ప్రస్తుతం ఎక్కడ చూసినా నగదు చలామణీ నానాటికీ తగ్గిపోతుంది. చిన్న టీ షాపు నుంచి పెద్ద పెద్ద షాపింగ్ మాల్ వరకు అన్నింటా డిజిటల్ చెల్లింపులే జరుగుతున్నాయి. ఈ ఆన్ లైన్ చెల్లింపుల కోసం అనేక సంస్థలు తమ సేవలను వినియోగదారులకు అందిస్తున్నాయి. అలాంటి వాటిలో పేటీఎం ఒకటి. అయితే ఏ సంస్థ అయినా సరే.. భారతీయ రిజర్వ్ బ్యాంక్(ఆర్బీఐ) నిబంధనలకు లోబడే పనిచేయాలి. దేశంలో పనిచేస్తున్న ఆర్ధిక వ్యవస్థకు సంబంధించిన చాలా సంస్థలకు ఆర్బీఐ హెచ్చరిలు కూడా జారీ చేస్తుంది. తాజాగా పేటీఎంకు కూడా కొన్ని కీలక సూచనలు చేసింది. పేమెంట్ అగ్రిగేటర్ సేవలను అందించేందుకు మరోసారి దరఖాస్తు చేసుకోవాలని పేటీఎం మాతృసంస్థ అయిన వన్-97 కమ్యూనికేషన్ కు ఆర్బీఐ సూచించింది. అనుమతులు వచ్చే వరకు కొత్త కస్టమర్లను చేర్చుకోవద్దని పేర్కొంది.
పేమెంట్ అగ్రిగేటర్ సేవల విషయంలో ఆర్బీఐ పేటీఎంకు పలు సూచనలు చేసింది. ఆన్ లైన్ చెల్లింపు సేవలు పునః ప్రారంభించేందుకు మరోసారి దరఖాస్తు చేసుకోవాలని వన్-97 సంస్థకు ఆర్బీఐ సూచించింది. పేటిఎం బ్రాండ్ తో వన్-97 సంస్థ ఆన్ లైన్ చెల్లింపు సేవలను అందిస్తున్న సంగతి అందరికి తెలిసిందే. పేమెంట్ అగ్రిగేటర్ కు సంబంధించి గతంలో కేంద్రం కొన్ని కీలక మార్గదర్శకాలను జారీ చేసింది. వాటిని అనుసరించి వన్-97 సంస్థ..తన పేమెంట్ అగ్రిగేటర్ బిజినెస్ ను పేటిఎం కు బదిలీ చేయాలని ఆర్బీఐని కోరింది. అయితే వారి విజ్ఞప్తిని రిజర్వ్ బ్యాంక్ తిరస్కరించింది. తాజాగా ఆర్బీఐ నుంచి పేటీఎంకు మరోసారి సమాచారం వచ్చింది. పేమెంట్ అగ్రిగేటర్ వ్యాపారం నిర్వహించేందుకు 120 రోజుల్లోగా దరఖాస్తు చేసుకోవాలని సూచిందింది.
అంతేకాక అనుమతులు లభించే వరకు కొత్త కస్టమర్లను చేర్చుకోవద్దని తెలిపింది.అయితే ఈ విషయంపై పేటీఎం స్పదించింది. ఆర్బీఐ ఇచ్చిన సూచనలు తమ వ్యాపారంపై ఎలాంటి ప్రభావం ఉండబోదని, ఆఫ్ లైన్ వ్యాపారులను చేర్చుకునే విషయంలో ఎలాంటి ఇబ్బంది లేదని తెలిపింది. అలానే ప్రస్తుతం ఉన్న ఆన్ లైన్ పేమెంట్స్ చేసుకోవడానికి ఎలాంటి సమస్యలేదని పేర్కొంది. త్వరలోనే పేమెంట్ అగ్రిగేటర్ అనుమతులు లభిస్తాయని సదరు సంస్థ ఆశాభావం వ్యక్తం చేసింది. వినియోగదారులు వివిధ పద్ధతులో ఈ-కామర్స్, వ్యాపారలకు చెల్లింపులు చేస్తుంటారు. వ్యాపారులకు ప్రత్యేకమైన చెల్లింపు వ్యవస్థ అంటూ లేకుండా లావాదేవీలు పూర్తి చేయడానికి పేమెంట్ అగ్రిగేటర్లు మధ్యవర్తులుగా వ్యవహరిస్తారు.
అయితే, ఆర్బీఐ మార్గదర్శకాల ప్రకారం.. ఈ-కామర్స్ సేవలతో పాటు, పేమెంట్ అగ్రిగేటర్ సేవలను ఒకే కంపెనీ అందించరాదు. ఈ రెండు తప్పని సరిగా వేరు వేరు వ్యాపారంగా నిర్వహించాల్సి ఉంటుంది. ఈక్రమంలోనే పేమెంట్ అగ్రిగేటర్ సేవలను, పేటీఎం సర్వీస్ లోకి బదిలీ చేయాలని వన్-97 సంస్థ ఆర్బీఐని కోరింది. ఇప్పటికే రోజర్ పే, పైన్ ల్యాబ్స్, సీసీ అవెన్యూస్, క్యాష్ ఫ్రీ వంటి పేమెంట్స్ సర్వీస్ సంస్థలు అనుమతులు పొందాయి. మరికొన్ని సంస్థలు ఆర్బీఐ నుంచి పర్మిషన్ల కోసం ఎదురు చూస్తున్నాయి. ఈ క్రమంలోపేటీఎంకి కూడా ఆర్బీఐ సూచనలు చేసింది.