ఏవిధమైన లావాదేవీలు జరపాలన్నా బ్యాంకులో ఖాతా తెరవాల్సిందే. వ్యాపారం చేసేవారు, ఉద్యోగులు, ఇతర వ్యక్తులు బ్యాంకులో ఖాతాలు తెరిచి వారి డబ్బును అందులో దాచుకుంటారు. బ్యాంకు ఖాతాలు కలిగిన వారు బ్యాంకు నుంచి వివిధరకాల లోన్లు పొందుతారు. ఖాతాదారులు వారి డబ్బును, ఆస్తిపాస్తులను కూడా బ్యాంకులో దాచుకుంటారు. అయితే తాజాగా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్యాంకింగ్ వ్యవస్థలో తీసుకు వచ్చిన మార్పుల వల్ల ఎస్బిఐ ఖాతాదారులను అలెర్ట్ చేసింది. బ్యాంకుల్లో లాకర్లు కలిగిన వారు వెంటనే వెళ్లి బ్యాంకులో సంప్రదించాలని కోరింది.
దేశంలో బ్యాంకింగ్ రంగంలో ఎస్ బిఐ అతిపెద్దది. అయితే తన ఖాతాదారుల కోసం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నూతన నిబంధనలను అమల్లోకి తీసుకురానుంది. దీని వల్ల బ్యాంకులో ఉన్న కస్టమర్ యొక్క విలువైన వస్తువులకు పూర్తి రక్షణ కల్పించడానికి వీలవుతుందని అభిప్రాయపడింది. దీనిలో భాగంగానే ఖాతాదారులకు ఓ అలర్ట్ ను జారీ చేసింది. అయితే ఈ నిబంధనలు ఖాతాదారులకు అందరికి వర్తంచవు. కేవలం బ్యాంకులో లాకర్ ఉన్న కస్టమర్లు మాత్రమే ఈ కొత్త నిబంధనలను పాటించాల్సి ఉంటుంది. ఎస్ బిఐ లో లాకర్ ఉన్న కస్టమర్లు వెంటనే మీ బ్యాంక్ బ్రాంచ్ కు వెళ్లి లాకర్ అగ్రిమెంట్ పై సంతకం చేయాలని సూచించింది. ఈ ఏడాది చివరి వరకు అనగా డిసెంబర్ 31 2023 తేదీ వరకు ఆ పని పూర్తి చేయాలని సూచించింది.
కస్టమర్ల విలువైన వస్తువులు అనగా నగలు, ఆస్తి పత్రాలు బ్యాంకుల్లోని లాకర్లలో భద్రపరుచుకుంటారని, అయితే ఏదైన ప్రమాదం జరిగినపుడు ఆ వస్తువులను నష్టపోయే ప్రమాదం ఉన్నందువల్ల లాకర్ ఒప్పందాలను పునరుద్దరించాలని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్యాంకులను ఆదేశించింది. దీనిలో భాగంగా ఇండియన్ బ్యాంక్స్ అసోషియేషన్ మోడల్ ఒప్పందాన్ని చేసుకుంటుందని, లాకర్ నియమాల్లో మార్పులు చేస్తూ ఖాతాదారులతో ఒప్పందం చేసుకుంటుందని తెలిపింది. బ్యాంకు లాకర్లలో నిషేదిత వస్తువులు, పేలుడు పదార్థాలు, నగదు ఉంచడానికి వీల్లేదని ఆర్ బిఐ నిబందనల్లో ఉంది. దీంతో లాకర్ కలిగిన కస్టమర్లు తమ సంబంధిత బ్యాంకులకు వెళ్లి నూతన లాకర్ ఒప్పందాలపై సంతకాలు చేసి వారి విలువైన వస్తువులకు రక్షణ కల్పించుకోవచ్చు.