దేశంలో అతిపెద్ద బ్యాంకుగా సేవలందిస్తున్న స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా లావాదేవీలను మరింత సులభతరం చేసేందుకు పలు కీలక సంస్కరణలు చేపడుతోంది. బ్యాంకు ఖాతాలను డిజటలైజ్ చేసేందుకు ఎప్పటికప్పుడు.. ఖాతాదారులకు సూచనలు చేస్తోంది. తాజాగా ఎస్‌బీఐ మరోసారి ఖాతాదారులను అలెర్ట్ చేసింది.
బ్యాంకింగ్ సేవలకు అంతరాయం కలగకుండా ఉండేందుకు పాన్ నెంబర్ ను ఆధార్‌తో లింక్ చేయాలని సూచించింది. ఈ మేరకు ఎస్‌బీఐ ట్విట్ చేసి వెల్లడించింది. ఒకవేళ పాన్ నెంబర్ ను ఆధార్ తో లింక్ చేయకపోతే.. అకౌంట్ ఇనాక్టివ్ గా మారుతుందని.. దీనివల్ల లావాదేవీలను నిర్వహించలేరంటూ హెచ్చరించింది. ఆదాయపు పన్ను చట్టం 1961లోని సెక్షన్ 139AA ప్రకారం.. మార్చి 31, 2022లోగా ఆధార్ నంబర్‌కు పాన్ నెంబర్ ను లింక్ చేయాలని సూచించింది. పైన పేర్కొన్న తేదీలోగా మీ పాన్‌ను ఆధార్ నంబర్‌తో లింక్ చేయబడకపోతే.. ఏప్రిల్ నుంచి మీ ఖాతాల్లో లావాదేవీలను నిర్వహించలేరంటూ వెల్లడించింది. కాగా.. పాన్‌ను ఆధార్‌తో లింక్ చేయాలని గతంలో పలుమార్లు పేర్కొన్నప్పటికీ.. కరోనా కారణంగా దీని గడువును పొడగిస్తూ వస్తున్నారు. ఈ క్రమంలో లింక్ చేయని ఖాతాదారులకు.. ఎస్‌బీఐ మరోసారి సూచనలు చేసింది.
SMS ద్వారా కూడా మీరు మీ పాన్ – ఆధార్‌ను లింక్ చేయవచ్చు. 567678 లేదా 56161 కి నిర్దిష్ట ఫార్మాట్లో అంకెలను టైప్ చేసి SMS పంపండి. ఉదాహరణకు.. మీ ఆధార్ నంబర్ XXXXXXXX3333 – PAN XXXXXX999Q అయితే. అప్పుడు మీరు UIDPAN XXXXXXXX3333 XXXXXX999Q అని టైప్ చేసి 567678 లేదా 56161కి ఎస్ఎంఎస్ పంపాలి.