బ్యాంకులను మెర్జ్ చేయడం, నష్టాల్లో నడుస్తున్న బ్యాంకుల లైసెన్సులు రద్దు చేసి వాటి కార్యకలాపాలను నిలిపివేయడం ఈ మధ్యకాలంలో వింటూనే ఉన్నాం. తాజాగా ఆర్బీఐ మరో కీలక నిర్ణయం తీసుకుంది. మరో బ్యాంక్ లైసెన్స్ రద్దు చేసింది. అంతేకాకుండా ఆ రద్దు నిర్ణయం గురువారం నుంచే అమలులోకి వచ్చినట్లు ప్రకటించింది. ఇంక ఆ బ్యాంక్ ఎలాంటి కార్యకలాపాలను నిర్వహించరాదని తెలిపింది.
కర్ణాటక కేంద్రంగా నడుస్తున్న డెక్కన్ అర్బన్ కోపరేటివ్ బ్యాంక్ విషయంలో ఆర్బీఐ ఈ నిర్ణయం తీసుకుంది. ఆ బ్యాంక్ లైసెన్స్ రద్దు చేస్తూ ఆర్బీఐ నిర్ణయం తీసుకుంది. ఇకపై ఎలాంటి బ్యాంకింగ్ కార్యకలాపాలు నిర్వహించకుండా ఆదేశాలు జారీచేసింది. అయితే ఆర్బీఐ డెక్కన్ బ్యాంక్ లైసెన్స్ రద్దు చేయడానికి పలు కారణాలు ఉన్నాయి.
ముఖ్యంగా డెక్కన్ అర్బన్ కోపరేటివ్ బ్యాంక్ వద్ద సరిపడా మూలధనం లేదు. రానున్న రోజుల్లో ఎంత ఆదాయం వస్తుంది? అసలు ఆదాయ మార్గాలు కూడా లేవు. ఇది బ్యాంకింగ్ రెగ్యులేషన్ యాక్ట్ 1949లోని సెక్షన్11(1), సెక్షన్ 22(3) (D), సెక్షన్ 56, 22(3)(A), 22(3)(B), 22(3)(C), 22(3)(D), 22(3)(E), 56 రూల్స్ ను అధిగమించినట్లు వెల్లడించింది.
ఇలాగే ఈ బ్యాంక్ మరింతకాలం కొనసాగితే డిపాజిట్ దారులు, కస్టమర్లు మరింత నష్టపోతారని వెల్లడించింది. ఇప్పటికే డిపాజిట్‌దారులకు పూర్తి మొత్తం చెల్లించే పరిస్థితి కూడా లేదని తెలియజేసింది. అయితే లైసెన్స్ రద్దు కావడం వల్ల డిపాజిట్ దారులపై ప్రతికూల ప్రభావం పడే అవకాశం లేదనే చెప్పాలి. డిపాజిట్ ఇన్సూరెన్స్ అండ్ క్రెడిట్ గ్యారెంటీ కార్పొరేషన్ కింద ప్రతి ఒక్క డిపాజిట్ దారుడి సొమ్ము వెనక్కి వస్తుంది.
రూ.5 లక్షలలోపు డిపాజిట్ మొత్తం కలిగిన వారికి ఎలాంటి ఢోకా ఉండదనే చెప్పాలి. అంతేకాకుండా 99 శాతం మంది డిపాజిట్ సొమ్ము వెనక్కి వస్తుందని ఆర్బీఐ సైతం వెల్లడించింది. ఆర్బీఐ హామీతో డిపాజిట్ దారుల్లో ఆందోళన తగ్గిందనే చెప్పాలి. ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.