బంగారం కొన్నవారికి భారీ లాభాలు వచ్చాయి. ఏకంగా 50 శాతం పైగా రాబడి వచ్చింది.
బంగారం మీద పెట్టుబడి పెట్టిన వారికి భారీ లాభాలు వస్తున్నాయి. బంగారం అంటే భౌతికంగా ఉండేది మాత్రమే కాదు. డిజిటల్ గా ఉన్నా బంగారం బంగారమే. ఇంకా వీటి మీద తరుగు, తయారీ ఛార్జీలు వంటివి ఉండవు. ఇలాంటి బంగారం మీద పెట్టుబడి పెడితే భవిష్యత్తులో మంచి లాభాలు ఉంటాయనడానికి ఇప్పుడు జరిగిన సంఘటనే నిదర్శనం. కేంద్ర ప్రభుత్వ పథకాల్లో ఒకటైన సావరిన్ గోల్డ్ బాండ్ స్కీంలో పెట్టుబడులు పెట్టడం అనేవి చాలా సులభం. సులువుగా ఈ బాండ్లను కొనుగోలు చేయవచ్చు. ఈ అవకాశాన్ని ప్రభుత్వం విడతల వారీగా తీసుకొస్తుంటుంది. ప్రస్తుతం ఈ బంగారం కాసుల పంట పండిస్తోంది. సావరిన్ గోల్డ్ బాండ్లు కొన్నవారికి ఇప్పుడు అధిక ప్రాఫిట్స్ వస్తున్నాయి. బ్యాంకులు, పోస్టాఫీసు పథకాల్లో కంటే ఎక్కువ వడ్డీ ఈ సావరిన్ గోల్డ్ బాండ్స్ లో వచ్చింది.
ఎనిమిది సంవత్సరాల క్రితం గోల్డ్ బాండ్లు కొన్నవారికి ఇప్పుడు ఏకంగా 13.7 శాతం రాబడి వచ్చింది. 2015 నుంచి 2023 వరకూ 8 ఏళ్లలో సగటున గోల్డ్ బాండ్లు వార్షికంగా 13.7 శాతం మేర రాబడి తీసుకొచ్చాయి. అంతర్జాతీయంగా నెలకొన్న ప్రతికూల పరిస్థితుల నేపథ్యంలో గోల్డ్ రేట్లు అనేవి పెరుగుతున్నాయి. ఇక్కడ కూడా బంగారం ధరలు పరుగులు పెడుతోంది. ఈ కారణంగానే 2015వ సంవత్సరంలో గోల్డ్ బాండ్లు కొన్నవారికి ఎక్కువ లాభాలు వచ్చాయి. 8 ఏళ్ల నుంచి బంగారం ధర పెరుగుతూ వచ్చిందని నిపుణులు చెబుతున్నారు. ఈ 8 ఏళ్లలో మొత్తం 63 విడతలలో గోల్డ్ బాండ్లు కొంటూ వచ్చిన వారికి 4.48 శాతం నుంచి 51.89 శాతం వరకూ లాభాలు వచ్చాయని చెబుతున్నారు.
ఇంకా దీనికి ప్రభుత్వం అందించే 2.5 శాతం వడ్డీ రేటు కలపలేదు. ఇది కలిపితే ఇంకా లాభాలు వచ్చినట్టే వారికి. మరి మీరు కూడా గోల్డ్ బాండ్లు కొనాలనుకుంటున్నారా? అయితే బ్యాంకులు లేదా పోస్టాఫీసులు, స్టాక్ ఎక్స్ఛేంజ్, ఆన్ లైన్ లలో కొనుగోలు చేయవచ్చు. ఆన్ లైన్ లో కొనుగోలు చేస్తే గ్రాము బంగారంపై డిస్కౌంట్ కూడా లభిస్తుంది. మార్కెట్ ధర కంటే తక్కువ ధరకే గోల్డ్ బాండ్లు లభిస్తాయి. ఒక వ్యక్తి గరిష్టంగా 4 కిలోల వరకూ గోల్డ్ బాండ్లు కొనచ్చు. ఈ గోల్డ్ బాండ్ల మెచ్యూరిటీ వ్యవధి 8 ఏళ్ళు ఉంటుంది. 8 ఏళ్ల తర్వాత గోల్డ్ బాండ్లు అమ్ముకోవచ్చు. 5 ఏళ్ల తర్వాత అయినా అమ్ముకోవచ్చు. కానీ వడ్డీ అనేది తక్కువ వస్తుంది. ఒక పక్క వడ్డీ వస్తుంది. మరోపక్క లాభాలు వస్తున్నాయి. బంగారంపై పెట్టుబడి పెట్టాలి అనుకునేవారికి ఇదొక సువర్ణావకాశం అని చెప్పవచ్చు.