యువకుడు- ఉత్సాహవంతుడు.. కోరుకున్న ఉద్యోగం.. విదేశంలో లక్షల్లో జీతం. ఎక్కడో చిన్న అసంతృప్తి. ఏదో సాధించాలనే తపన.. ఆ తపనలో నుంచి ఓ మెరికలాంటి ఆలోచన పుట్టింది. అనుకున్నదే తడవుగా తన ఆలోచనను ఆచరణలో పెట్టాడు. చిన్నది అనుకున్న ఆలోచనే రూ.10 కోట్ల టర్నోవర్ బిజినెస్ గా అభివృద్ధి చెందింది. అంతేకాదు.. ఆ యువకుడికి వచ్చిన ఆ ఆలోచన ఇప్పుడు దేశవ్యాప్తంగా 25 వేల మంది యువతకు ఉపాధి కల్పిస్తోంది. వారి కాళ్ల మీద వారు నిలబడేలా భరోసానిస్తోంది. ఆ యువ సాఫ్ట్ వేర్ ఇంజినీర్ కు వచ్చిన చిన్న ఆలోచనే.. టీ కొట్టు బడ్డీలకు బ్రాండింగ్ ఇవ్వడం. అవునండి టీ కొట్టు బ్రాండింగ్ తోనే కోట్ల వ్యాపారం చేస్తున్నారు. ఆ కథేంటో మీరూ తెలుసుకోండి.
రాజమహేంద్రవరం పట్టణానికి సరిగ్గా 10 కిలోమీటర్ల దూరంలో కడియం అనే గ్రామం ఉంది. ఆ గ్రామం నర్సరీ, పాల ఉత్పత్తులకు బాగా ప్రాచుర్యం పొందింది. 2017 తర్వాత మరో యువ ఇంజినీర్ కు వచ్చిన ఆలోచనతో టీ బడ్డీల విషయంలో కూడా ఫేమస్ అయ్యింది. 2017లో అత్యాధునిక హంగులతో రాజమహేంద్రవరంలో ‘టీ టైమ్’ పేరిట తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్ ఓ టీ బడ్డీని ప్రారంభించారు. ఆ తర్వాత దానిని బ్రాండింగ్ చేసి.. తాజాగా వారణాసిలో ఓపెన్ అయిన ఫ్రాంచైజీతో కలిపి దేశవ్యాప్తంగా 1500 అవుట్ లెట్లకు చేర్చారు. అంతేకాదు ఈ టీ టైమ్ టీ బడ్డీలతో దేశంలో 25 వేల మందికి ఉపాధి కల్పిస్తున్నాడు. ఇదేదో పనిలేక చేసిన ఆలోచన కాదు.
వృత్తిపరంగా సాఫ్ట్ వేర్ ఇంజినీర్. చేసేది దుబాయ్ లో ఉద్యోగం. నెలకు లక్షల్లో జీతం. అయినా యువత కోసం ఏదో చేయాలనే తపనలో నుంచి పుట్టుకొచ్చిన ఈ ఆలోచన రూ.10 వేలతో మొదలై రూ.10 కోట్లకు చేరింది. నేపథ్యం పరంగా ఉదయ్ తండ్రి దివంగత వీరభోగవసంతరావు క్లాస్-1 కాంట్రాక్టర్. ఆ క్రమంలోనే ఉదయ్ ప్రాథమిక విద్య కడియం, కరైకల్ లో, ఇంటర్ పాండిచ్చేరిలో, బీటెక్ హైదరాబాద్ లో చేశారు. ఉదయ్ దక్షిణాది రాష్ట్రాల్లో దాదాపు అన్ని ప్రాంతాలను కవర్ చేశారు. దాదాపు దక్షిణాది అన్ని భాషలపై కూడా పట్టు సాధించారు. బీటెక్ తర్వాత దుబాయ్ లో ఉద్యోగం వచ్చింది. నేరుగా మకాం దుబాయ్ కి మార్చేశారు.
దుబాయ్ లో ఓ రోజు ఉదయ్ మిత్రులతో కలిసి ఓ కాఫీ షాపునకు వెళ్లారు. అక్కడ కాసేపు ఉన్న తర్వాత ఉదయ్ మదిలో ఓ ఆలోచన ప్రారంభమైంది. అక్కడ ఉండే టీ, కాఫీ ధరలు రూ.500 కంటే ఎక్కువే ఉన్నాయి. కానీ వాటి తయారీకి ఉపయోగించే ముడి సరుకులు మాత్రం రూ.30 మించి ధర ఉండవు. మరి అంత రేటు ఎందుకు పెట్టారు? అంత రేటు ఉన్నా కూడా ప్రజలు ఎందుకు ఆసక్తి చూపిస్తున్నారు? అప్పుడే ఉదయ్ తెలుసుకున్నారు.. రూ.500ల్లో రూ.30 వస్తువు విలువ అయితే.. మిగిలిన రూ.470 దాని బ్రాండ్ తో వచ్చిందని. అప్పుడే అనుకున్నారు.. సామాన్యుడికి కూడా తక్కువ ధరలో నాణ్యమైన సేవలు అందించాలని. అలా పుట్టుకొచ్చిందే ‘టీ టైమ్’.
తన కలలో ఉదయ్ శ్రీనివాస్ ఇప్పటివరకు సాధించింది కేవలం 10 శాతం మాత్రమే అంటున్నారు. ఇంకా తాను సాధించాల్సింది చాలా ఉందని చెబుతున్నారు. రానున్న మూడేళ్లలో కనీసం మరో 10 వేల అవుట్ లెట్లు ఏర్పాటు చేయాలని లక్ష్యంతో ఉన్నట్లు తెలిపారు. అంతేకాదు లైఫ్ లో సక్సెస్ కావాలంటే తమకు వచ్చిన ఆలోచనలను ముందు ఒక పేపర్ పై పెట్టాలి అంటున్నారు. ఆ తర్వాత ఆ ఆలోచనకు తగిన ప్రణాళిక రూపొందిచాలంటున్నారు. అందుకు తగిన వ్యూహం, క్షేత్రస్థాయిలో అవగాహన ముఖ్యమని తెలిపారు. సన్నద్ధత సరిగ్గా ఉన్నప్పుడు ఫలితాలు అవే వస్తాయని చెబుతున్నారు. ఇదండీ తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్ సక్సెస్ స్టోరీ.