పసిడి ప్రియులకు శుభవార్త. వరుసగా బంగారం ధరలు తగ్గుతున్నాయి. నాలుగు రోజులుగా బంగారం పతనమవుతూ వస్తుంది. వెండి ధర కూడా దిగొచ్చింది. ఒక్కరోజే ఏకంగా రూ. 1100 తగ్గాయి. ఇవాళ మార్కెట్లో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే?
బంగారం కొనేవారికి ఇది నిజంగా గుడ్ న్యూసే. ఐదు రోజుల క్రితం దాదాపు 62 వేల రూపాయలకు చేరుకున్న బంగారం ధర తగ్గుతుంది. అక్షయ తృతీయ పండుగ సమీపిస్తున్న తరుణంలో బంగారం తగ్గుతుండడం పసిడి ప్రియులకు మంచి వార్తే. అయితే ఈ ధర అక్షయ తృతీయ దగ్గర పడే సమయంలో పెరిగే అవకాశం ఉండచ్చు. ప్రస్తుతం అయితే బంగారం ధరలు తగ్గుతున్నాయి. గత ఐదు రోజులుగా చూసుకుంటే బంగారం ధరలు తగ్గుతూనే ఉన్నాయి. ఇది ఇలానే కొనసాగుతుందా? లేదా? అనేది తెలియదు గానీ ప్రస్తుతం అంతర్జాతీయంగా ద్రవ్యోల్బణం కారణంగా బంగారం దిగొచ్చింది. 62 వేల మార్కు దాటేస్తుందనుకున్న బంగారం 60 వేలకు పడిపోయింది. వెండి కూడా భారీ స్థాయిలో పతనమైంది. ప్రస్తుతం హైదరాబాద్ మార్కెట్లో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో చూడండి.
ప్రస్తుతం అంటే ఉదయం 08:15 గంటలకు అంతర్జాతీయ మార్కెట్లో స్పాట్ గోల్డ్ ఒక ఔన్సు ధర 2005.6 డాలర్ల వద్ద ట్రేడ్ అవుతుండగా.. ఔన్సు వెండి ధర 25.16 డాలర్ల వద్ద ట్రేడ్ అవుతోంది. గడిచిన పది రోజుల్లో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయన్నది పరిశీలిస్తే.. ఏప్రిల్ 9న 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ. 60,860 ఉండగా.. ఏప్రిల్ 10న రూ. 60,430 పలికింది. ఆరోజున రూ. 430 తగ్గింది. ఆ తర్వాత 11, 12 తేదీల్లో ఏకంగా రూ. 880 పెరిగి పసిడి ప్రియులకు షాకిచ్చింది. ఏప్రిల్ 13న రూ. 110 తగ్గి కాస్త ఊరట కలిగించింది. ఏప్రిల్ 14న ఏకంగా రూ. 600 పెరిగింది. దీంతో 24 క్యారెట్ల బంగారం రూ. 61,800 కి చేరుకుంది. ఇక బంగారం 62 వేలు దాటేస్తుంది అనుకున్న తరుణంలో తగ్గడం మొదలుపెట్టింది.
ఏప్రిల్ 15న ఏకంగా రూ. 760 తగ్గగా.. ఏప్రిల్ 16న రూ. 10 తగ్గింది. నిన్న అయితే ఏకంగా రూ. 110 తగ్గింది. వంద గ్రాముల బంగారం ధర రూ. 1100 మేర తగ్గింది. దీంతో ఇవాళ హైదరాబాద్ మార్కెట్లో 10 గ్రాముల స్వచ్ఛమైన బంగారం రూ. 60,920గా ఉంది. నిన్న ఇదే బంగారం రూ. 61,030గా ఉంది. ఇంకా తగ్గే అవకాశం కనబడుతోంది. ఇక 22 క్యారెట్ల బంగారం ధర కూడా ఇదే స్థాయిలో తగ్గుతూ వచ్చింది. ఏప్రిల్ 9న రూ. 55,790 పలికిన బంగారం.. ఇవాళ 55,850 పలుకుతోంది. 10 గ్రాముల వద్ద రూ. 90 తగ్గింది. నిన్న 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ. 55,940గా ఉంది. గడిచిన పది రోజుల్లో బంగారం ధరలు మూడు సార్లు పెరగగా.. ఆరు సార్లు తగ్గింది.
ఇక వెండి ధర కూడా ఇదే విధంగా తగ్గుతూ వచ్చింది. కిలో వెండి ఒక్కరోజే ఏకంగా రూ. 1100 తగ్గింది. ఏప్రిల్ 9న కిలో వెండి రూ. 80,200 ఉండగా.. ఇవాళ 80,500 వద్ద కొనసాగుతోంది. గడిచిన పది రోజుల్లో 5 సార్లు పెరిగిన వెండి ధర కేవలం 3 సార్లు మాత్రమే తగ్గింది. అయితే ఆ తగ్గడంతో కూడా హుందాతనాన్ని ప్రదర్శించింది. ఏప్రిల్ 10న రూ. 200 తగ్గగా, ఏప్రిల్ 15న భారీగా రూ. 1500 తగ్గింది. మళ్ళీ నిన్న అదే స్థాయిలో తగ్గింది. ఏప్రిల్ 18న ఏకంగా రూ. 1100 తగ్గింది. దీంతో ప్రస్తుతం హైదరాబాద్ మార్కెట్లో కిలో వెండి ధర రూ. 80,500 వద్ద కొనసాగుతోంది.