్ 10న రూ. 430 తగ్గుదలతో రూ. 60,430 వద్ద ఉంది. ఏప్రిల్ 11, 12 తేదీల్లో ఏకంగా రూ. 880 పెరిగింది. ఏప్రిల్ 13న రూ. 110 తగ్గగా.. ఏప్రిల్ 14న ఏకంగా రూ. 600 పెరిగింది. ఏప్రిల్ 15 నుంచి 18 వరకూ నాలుగు రోజుల మీద రూ. 880 తగ్గింది. ఇవాళ మాత్రం రూ. 230 పెరుగుదలతో 61 వేల మార్కును దాటేసింది. నిన్నటి వరకూ 24 క్యారెట్ల బంగారం రూ. 60 వేల మీద ఉంటే ఇవాళ మాత్రం రూ. 61,150 వద్ద కొనసాగుతోంది.
బంగారం దిగొస్తుంది అనుకున్న క్రమంలో పెరగడం మొదలుపెట్టింది. ఇక వెండి ధరలు పరిశీలిస్తే.. మొన్న ఒక్కరోజే రూ. 1100 తగ్గిన వెండి మళ్ళీ పెరిగింది. నిన్న కిలో వెండి రూ. 80,500 ఉండగా.. ఇవాళ రూ. 500 పెరుగుదలతో రూ. 81,000కు చేరుకుంది. గత పది రోజులుగా ఉన్న వెండి ధరలు పరిశీలిస్తే.. ఏప్రిల్ 11న రూ. 80,400 ఉండగా.. మూడు రోజుల వ్యవధిలో ఏకంగా రూ. 2600 పెరిగి రూ. 83,000కి చేరుకుంది. ఏప్రిల్ 15న రూ. 1500 తగ్గడంతో కాస్త ఊరట లభించింది. ఏప్రిల్ 17న రూ. 100 పెరిగినా ఏప్రిల్ 18న రూ. 1100 తగ్గడంతో పర్వాలేదనిపించింది. ఏప్రిల్ 19న రూ. 500 పెరిగి రూ. 81 వేలకు చేరుకుంది. అక్షయ తృతీయ సందర్భంగా డిమాండ్ ఉండడంతో బంగారం, వెండి ధరల్లో పెరుగుదల ఉండే అవకాశం ఉంది. ఈ రెండు రోజులూ ఇంకా పెరిగే అవకాశం కనబడుతోంది.