బ్యాంకుల పని వేళలకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకోనుంది. ఇది అమల్లోకి వస్తే.. బ్యాంక్ టైమింగ్స్ మారనున్నాయి. మరి ఆ నిర్ణయం ఏంటి అంటే..
ప్రస్తుతం బ్యాంక్‌లు ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పని చేస్తున్నాయి. అయితే త్వరలోనే ఈ పని వేళల్లో మార్పులు ఉండబోతున్నట్లు తెలుస్తోంది. బ్యాంక్ పని వేళలకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకోనుంది. ఇదే గనక జరిగితే.. బ్యాంక్ పని వేళలు మారడమే కాక.. సెలవులు కూడా పెరగనున్నాయి. దీనికి సంబంధించి త్వరలోనే కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. ఈ నిర్ణయం అమల్లోకి వస్తే.. బ్యాంక్‌లకు వారంలో రెండు రోజుల పాటు సెలవులు లభించనున్నాయి. దీనికి సంబంధించి ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్ (ఐబీఏ), యునైటెడ్ ఫోరమ్ ఆఫ్ బ్యాంక్ ఎంప్లాయీస్ (యూఎఫ్‌బీఈఎస్) సూత్రప్రాయ ఆమోదం తెలిపినట్లు నివేదికలు పేర్కొంటున్నాయి.
ఈ ప్రతి పాదనను కేంద్రం ఆమోదిస్తే.. ఇక మీదట బ్యాంక్‌లు వారానికి 5 రోజులు మాత్రమే పని చేస్తాయి. దానికి తగ్గట్టే పని గంటలు కూడా పెరగనున్నాయి. అప్పుడు ఉద్యోగులు రోజుకు 40 నిమిషాలు ఎక్కువగా పని చేయాల్సి ఉంటుంది. ప్రస్తుతం బ్యాంక్‌లకు ప్రతి ఆదివారంతో పాటు రెండో శనివారం, నాల్గవ శనివారం సెలవు. తొలి శనివారం, మూడో శనివారం మాత్రం బ్యాంకులు పని చేస్తున్నాయి. ఇక పని గంటల మార్పునకు సంబంధించి ఐబీఏ ఇప్పటికే ఆర్థిక శాఖకు ఒక ప్రతి పాదన పంపినట్లు సమాచారం. దీనిలో వారానికి ఐదు రోజుల పని దినాలు.. అనే సిఫార్సు కూడా ఉందని నివేదికలు పేర్కొంటున్నాయి. అందువల్ల ఆర్థిక శాఖ కూడా ఈ ప్రతిపాదనకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వొచ్చని తెలుస్తోంది. వేజ్ బోర్డు రివిజన్‌తో పాటుగా కొత్త నోటిఫికేషన్ జారీ చేయొచ్చనే అంచనాలు ఉన్నాయి.
కొన్ని రోజుల క్రితం తమిళనాడు ప్రభుత్వం.. ప్రైవేట్ సంస్థల పని గంటలకు సంబంధించి కీలక ప్రతి పాదనలు చేసింది. రోజుకు 12 గంటలు పని చేస్తే.. వారానికి 3 రోజులు సెలవు తీసుకొచ్చని పేర్కొంది. అయితే దీని పట్ల ఉద్యోగ సంస్థలు తీవ్ర వ్యతిరేకత వ్యక్తం చేశాయి. దాంతో తమిళనాడు ప్రభుత్వం ఈ ప్రతిపాదనను వెనక్కి తీసుకుంది. మరి బ్యాంకుల పని గంటల్లో మార్పులు వస్తాయేమో చూడాలి. ఇక మేనెలలో బ్యాంకులకు 11 రోజులు సెలవులు ఉన్నాయి. మే 7న ఆదివారం. మే 13న రెండో శనివారం. మే 14న ఆదివారం. మే 21న ఆదివారం. మే 27న నాలుగో శనివారం. మే 28న ఆదివారం. ఈ రోజుల్లో బ్యాంకులు ఎలాగూ పని చేయవు. మరి బ్యాంక్‌లు పని వేళలు మారిస్తే ప్రయోజనాలు ఉంటాయని మీరు భావిస్తున్నారా.. దీనిపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.