మీరు ఎస్‌బీఐ ఖాతాదారులా..? ఎస్‌బీఐ నుండి ఏదేని రుణం తీసుకున్నారా..? లేదా తీసుకోవాలనుకుంటున్నారా..? అయితే మీకో శుభవార్త. రుణ వడ్డీ రేట్లపై ఎస్‌బీఐ కీలక ప్రకటన చేసింది. అదేంటన్నది తెలుసుకొని మీరు అదనపు ప్రయోజనాలు పొందండి.
రుణాల తీసుకున్నవారికి, తీసుకోవాలనుకుంటున్నవారికి ఊరటనిచ్చే వార్త ఇది. రుణ వడ్డీ రేట్లపై దేశీయ అతి పెద్ద బ్యాంక్ ‘స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్‌బీఐ)’ కీలక నిర్ణయం తీసుకుంది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్‌బీఐ) గతేడాది మే నెల నుంచి కీలక పాలసీ రేట్లను పెంచుతూ వస్తున్న సంగతి తెలిసింది. ఈ క్రమంలో అన్ని బ్యాంకులు రుణ రేట్లను పెంచుతూ పోతున్నాయి. అయితే, ఎస్‌బీఐ మాత్రం కస్టమర్లకు ఊరటనిస్తూ రుణ రేట్లను స్థిరంగా కొనసాగించడం గమనార్హం. రుణ రేట్లలో ఎలాంటి మార్పు చేయడం లేదని ఎస్‌బీఐ తాజాగా ప్రకటించింది. ప్రస్తుత రుణాల వడ్డీ రేట్లను యథాతథంగా కొనసాగిస్తున్నట్లు తెలిపింది.
ఇటీవల జరిగిన మానిటరీ పాలసీ కమిటీలో ఆర్‌బీఐ వడ్డీ రేట్ల పెంపునకు బ్రేకులు వేసిన సంగతి తెలిసిందే. రెపో రేటును 6.5 శాతం వద్దనే ఉంచింది. అయినప్పటికీ దేశంలోని కొన్ని దిగ్గజ బ్యాంకులు రుణాలపై వడ్డీ రేట్లను పెంచుతున్నాయి. ఇప్పటికే కెనరా బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ బరోడా వంటివి ఎంసీఎల్ఆర్ రేటును పెంచుతున్నట్లు ప్రకటించాయి. దీంతో బ్యాంకుల్లో వివిధ రకాల లోన్లను తీసుకుంటున్న కస్టమర్లు ఆందోళన చెందుతున్నారు. రుణ భారం పెరుగుతుందని కంగారు పడుతున్నారు. ఈ తరుణంలో ఎస్‌బీఐ తమ ఖాతాదారులకు శుభవార్త చెప్పింది. రుణ రేట్లలో ఎలాంటి మార్పు చేయడం లేదని తాజాగా ప్రకటించింది. మార్జినల్ కాస్ట్ ఆఫ్ లెండింగ్ రేటు(ఎంసీఎల్ఆర్)ను స్థిరంగా కొనసాగించింది.
ఓవర్ నైట్ ఎంసీఎల్ఆర్ 7.9 శాతం ఉండగా, నెల రోజుల ఎంసీఎల్ఆర్ రేటు 9.1 శాతంగానూ, మూడు నెలల ఎంసీఎల్ఆర్ 8.1 శాతంగానూ ఉంది. ఇక ఆరు నెలల ఎంసీఎల్ఆర్ రేటు విషయానికి వస్తే 8.4 శాతంగా ఉండగా, ఏడాది ఎంసీఎల్ఆర్ రేటు 8.5 శాతం, రెండేళ్ల ఎంసీఎల్ఆర్ రేటు 8.6 శాతం, మూడేళ్ల ఎంసీఎల్ఆర్ రేటు 8.7 శాతం వద్ద కొనసాగుతోంది. మరోవైపు.. ఎస్‌బీఐ ఎక్స్‌టర్నల్ బెంచ్ మార్క్ లెండింగ్ రేటు కూడా స్థిరంగానే ఉంది. ప్రస్తుతం ఈబీఎల్ఆర్ రేటు 9.15 శాతం వద్ద ఉంది.
రుణ వడ్డీ రేట్లు స్థిరంగా కొనసాగడం వల్ల లోన్లు తీసుకున్న వారిపై ఎలాంటి అదనపు భారం ఉండదు. నెలవారీ ఈఎంఐల్లో మార్పులు ఉండవు. అలాగే కొత్తగా రుణాలు తీసుకోవాలని భావిస్తున్న వారికి సైతం మంచిదనే చెప్పుకోవాలి.