కలలు కనడమే కాదు.. ఆ కలలను సాకారం చేసుకోవడానికి నిరంతరం కృషి చేయాలి. చాలా మంది ఒకసారి ఎదురుదెబ్బ తగలగానే డీలా పడిపోతారు. జీవితంలో తాము సాధించేందుకు ఇంక ఏమీ లేదనే భావనకు వచ్చేస్తారు. కానీ, రవి పిళ్లై మాత్రం ఎన్ని కష్టాలు ఎదురైనా కూడా మొక్కవోని దీక్షతో ముందడగు వేశారు. ఇప్పుడు వేల కోట్లకు అధిపతిగా అవతరించారు.
సక్సెస్ అనేది ఎవరికీ అంత తేలిగ్గా దక్కదు. జీవితంలో విజయం సాధించడానికి ఎన్నో ఎదురు దెబ్బలు తినాల్సి ఉంటుంది. కొంతమంది సక్సెస్ కాలేకపోవడానికి కారణాలు వెతుక్కుంటూ కూర్చుంటారు. కానీ, రవి పిళ్లైలాంటి వ్యక్తులు మాత్రం ప్రతికూల పరిస్థితులను కూడా అనుకూలంగా మార్చుకుంటూ మొక్కవోని దీక్షతో లక్ష్యాన్ని చేరుకుంటారు. సక్సెస్ కావాలి అంటే ఆస్తులు, అవకాశాలు కాదు.. పట్టుదల- కృషి ఉండాలని ఈ బిలియనీర్ నిరూపించారు. ఒక పేద రైతు కుటుంబంలో పుట్టి.. వేల కోట్లకు పడగలెత్తారు. ఇప్పుడు ఏకంగా 64 వేల కోట్ల ఆదాయాన్ని సృష్టించే స్థాయికి ఎదిగారు. 70 వేల కుటుంబాలకు ఉపాధి కూడా కల్పిస్తున్నారు. అసలు ఎవరు ఈ రవి పిళ్లై? ఆయన సక్సెస్ సీక్రెట్ ఏంటి?
రవి పిళ్లై కేరళలోని ఓ పేద రైతు కుటుంబంలో జన్మించారు. కొల్లాం తీరప్రాంత పట్టణానికి చెందిన ఓ గ్రామంలో రవి పిళ్లై కుటుంబం జీవనం సాగించేది. ఆయన జీవితంలో కావాల్సినన్ని కష్టాలు ఎదుర్కొన్నారు. కానీ, ఎక్కడా కూడా ఆయన చదువుని మాత్రం నిర్లక్ష్యం చేయలేదు. కష్టాలను అధిగమించి బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ లో పోస్ట్ గ్రాడ్యుఏషన్ పూర్తి చేశారు. ఆయన ఇప్పుడు ఈ స్థాయిలో ఉన్నారు అంటే.. అప్పుడు రాజీ లేకుండా చదువుకోవడమే అని చెప్పడంలో ఎలాంటి సందేహం అక్కర్లేదు. చదువు పూర్తి కాగానే రవి పిళ్లై చిట్ ఫండ్ కంపెనీని ప్రారంభించారు. అనుభవం లేకపోవడమో? అంచనా వేయలేకపోవడమో తెలియదు గానీ.. అతి కొద్ది సమయంలోనే నష్టాలు వచ్చాయి.
చిట్ ఫండ్ కంపెనీ ద్వారా రవి పిళ్లై చాలా వేగంగా నష్టాల్లో కూరుకుపోయారు. సాధారణంగా ఎవరైనా ఇలాంటి పరిస్థితుల్లో ఈ వ్యాపారాలు మనకి సెట్ కావు అనుకుని చేతులు దులుపుకుంటారు. వెంటనే ఏదైనా ఉద్యోగం చేయడం లాంటివి చేస్తుంటారు. కానీ, రవి పిళ్లై అలా నిరాశ పడలేదు. జీవితంలో అంతా కోల్పోయాను అంటూ చతికిల పడిపోలేదు. గోడకు కొట్టిన బంతిలా జీవితంలో రెట్టించిన వేగంతో పైకి లేచాడు. నష్టాలు మిగిల్చిన చిట్ ఫండ్ వ్యాపారాన్ని వదిలేశారు. ఆ తర్వాత మరో కంపెనీని ప్రారంభించారు. ఈసారి 150 మందితో ఒక కన్ స్ట్రక్షన్ కంపెనీని స్థాపించారు.
