బంగారం, వెండి ధరలు స్వల్పంగా మారుతూ ఉన్నాయి. గత రెండు రోజులుగా పసిడి ధర స్థిరంగా ఉండగా.. నేడు కూడా అదే దారిలో వెళ్లింది. కానీ వెండి మాత్రం కాస్త భారీగానే పెరిగింది. ఇక నేడు వెండి, బంగారం ధరలు ఎలా ఉన్నాయి అంటే..
గత కొంత కాలంగా బంగారం, వెండి ధరలు దిగి వస్తున్నాయి. అంతర్జాతీయంగా డాలర్ పుంజుకోవడం, బాండ్ ఈల్డ్స్ డిమాండ్ పెరగడం దీనికి ప్రధాన కారణంగా చెప్పొచ్చు. సాధారణంగా అంతర్జాతీయ మార్కెట్‌లో డాలర్ విలువ పెరిగితే.. బంగారం, వెండి ధరలు పడిపోతుంటాయి. అయితే డాలర్ విలువ పెరుగుదల, తగ్గుదల అనేది యూఎస్ ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లపై ఆధారపడి ఉంటుంది. ఫెడ్ వడ్డీ రేట్లు పెంచితే.. డాలర్ విలువ ఆకర్షణీయంగా మారుతుంది. బంగారం, వెండి ధరలు తగ్గుతుంటాయి. కొన్ని రోజుల క్రితం ఫెడ్ వడ్డీ రేట్లు పెంచడంతో.. బంగారం, వెండి ధరలు దిగి వస్తున్నాయి. అయితే మార్చి ఆరంభం నుంచి పసిడి ధర పెరుగుతూ ఉంది. మరి నేడు బంగారం ధర ఎలా ఉంది అంటే..
బులియన్ మార్కెట్‌లో పరుగులు పెడుతున్న బంగారం ధరలకు తాజాగా బ్రేక్ పడింది. ఇక నేడు దేశీయంగా బంగారం ధర స్థిరంగా ఉండగా.. వెండి ధర మాత్రం కాస్త భారీగానే పెరిగింది. మంగళవారం ఉదయం వరకు నమోదైన ధరల ప్రకారం.. దేశంలో 22 క్యారెట్ 10 గ్రాముల బంగారం ధర రూ.51,850 ఉండగా.. 24 క్యారెట్ బంగారం తులం ధర రూ.56,550 గా ఉంది. ఇక నేడు హైదరాబాద్, న్యూఢిల్లీ వంటి ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో చూడండి..
హైదరాబాద్‌లో 22 క్యారెట్ బంగారం ధర రూ.51,850 ఉండగా, 24 క్యారెట్ బంగారం ధర తులం రూ.56,550గా ఉంది. అలానే దేశ రాజధాని న్యూఢిల్లీలో 22 క్యారెట్ 10 గ్రాముల పసిడి ధర రూ.51,950 ఉండగా.. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.56,700గా ఉంది. ఇక ఇటీవల భారీగా తగ్గిన వెండి ధరలు మంగళవారం కాస్త భారీగానే పెరిగాయి. ఇక నేడు హైదరాబాద్‌లో కింలో వెండి మీద ఏకంగా రూ.600 మేర పెరిగి రూ.70,600 మార్కుకు చేరింది. ఢిల్లీలో మాత్రం వెండి ధర స్వల్పంగా అంటే కేవలం రూ.100 ఎగబాకి రూ. 67 వేల మార్కు వద్ద ఉంది.
బంగారం కొనేవారికి ఇటీవల కేంద్రం కీలక ప్రకటన జారీ చేసిన సంగతి తెలిసిందే. వచ్చే నెల నుంచి ఆరంకెల కోడ్‌తో హాల్‌మార్క్ చేయని బంగారు ఆభరణాలపై నిషేధం విధిస్తున్నట్లు కేంద్రం కొన్ని రోజుల క్రితమే ప్రకటించింది. హాల్‌మార్క్ లేని బంగారు ఆభరణాల అమ్మకాలపై నిషేధం విధించింది. కస్టమర్లు పసిడి కొనేముందు గోల్డ్ జువెలరీపై హెచ్‌యూఐడీ ఉందో లేదో చెక్ చేసుకోవాలని స్పష్టం చేసింది. దీనిపై బీఐఎస్ యాప్ ద్వారా ఫిర్యాదులు కూడా చేయొచ్చని పేర్కొంది.