పసిడి కొనాలనుకుంటున్న వారికి బ్యాడ్ న్యూస్ అందుతోంది. మరో పది రోజుల్లో అంటే 'అక్షయ తృతీయ' నాటికి పసిడి ధర తులం రూ. 65,000 దాటుతుందని విశ్లేషకులు చెప్తున్నారు. ఎందుకు..? ఏంటి..? అన్నది తెలుసుకొని ముందు కొనుగోలు చేయాలా..? తరువాత కొనుగోలు చేయాలా.. అన్న దానిపై ఒక స్పష్టతకు రండి.
బంగారం అంటే భారతీయులకు ఎంత ఇష్టమే ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అందునా మహిళలు అమితంగా ఇష్టపడే ఏకైక వస్తువు.. పసిడి. పండుగలు, శుభకార్యాల్లో ధరించడానికి.. వీలైతే పిసరంత కొనుగోలు చేయడానికి మహిళలు ఎక్కువ ప్రాధాన్యం ఇస్తారు. అయితే ఇటీవలి కాలంలో బంగారం ధర ఆల్ టైం గరిష్ట స్థాయికి చేరడంతో.. పసిడి కొనాలన్న ఆలోచనకే చాలామంది దూరమవుతున్నారు. ప్రస్తుతానికి 22 క్యారెట్లు 10 గ్రాముల బంగారం ధర రూ. 55వేల పైబడి ఉండగా, 24 క్యారెట్లు 10 గ్రాముల పసిడి ధర రూ. 60వేలపైనే ఉంది. ఇదే భారమనుకుంటే.. మరో పది రోజుల్లో పసిడి ధర మరింత పెరుగనుందనే నివేదికలు కలకలం రేపుతున్నాయి.
మరో పది రోజుల్లో అంటే ఏప్రిల్ 22న ‘అక్షయ తృతీయ‘ రాబోతోంది. ఆనాటికి బంగారం ధర తులం రూ. 65,000 దాటుతుందని విశ్లేషకులు చెప్తున్నారు. అందుకు కారణాలు కూడా లేకపోలేదు. బంగారం పెట్టుబడి ఆప్షన్‌గా మారిపోయింది. ప్రస్తుతం మార్కెట్ లో నెలకొన్న బ్యాంకింగ్ సంక్షోభం కారణంగా మధుపర్లు సురక్షితమైన పెట్టుబడి సాధనంగా బంగారంపై పెట్టుబడులు పెట్టేందుకు ఎక్కువగా ఆసక్తి చూపిస్తున్నారు. ఈ క్రమంలోనే బంగారానికి అంతర్జాతీయంగా కూడా డిమాండ్ పెరుగుతోంది. ఇప్పటికే అమెరికాలో ఒక ఔన్స్ అంటే 31 గ్రాముల బంగారం ధర 2000 డాలర్లు దాటిపోయింది. ఈ నేపథ్యంలో మరో పది రోజుల్లో బంగారం ధర రూ. 65వేలు దాటుతుందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.
మరోవైపు అమెరికా ఫెడరల్ రిజర్వ్ మరోసారి వడ్డీ రేట్లను పెంచే అవకాశం ఉందనే వార్తలు కూడా మార్కెట్లను కుదిపేస్తున్నాయి. వాస్తవానికి డాలర్ ఎంత బలపడితే బంగారం ధర అంత తగ్గుతుంది. ఎందుకంటే అమెరికన్ బాండ్ మార్కెట్లపై మధుపరులకు విశ్వాసం పెరిగితే.. వారు తమ పెట్టుబడులను డాలర్ బాండ్ల రూపంలో పెడుతుంటారు. అయితే ప్రస్తుతం బ్యాంకింగ్ రంగంలో సంక్షోభం నెలకొనడంతో మదుపర్లకు డాలర్ పై విశ్వాసం సన్నగిల్లి బంగారంపై పెట్టుబడి పెట్టేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. ఇదిలావుంటే దేశీయంగా బంగారం దిగుమతులు తగ్గడం కూడా పసిడి ధర పెరగడానికి ఒక కారణంగా విశ్లేషకులు చెప్తున్నారు.
గత ఆర్థిక సంవత్సరం 2022-23లో ఏప్రిల్-ఫిబ్రవరి మధ్య పసిడి దిగుమతులు భారీగా తగ్గాయి. 2021-22తో పోలిస్తే గతేడాది 30 శాతం దిగుమతి తగ్గి.. 31.8బిలియన్ డాలర్లకు పడిపోయాయి. బంగారం దిగుమతులపై కేంద్రం భారీగా కస్టమ్స్ డ్యూటీ వసూలు చేయడంతోపాటు అంతర్జాతీయ ఆర్థిక మాంద్యం ముప్పు భయాలు, వివిధ దేశాల సెంట్రల్ బ్యాంకులు వడ్డీరేట్లు పెంచడం కూడా కారణమని కేంద్ర వాణిజ్య శాఖ వెల్లడించింది. అయితే బంగారం దిగుమతులు గణనీయంగా పడిపోయినా వాణిజ్య లోటు మాత్రం తగ్గక పోవడం గమనార్హం. ప్రపంచవ్యాప్తంగా బంగారం ఎక్కువగా దిగుమతి చేసుకునే దేశాల్లో భారత్ ఒకటి. ప్రతి యేటా భారత్ సరాసరి 800-900 టన్నుల పుత్తడి దిగుమతి చేసుకుంటోంది. రాబోవు రోజుల్లో పసిడి ధర పెరుగుతుందా..? తగ్గుతుందా..? మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.