బ్యాంకుల్లో డబ్బు ఫిక్స్డ్ డిపాజిట్ చేయడం అనేది ఈరోజుల్లో ప్రతి ఒక్కరూ చేస్తున్నారు. మధ్యతరగతి వాళ్ళు ఎక్కువగా ఫిక్స్డ్ డిపాజిట్లు చేస్తుంటారు. రిటైర్మెంట్ సమయంలోనో, లేదంటే పిల్లల పెళ్లిళ్ల కోసమనో, చదువుకోసమనో కొన్నాళ్ల పాటు డిపాజిట్ చేస్తారు. అది కొన్నాళ్ల తర్వాత డబ్బుకు డబ్బు అవుతుంది. అయితే అది బ్యాంకులు దివాళా తీయనంత వరకూ బానే ఉంటుంది. దివాళా తీస్తే ఏంటి పరిస్థితి? అందుకే మీరు ఫిక్స్డ్ డిపాజిట్ చేసే ముందు ఆ బ్యాంకులు సురక్షితమో కాదో తెలుసుకోండి.
ఇంట్లో దాచుకుంటే దొంగలు పడి దోచేసుకుంటారు. ఎవరికైనా అప్పు ఇస్తే ఎగ్గొట్టేస్తారు. మరి డబ్బు భద్రంగా దాచుకోవడానికి చోటేది అన్న ప్రశ్నకు సమాధానమే బ్యాంకు. చాలా మంది బ్యాంకులో డబ్బు దాచుకుంటూ ఉంటారు. ఫిక్స్డ్ డిపాజిట్ రూపంలో బ్యాంకులో డబ్బు దాచుకుంటారు. ఎప్పుడైనా ఆపద సమయంలో ఆ డబ్బు ఉపయోగపడుతుందని ఏళ్ల తరబడి అలానే ఉంచేస్తారు. అయితే అన్ని బ్యాంకులు సురక్షితమేనా అన్న సందేహం రావడం సహజం. ఎందుకంటే విజయ్ మాల్యా లాంటోళ్ళు, నీరవ్ మోడీ లాంటోళ్ళు వేల కోట్లలో రుణాలు తీసుకుని అసలు ఎగ్గొట్టి విదేశాలు పారిపోతే బ్యాంకులు దివాళా తీసే పరిస్థితి వస్తుంది కనుక. అదే జరిగితే ప్రజల డబ్బుకి ఎవరు జవాబుదారీతనం వహిస్తారు అనేది పెద్ద భేతాళ ప్రశ్న.
అసలు ఏ బ్యాంకు సురక్షితం అనే విషయం ఎలా తెలుస్తుంది? ఏ బ్యాంకును నమ్మాలి? అనే విషయాల మీద ఆర్బీఐ స్పష్టత ఇచ్చింది. బ్యాంకు ఖాతాదారుల కోసం ఆర్బీఐ సురక్షితమైన బ్యాంకులను సూచించింది. డి-సిబ్ పేరుతో ఒక జాబితాను విడుదల చేసింది. డి-సిబ్ అంటే డొమెస్టిక్ సిస్టమేటికల్లీ ఇంపార్టెంట్ బ్యాంక్. దీని ప్రకారం ఏ బ్యాంకు సురక్షితమో, ఏ బ్యాంకు భద్రంగా లేదో అన్న విషయాన్ని వెల్లడించింది. ఒక ప్రభుత్వ రంగ బ్యాంకు, రెండు ప్రైవేటు బ్యాంకులు మాత్రమే సురక్షితం అని ఆర్బీఐ సూచించింది. వీటిలో ఒకటి ప్రభుత్వ బ్యాంకు అయిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కాగా.. మిగతా రెండు హెచ్డీఎఫ్సీ, ఐసీఐసీఐ బ్యాంకులు. ఈ మూడు బ్యాంకులు ప్రస్తుతం సురక్షితమైన బ్యాంకులు అని పేర్కొంది.
రిజర్వ్ బ్యాంక్ ఎప్పటికప్పుడు ఈ జాబితాలో ఉన్న బ్యాంకులపై నిఘా ఉంచుతుంది. ఈ బ్యాంకుల పనితీరును రోజూ మానిటరింగ్ చేస్తుంటుంది. ఏ వ్యక్తికైనా గానీ సంస్థకైనా గానీ పెద్ద మొత్తంలో రుణాలు ఇచ్చినా లేదా ఖాతాలను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తుంటుంది. పెద్ద ప్రాజెక్ట్ పై బ్యాంకులు రుణాలు ఇచ్చేలా ఉంటే వాటిని కూడా లెక్కలోకి తీసుకుని దాని వల్ల ఏమైనా బ్యాంకు మీద ప్రతికూల ప్రభావం చూపుతుందా అనేది పరిశీలిస్తుంది. 2015 నుంచి ఇటువంటి బ్యాంకుల జాబితాను ఆర్బీఐ విడుదల చేస్తూ వస్తోంది. దేశ ఆర్థిక వ్యవస్థకు ఇలాంటి బ్యాంకులు అవసరమని ఆర్బీఐ పేర్కొంది. తొలుత ఆర్బీఐ అన్ని బ్యాంకులకు రేటింగ్ లు ఇస్తుంది. ఆ తర్వాత ముఖ్యమైన బ్యాంకుల జాబితాను సిద్ధం చేస్తుంది. ఇప్పటి వరకూ ఈ జాబితాలో కేవలం మూడు బ్యాంకులే ఉన్నాయి. ఎస్బీఐ, హెచ్డీఎఫ్సీ, ఐసీఐసీఐ బ్యాంకులు మాత్రమే సురక్షితమైనవిగా ఆర్బీఐ తెలిపింది. మరి దీనిపై మీ అభిప్రాయమేమిటో కామెంట్ చేయండి.