భారతదేశంలో సౌత్ కొరియా కంపెనీ హ్యుండయ్ ని టాటా మోటార్స్ వెనక్కి నెట్టింది. డిసెంబర్ నెలలో టాటా కంపెనీ సేల్స్ 50% పెరిగాయట. దీంతో ఈ నెల కార్ల విక్రయాలలో రెండవ స్థానం కైవసం చేసుకుంది టాటా మోటార్స్. ఇదేగాక టాటా కంపెనీ మరికొన్ని రికార్డులను కూడా నమోదు చేసింది. ప్యాసెంజర్ వెహికల్స్ (పీవీ) బిజినెస్ ప్రారంభించినప్పటి నుండి అత్యధిక నెలవారీ, క్వార్టర్లీ, ఇయర్లీ సేల్స్‌ను టాటా మోటార్స్ అధిగమించింది.
లోకల్ మార్కెట్ లో గత నెల 32,312 కార్లను హ్యుండయ్ సేల్ చేయగా, 35,300 కార్లను టాటా మోటార్స్ విక్రయించింది. అలాగే మొదటి స్థానంలో ఉన్న మారుతి సుజుకీ డిసెంబర్ లో 1,53,149 కార్లను అమ్మింది. డిసెంబర్ తో ముగిసిన త్రైమాసికంలో మొత్తం 99 వేల కార్లను టాటా మోటార్స్ సేల్ చేయగా, మొత్తం ఏడాదిలో 3.31 లక్షల వెహికల్స్‌ను అమ్మినట్లు కంపెనీ తెలిపింది. వార్షిక ప్రాతిపదికలో టాటా అత్యధిక అమ్మకాలను సాధించిందని చెప్పవచ్చు. FY 2022 మూడవ త్రైమాసికంలో, టాటా మోటార్స్ అమ్మకాలు సంవత్సర ప్రాతిపదికన 44 శాతం పెరిగాయి.ఇక టాటా మోటార్స్ పర్సనల్ వెహికల్ బిజినెస్ యూనిట్ ప్రెసిడెంట్ శైలేష్ చంద్ర మాట్లాడుతూ.. 2021 అక్టోబర్ లో విడుదలైన టాటా పంచ్ పాపులర్ అయింది. న్యూ ఫరెవర్ శ్రేణి కార్లకు, SUV కార్లకు డిమాండ్ పెరిగింది. అలాగే టాటా ఎలక్ట్రిక్ వాహనాలకు కూడా మంచి స్పందన రాగా.. అమ్మకాల్లో నెక్సాన్ ఊపందుకుంది. గతేడాది మార్కెట్లోకి కంపెనీ టిగోర్ ఈవీని ప్రవేశపెట్టింది. ఇలా 2021 డిసెంబర్ లో కంపెనీ 2,215 యూనిట్లను విక్రయించింది. గత 2020 డిసెంబర్ లో 418 యూనిట్ల అమ్మకాలు జరుపగా, ఈసారి 439% వృద్ధి చెందింది. దేశీయ మార్కెట్ లో నిస్సాన్ మోటార్ ఇండియా అమ్మకాలు 2021 డిసెంబర్ లో డబుల్(3,010 యూనిట్లు) అయ్యాయి. కంపెనీ అటు నిస్సాన్, డాట్సన్ రెండు బ్రాండ్ లను ఇండియన్ మార్కెట్ లో విక్రయిస్తోంది. 2020 ఇదే నెలలో కంపెనీ 1,159 వాహనాలను మాత్రమే విక్రయించిందని తెలిపారు.