వ్యాపారం చేయాలి అనే తపన ఉంటే చాలు. అది చిన్నది అయినా పెద్దది అయినా ఆదాయం మాత్రం పక్కా వస్తుంది. ముఖ్యంగా చాలా తక్కువ పెట్టుబడితో చేసే బిజినెస్ ఐడియాస్ చాలానే ఉన్నాయి. వీటిలో ఇంట్లో ఉండే ఆడవాళ్లే సొంతంగా కొన్ని వస్తువులు తయారు చేసి లక్షల్లో ఆదాయం పొందవచ్చు. ప్రస్తుతం ఇంటి వద్ద నుంచే ఎంతో మంది ఆడవాళ్లు పలు రకాల వ్యాపారాలు, వస్తువులు తయారు చేసి డబ్బు సంపాదిస్తున్నారు. హౌస్ వైఫ్స్ కూడా ఇలాంటి చిన్న వ్యాపారాలను ప్రారంభించి ఎంతో చక్కని లాభాలను పొందవచ్చు. అలాంటి బిజినెస్ ఐడియాస్‌లో ఎంతో సులభమైన ఇంట్లో ఉండి చేసుకునే ఒక ఐడియాని మీకోసం ఈ ఆర్టికల్‌లో పరిచయం చేయబోతున్నాం.
ప్రస్తుతం అంతా పర్యావరణ పరిక్షణ, సే నో టూ ప్లాస్టిక్, ఆర్గానిక్ వస్తువుల వినియోగాన్ని ప్రోత్సహిస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఇంట్లో వాడుకునే ఎన్నో వస్తువులు పర్యావరణహితంగా ఉండాలని భావిస్తున్నారు. అంతేకాకుండా వారు ఒకసారి ఆ వస్తువుని కొనుగోలు చేస్తే సంవత్సరాల పాటు వారికి మరో వస్తువుకొనే అవసరం ఉండదు. అలాంటి వాటిల్లో ఇప్పుడు చెప్పుకోబోయేది గోగునార వస్తువులు. అవును ఈ పేరు సిటీల్లో పుట్టి పెరిగిన వారికి తెలియకపోవచ్చు. కానీ, పల్లెటూర్లలో పెరిగిన వారికి బాగానే తెలిసి ఉంటుంది. ఇప్పుడు ఆ గోగునారతో చేసే వస్తువులకు ఎంతో డిమాండ్ కూడా ఉంది. జనపనారతో ఎలా అయితే సంచులు, డోర్ మ్యాట్లు, పెన్ స్టాండ్స్ తయారు చేస్తున్నారో.. అలాగే గోగునారతోనూ అలాంటి వస్తువులను తయారు చేయచ్చు.
అయితే జనపనార, జూట్ నారతో కంటే గోగునారతో ఇంకా తేలిగ్గా వస్తువులను తయారు చేయవచ్చు. మీ ఫ్రెండ్స్, పొరుగువారితో రోజూ రెండు గంటలు అలా కూర్చుని ఈ వస్తువులు తయారు చేస్తే ఎంతో చక్కని ఆదాయం పొందవచ్చు. ఇందులో పెద్దగా పెట్టుబడి కూడా పెట్టాల్సిన అవసరం లేదు. ఎందుకంటే కేజీ గోగునార ధర రూ.50 నుంచి రూ.60 వరకు ఉంటుంది. ఈ కేజీ గోగునారతో మీరు 10 సంచుల వరకు తయారు చేయవచ్చు. ఆ సంచులను మీరు గరిష్టంగా రూ.8 వేల వరకు అమ్ముకునే అవకాశం ఉంటుంది. పల్లెటూర్లలో కాస్త తక్కువ ధరకు అమ్ముడైనా కూడా పట్టణాల్లో మాత్రం ఇలాంటి వస్తువులకు డిమాండ్ బాగానే ఉంటుంది. కాస్త కష్టపడితో నెలకు వేలల్లో ఆదాయం పొందవచ్చు. ఒక సహకార సంఘంగా ఏర్పడి పనిచేయగలిగితే లక్షల్లో ఆదాయం కూడా పొందవచ్చు.
అంతేకాకుండా ఈ వస్తువుల తయారీ కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, ఎన్జీవోలు శిక్షణ కూడా ఇస్తున్నాయి. ప్రస్తుతం శ్రీకాకుళం జిల్లా ఆమదాలవలసలో ఆత్మా ప్రాజెక్ట్ పేరిట ఈ మెస్సా ఫైబర్ వస్తువుల తయారీలో ఒక వర్క్ షాప్ కూడా నిర్వహించారు. అక్కడి గృహిణులు ఎంతో చక్కగా శిక్షణ తీసుకుని వస్తువులను తయారు చేశారు. ఈ కార్యక్రమం ద్వారా ఇంట్లో ఉండే డబ్బు సంపాదించవచ్చనే నమ్మకం, ఆత్మస్థైర్యం వారిలో కలిగింది. అలాగే మేనేజ్ జాతీయ సంస్థ ఒకటి హైదరాబాద్‌లో ఉంది. వారు కూడా ఈ సంస్థ ద్వారా గ్రామీణ యువతకు నైపుణ్యాభివృద్ధి శిక్షణను అందిస్తున్నారు. అందంగా వస్తువులు తయారు చేయడం, వాటిని మార్కెట్ చేసుకోగలిగితే మాత్రం ఎంతో తక్కువ పెట్టుబడితో చాలా మంచి ఆదాయాన్ని పొందేందుకు అవకాశం ఉంటుంది.
ఒకవేళ ఖాళీ సమయంలో రోజుకు ఒక సంచిని తయారు చేసినా కూడా మీకు దాదాపు రూ.500 ఆదాయం వస్తుంది. అదే నలుగురు మహిళలు కలిసి ఈ గోగునార వస్తువుల తయారీని గనుక ప్రారంభిస్తే ఇంకా మంచి ఆదాయాన్ని పొందవచ్చు. అంతేకాకుండా మార్కెటింగ్ విషయానికి వస్తే మీ ఫ్రెండ్స్ సర్కిల్‌లోనే ఈ వస్తువులను బాగా అమ్ముకోవచ్చు. ఇప్పుడు పెరిగిన సోషల్ మీడియాతో మీ వస్తువులను ఎన్నో ఇ-కామర్స్ సైట్లలో ఉంచవ్చచు. అలాగే మీ ఉత్పత్తులకు ఒక పేరు పెట్టుకుని దాంతో సోషల్ మీడియాలో ఖాతాలు తెరిచి ప్రమోట్ చేసుకోవచ్చు. మనసుంటే మార్గం ఉంటుంది.. కష్ట పడాలి అనే సంకల్పం ఉంటే ఆదాయం అదే వస్తుంది అంటారు ఆర్థిక నిపుణులు.