ఆయన పట్టుదల చూసి విధి కూడా తలవొంచినట్లు అయ్యింది. ఎందుకంటే కన్ స్ట్రక్షన్ ఫీల్డ్ లో అడుగు పెట్టిన తర్వాత రవి పిళ్లై దశ తిరిగింది. మెల్లగా జీవితంలో ఎదుగుదల మొదలైంది. ఇప్పుడు ఆ కన్ స్ట్రక్షన్ కంపెనీలో దాదాపు 70 వేల మంది వరకు ఉపాధి పొందుతున్నట్లు సమాచారం. ఒక్క కన్ స్ట్రక్షన్ బిజినెస్ దగ్గరే రవి పిళ్లై ఆగిపోలేదు. 5 స్టార్ హోటళ్లు, మాల్స్, ఆస్పత్రి అంటూ చాలా వ్యాపారాలు ప్రారంభించారు. ఆయన కేవలం కేరళలోనే కాదు.. మిడిల్ ఈస్ట్ లోని అత్యంత సంపన్నులైన భారతీయుల్లో ఒకరిగా ఎదిగారు. రవి పిళ్లైకి ది రావిజ్ అష్టముడి, ది రవిజ్ కోవలం, ది రవిజ్ కడవు అనే ఫైవ్ స్టార్ హోటళ్లు ఉన్నాయి.
కొల్లాంలో ఆర్పీ మాల్ ఉంది. 300 పడకల మల్టీ స్పెషాలిటీ ఆస్పత్రి కూడా ఉంది. అంతేకాకుండా ప్రపంచంలోని చాలాచోట్ల ఆయనకు ఇళ్లు ఉన్నాయి. పూణేలోని ట్రంప్ టవర్ లగ్జరీ కాండో నివాసం కూడా రవి పిళ్లైదే. ఈయనకు స్టీల్, గ్యాస్, ఆయిల్, సిమెంట్ వంటి వ్యాపారాలు కూడా ఉన్నాయి. ఆర్పీ గ్రూప్ సామ్రాజ్యాన్ని స్థాపించడమే కాకుండా ఇప్పుడు దాదాపు రూ.28 వేల కోట్లకు పైగా(3.4 బిలియన్ డాలర్స్) సంపాదించారు. ఈయనకు అత్యంత ఖరీదైన రోల్స్ రాయిస్ గోస్ట్, మెర్సిడిజ్ బెంజ్ మే బ్యాక్ ఎస్ 600, మే బ్యాక్ ఎస్ 500, బీఎండబ్ల్యూ 520డి, ఔడీ ఏ 6 మ్యాట్రిక్స్, ల్యాండ్ రోవర్ రేంజ్ రోవర్ కార్లు ఉన్నాయి.
అంతేకాకుండా ఎయిర్ బస్ హెచ్145 హెలికాప్టర్ కలిగిన మొదటి భారతీయుడు కూడా రవి పిళ్లైనే. ఆ హెలికాప్టర్ ఖరీదు దాదాపు రూ.100 కోట్లు ఉంటుంది. వ్యాపార రంగంలో ఈయన కృషి, ఎదిగిన తీరును ప్రశంసిస్తూ 2008లో ప్రవాసీ భారతీయ సమ్మాన్, 2010లో పద్మశ్రీతో భారత ప్రభుత్వం సత్కరించింది. న్యూయార్క్ లోని ఎక్సెల్సియర్ కాలేజ్ నుంచి డాక్టరల్ డిగ్రీ కూడా పొందారు. సాధారణ రైతు కుటుంబంలో పుట్టి ఇప్పుడు వేల కోట్లు సంపాదించిన రవి పిళ్లై సక్సెస్ స్టోరీ ఎందరికో ఆదర్శం. రవి పిళ్లై సక్సెస్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.