ప్రస్తుతం మన దేశం ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యల్లో ముఖ్యమైనది.. నిరుద్యోగం. ప్రభుత్వ శాఖల్లో కొలువులు తక్కువ.. కాంపిటీషన్ ఎక్కువ. ఇక ప్రైవేటు జాబ్ అంటే.. పని ఎక్కువ.. జీతం తక్కువ.. పైగా ఏ నిమిషం ఎలాంటి వార్త వినాల్సి వస్తుందోననే భయం ఉంటుంది. ఈ గోల దేనికి.. చక్కగా ఏదైన పరిశ్రమ స్థాపించి.. మనకు మనం పని కల్పించుకోవడమే కాక.. మరి కొందరికి ఉపాధి కల్పిస్తే ఎంత బాగుంటుందని కొందరు ఆలోచిస్తారు. ఆలోచన సరే.. మరి ఆచరణలో పెట్టాలన్నా.. మన మనసులో ఉన్న ఆలోచన కార్యరూపం దాల్చాలన్నా.. డబ్బు కావాలి. అంత ఆర్థిక స్థోమత లేకనే.. నచ్చినా.. నచ్చకపోయినా సరే ఉద్యోగాలు చేయడమో.. లేక ఖాళీగా ఉండటమో చేస్తున్నారు యువత. మరి ప్రభుత్వాలు వీరి గురించి ఆలోచిండం లేదా.. ఎలాంటి కార్యక్రమాలు రూపొందించడం లేదా అంటే.. కొన్ని పథకాలున్నాయి. కానీ వాటి గురించి సామాన్యులకు తెలియదు. దానిలో ఒకదాని గురించి ఇప్పుడు తెలుసుకుందాం..
దేశంలోని పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో ఉంటున్న నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించాలనే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం.. ప్రధాన మంత్రి ఉపాధి కల్పన కార్యక్రమం(పీఎంఈజీపీ) ప్రారంభించింది. దీని ద్వారా.. నిరుద్యోగులకు రుణం అందిస్తూ.. వారు ఉపాధి పొందేలా సాయం చేస్తుంది. అయితే ఇది కొత్త పథకమా అంటే కాదు.. గతంలో యువతకు ఉపాధి కల్పించే లక్ష్యంతో ప్రధానమంత్రి రోజ్‌గార్ యోజన, గ్రామీణ ఉపాధి కల్పన పథకం అనే పథకాలను కేంద్రం నిర్వహించేది. ప్రస్తుతం ఈ రెండింటినీ కలిపి ప్రధానమంత్రి ఉపాధి కల్పన పథకంగా ప్రారంభించింది.
కేంద్ర ప్రభుత్వంలోని సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల మంత్రిత్వ శాఖ అధ్వర్యంలో..ఖాదీ, గ్రామీణ పరిశ్రమల కమిషన్(కేవీఐసీ) ఈ పథకాన్ని అమలు చేస్తోంది. ఈ కేవీఐసీ జాతీయ స్థాయిలో నోడల్ ఏజెన్సీ ద్వారా.. రాష్ట్రాల పరిధిలో కేవీఐసీ బోర్డులు, జిల్లా పరిశ్రమల కేంద్రాల ద్వారా ఈ పథకాన్ని అమలు చేస్తుంటుంది. పథకం ప్రధాన ఉద్దేశం.. యువతకు ఉపాధి కల్పన. దీని కోసం కొత్తగా ఏర్పాటు చేసే సూక్ష్మ, చిన్న కుటీర పరిశ్రమల స్థాపన మొదలు.. మధ్యతరహా పరిశ్రమ స్థాయి వరకు ఈ పథకం కింద రుణ సాయం లభిస్తుంది. 2026 వరకు ఈ పథకం అమల్లో ఉంటుంది.
తయారీ యూనిట్ అయితే.. లక్ష నుంచి 50 లక్షల వరకు.. సర్వీస్ యూనిట్లకయితే.. 20 లక్షల వరకు రుణ సదుపాయం కల్పిస్తారు. జనరల్ కేటగిరికి చెందిన వ్యక్తులు అయితే.. తాము ఏర్పాటు చేయబోయే యూనిట్‌కు సంబంధించి మొత్తం వ్యయంలో 10 శాతం పెట్టుబడి వారే భరించాల్సి ఉంటుంది. మహిళలు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలు, దివ్యాంగులు, మాజీ సైనికులకు చెందిన లబ్ధిదారులయితే.. ప్రాజెక్టు మొత్తం వ్యయంలో 5 శాతం పెట్టుబడి పెట్టాలి.
ఈ పథకం కింద అర్హులైన వారు దరఖాస్తు చేసుకోవడం మొదలు.. లబ్ధిదారుల సెలక్షన్ ప్రాసెస్ మొత్తం.. ఆన్‌లైన్‌లోనే సాగుతుంది. పరిశ్రమ ఏర్పాటును మాత్రం అధికారులు స్వయంగా వచ్చి పరిశీలించి చెక్ చేస్తారు. ఈ పథకానికి అప్లై చేసుకునేవారు.. www.kviconline.gov.in క్లిక్ చేసి పీఎంఈజీపీఐ పోర్టల్‌లోకి వెళ్లాలి. తర్వాత అప్లికేషన్ ఫామ్ సెలక్ట్ చేసుకుని… గ్రామీణ ప్రాంత నిరుద్యోగులైతే కేవీఐసీకి, పట్టణ ప్రాంతానికి చెందిన నిరుద్యోగులైతే.. డీఐసీలో తమ వివరాలను నమోదు చేయాలి. తర్వాత దరఖాస్తు ఫారాన్ని ప్రింట్ తీసుకోవాలి.
https://www.kviconline.gov.in/pmegpeportal/jsp/pmegponline.jsp వెబ్‌సైటుకు వెళ్లి అక్కడ ఆన్ లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి. ముందుగా మీరు ఈ సైటులో లాగిన్ అవడం కోసం మీకు ప్రత్యేకంగా ఒక యూజర్ ఐడీ, పాస్ వర్డ్ క్రియేట్ చేసుకోవాలి. ఆ తర్వాత ఆన్‌లైన్ దరఖాస్తులో అడిగిన వివరాలన్నీ పొందుపరచాలి.
దరఖాస్తు చేసిన తర్వాత 10-15 రోజుల వ్యవధిలో అధికారుల నుంచీ మీకు రిప్లై వస్తుంది. ఆ తర్వాత మీ ప్రాజెక్టు మంజూరుకు సంబంధించిన మిగతా పనులు ప్రారంభమవుతాయి. మీరు దరఖాస్తు చేసుకున్న తరువాత మీరు ఏర్పాటు చేయబోయే ప్రాజెక్టుకు సంబంధించి మీకు కేంద్ర ప్రభుత్వం ఒక నెల రోజుల శిక్షణ ఇస్తుంది. ఇది ఆన్‌లైన్ లేదా ఆఫ్‌లైన్‌లో ఉంటుంది. తప్పకుండా ట్రైనింగ్ తీసుకోవాలి.