దేశీయ పారిశ్రామిక దిగ్గజం టాటా గ్రూప్ తన వ్యాపారాన్ని విస్తరించే పనిలో పడింది. ఇప్పటికే ఆటోమొబైల్, ఐటీ, స్టీల్.. ఇలా భిన్న రంగాల్లో వ్యాపారాలు సాగిస్తున్న టాటా గ్రూప్ త్వరలో స్మార్ట్ ఫోన్ తయారీలో అడుగుపెట్టేందుకు రంగం సిద్ధమవుతోంది. ఆ వివరాలు..
టాటా.. విశ్వసనీయతకు మారు పేరుగా గుర్తింపు తెచ్చుకుంది ఈ కంపెనీ. విలువలతో కూడిన వ్యాపారం.. కస్టమర్ నమ్మకమే పెట్టుబడిగా.. అన్ని రంగాల్లో రాణిస్తోంది. ఉప్పు మొదలు.. సాఫ్ట్‌వేర్ వరకు టాటాలు రాణించని రంగం అంటూ లేదు. కొన్ని రోజుల క్రితమే ప్రభుత్వ రంగంలో ఉన్న ఎయిర్ ఇండియా విమానాయన సంస్థను టాటా సన్స్ దక్కించుకున్న సంగతి తెలిసిందే. టాటా గ్రూప్.. ఎయిర్‌ఇండియాను దక్కించుకోవడంపై సామాన్యులతో పాటు.. దిగ్గజ వ్యాపార కంపెనీలు కూడా హర్షం వ్యక్తం చేశాయి. లక్షల కోట్ల రూపాయల వ్యాపారాలు నిర్వహిస్తోన్నప్పటికి.. టాటాల పేరు.. మిలియనీర్ జాబితాలో చేరవు. అందుకు కారణం.. తమ ఆస్తుల్లో అధిక భాగాన్ని సమాజ శ్రేయస్సుకే కేటాయిస్తారు. విపత్తులు వచ్చినప్పుడు ఆదుకోవడంలో టాటా కంపెనీ ముందు వరుసలో ఉంటాయి. ఇప్పటికే అనేక రంగాల్లో రాణిస్తోన్న టాటా కంపెనీ.. తాజగా మరో రంగంలోకి అడుగుపెట్టేందుకు రెడీ అవుతోంది. ఆ వివరాలు..
ప్రపంచ దిగ్గజ కంపెనీ, ఐఫోన్ మేకర్ యాపిల్‌కు చెందిన ఐఫోన్ల తయారీ రంగంలోకి ఎంట్రీ ఇచ్చేందుకు టాటా గ్రూప్ రెడీ అవుతోంది. భారత్‌లో ఐఫోన్ల తయారీ చేపట్టేందుకు దాదాపు అంతా సిద్ధమైంది. బెంగళూరులో తైవాన్‌కు చెందిన విస్ట్రాన్ ఐఫోన్ ప్లాంట్ నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. దీనిని కొనుగోలు చేసే పనిలో ఉంది టాటా గ్రూప్. అన్ని అనుకూలిస్తే.. ఈ నెలలోనే కొనుగోలు ప్రక్రియ పూర్తయ్యే అవకాశం ఉందని ఒక ఆంగ్ల వెబ్‌సైట్ వెల్లడించింది. ఇక టాటా కంపెనీ ఇప్పటికే ప్లాంట్‌లో అనేక వ్యవస్థాగత మార్పులు చేపట్టే దిశగా చర్యలు ప్రారంభించింది. అంతేకాక.. ప్రస్తుతం ప్లాంట్‌లో పని చేసే 2 వేల మందిని తొలగించే అవకాశం ఉన్నట్లు వార్తలు వెలువడుతున్నాయి.
అంతేకాక ప్లాంట్‌లో పని చేస్తోన్న సుమారు 400 మంది మధ్యస్థాయి సిబ్బంది వేరే సంస్థలకు వెళ్లే అవకాశం ఉంది. అలానే నలుగురైదుగురు ఉన్నత స్థాయి అధికారులకు కూడా తొలగించే యోచనలో ఉన్నట్లు సమాచారం. ఇక టాటా కంపెనీ ఈ ప్లాంట్‌ను కొనుగోలు చేస్తే.. యాపిల్ ఫోన్ల తయారీకి సంబంధించి భారత్‌లో ఇదే తొలి ప్లాంట్ కావడం విశేషం. ఇక ఐఫోన్ సిరీస్‌లో త్వరలో విడుదల కానున్న ఐఫోన్ 15 మోడల్‌తోనే టాటా గ్రూప్ ఈ ప్లాంట్‌లో మొదటి ఉత్పత్తి ప్రారంభించనుంది. ఇప్పటివరకు విస్ట్రాన్ సంస్థ ఈ ప్లాంట్‌లో ప్రస్తుతం ఐఫోన్ 12, ఐఫోన్ 14 మొడళ్లను తయారు చేస్తోంది. ఈ ప్లాంట్ టాటాల చేతుల్లోకి వెళ్లిన తర్వాత విస్ట్రాన్ సంస్థ పూర్తిగా మన మార్కెట్‌నుంచి వైదొలుగుతుంది.