తమ పిల్లలకు భవిష్యత్తులో ఎలాంటి కష్టం ధరి చేరకూడదని, ఉన్నతంగా స్థిరపడాలని ప్రతి తల్లిదండ్రులు కోరుకునేదే. వారి స్తోమతకు తగ్గట్టుగా ఉన్నంతలో మంచి బడిలో చేర్పించడం, మంచి విధ్యాబ్యాసాన్ని అందించడం అన్నీ చేస్తారు. కానీ, ఆడపిల్లల పెళ్లి విషయం దగ్గరకు వచ్చేసరికి అదొక తలకు మించిన భారంగా భావిస్తుంటారు. ఇకనైనా అలాంటి ఆలోచనలకు పుల్ స్టాప్ పెట్టండి. నేడు మహిళలు అన్ని రంగాల్లో పురుషులతో సమానంగా పనిచేస్తున్నారు. బాధ్యతగా బిడ్డకు చదువు చెప్పించండి. వారే ఉన్నతంగా స్థిరపడతారు. అలాగే, వారికి భవిష్యత్తులో ఎలాంటి ఆర్థిక కష్టాలు రాకుండా ఉండేందుకు ఎన్నో ప్రత్యేక పెట్టుబడి పథకాలు అందుబాటులో ఉన్నాయి. అందులో సరైన పథకాన్ని ఎంచుకొని పెట్టుబడి ప్రారంభించండి. అదే వారి జీవితానికి వెలుగునిస్తుంది.
ఆడపిల్లల భవిష్యత్ గురించే మీ ఆలోచన అయితే.. కేంద్రప్రభుత్వం ఆద్వర్యంలోని సుకన్య సమృద్ధి యోజన, LIC అందిస్తోన్న కన్యాదాన్ పాలసీ చాలా ప్రముఖమైనవి. ఈ రెండు పథకాల ప్రధాన లక్ష్యం.. దేశంలోని బాలికల తల్లిదండ్రులకు వారి భవిష్యత్తును సురక్షితంగా ఉంచడానికి ఆర్థిక సహాయం అందించడం. కావున ఈ రెండు పథకాల మధ్య తేడా ఏమిటి? ఈ రెండింటిలో బిడ్డ భవిష్యత్తుకు ఏది మంచిదో తెలుసుకొని.. పొదుపు ప్రారంభించండి.
కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న ఈ పథకం కేవలం ఆడ పిల్లలకు మాత్రమే వర్తిస్తుంది. పదేళ్లలోపు వయసు ఉన్న వారు ఈ పథకంలో చేరవచ్చు. బాలిక పేరు మీద తల్లిదండ్రులు లేదా సంరక్షకులు దగ్గరలోని బ్యాంకు లేదా పోస్టాఫీసులో ఈ పొదుపు ఖాతా తెరవవచ్చు. ఇద్దరు కుమార్తెలు ఉంటే ఇద్దరి పేర్లపై సుకన్య సమృద్ధి ఖాతా తెరవవచ్చు. మొదటి బిడ్డ ఆడపిల్ల అయ్యి, రెండో కాన్పులో కవల ఆడపిల్లలు జన్మిస్తే.. ముగ్గురి పేర్లతో విడివిడిగా ఖాతాలు తెరవవచ్చు. కుమార్తెకు 18 ఏళ్లు నిండిన తర్వాత పాక్షికంగా, 21 ఏళ్ళు నిండిన తరువాత మొత్తం డిపాజిట్‌ను ఉపసంహరించుకునే వీలుంటుంది. ఈ పథకంలో కనిష్ఠంగా నెలకు 250, గరిష్టంగా ఏడాదికి 1.5 లక్షలు మించకుండా పొదుపు చేయవచ్చు. ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్ 80సి కింద పన్ను నుంచి మినహాయింపు కూడా ఉంది. ప్రస్తుతం సుకన్య సమృద్ధి యోజన వడ్డీ రేటు రూ. 7.6 శాతంగా ఉంది.
ఎల్‌ఐసీ కన్యాదాన పాలసీ అనేది.. తండ్రి తన కూతురు పెళ్లి గురించి అంతగా ఇబ్బంది (ఆర్థికంగా) పడవలసిన అవసరం ఉండకూడదు అన్న ఉద్దేశ్యంతో తీసుకొచ్చారు. ఈ పాలసీ పొదుపు మరియు భద్రత రెండింటి ప్రయోజనాలను అందిస్తోంది. ఈ పాలసీ తీసుకోవాలంటే బిడ్డ వయసు 1 నుంచి 10 ఏళ్ల మధ్య ఉండాలి. తండ్రి వయసు 18 నుంచి 50 ఏళ్ల మధ్య ఉండాలి. కాల పరిమితి 13 నుంచి 25 ఏళ్లు ఉంటుంది. ఈ పాలసీ మెచ్యూరిటీ తర్వాత పాలసీదారునికి భారీ మొత్తంలో డబ్బు చెల్లిస్తుంది. ఒకవేళ ప్రమాదవశాత్తు పాలసీదారు పాలసీ కాలవ్యవధిలోనే మరణిస్తే, ప్రీమియం రద్దు చేయబడుతుంది. ప్రమాదంలో మరణిస్తే 10 లక్షలు, నాన్-యాక్సిడెంటల్(సహజ మరణం) అయితే రూ.5 లక్షలు చెల్లిస్తారు. అలాగే, మెచ్యూరిటీ తేదీ వరకు సంవత్సరానికి 50,000 చెలిస్తారు. భారతీయ పౌరులు మరియు ప్రవాస భారతీయులు ఎవరైనా ఈ పాలసీ తీసుకోవచ్చు. ఈ రెండు పథకాలు అందిస్తోన్న ప్రయోజనాలు తెలుసుకున్నారు కదా! ఇందులో మీ బిడ్డ భవిష్తత్తుకు ఏది మంచిదో తెలుసుకొని.. పొదుపు ప్రారంభించండి. అలాగే, ఈ పథకాలపై.. మీ అభిప్రాయం ఏంటన్నది కామెంట్ల రూపంలో తెలియజేయండి.