బ్యాంకుల పనితీరు సరిగా లేకపోతే ఆర్బీఐ వాటి లైసెన్సులను రద్దు చేస్తుంటుంది. ఈ క్రమంలో ఆర్బీఐ 8 బ్యాంకులను రద్దు చేసింది. మీరు గనుక ఈ బ్యాంకుల్లో ఖాతా కలిగి ఉంటే ఒకసారి చెక్ చేసుకోండి.
దేశ ఆర్థిక వ్యవస్థలో బ్యాంకులు కీలక పాత్ర పోషిస్తాయి. అయితే బ్యాంకుల పనితీరు సరిగా లేకపోతే ఆర్బీఐ వెంటనే చర్యలు తీసుకుంటుంది. ఎప్పటికప్పుడు బ్యాంకులపై ఆర్బీఐ ప్రత్యేక దృష్టి సారిస్తూనే ఉంటుంది. రాజకీయ పలుకుబడి ఉన్న వారికి ఇష్టానుసారం లోన్లు ఇచ్చేయడం.. సూటు, బూటు వేసుకుని వచ్చే అనర్హులకు పెద్ద మొత్తంలో ఋణాలు మంజూరు చేయడం.. వాళ్ళు లోన్లు ఎగ్గొట్టడం వంటి వాటి వల్ల ప్రజల మీద, దేశం మీద భారం పడుతుంది. అందుకే బ్యాంకులను ఆర్బీఐ మానిటరింగ్ చేస్తూ ఉంటుంది. ఇప్పటికే ఈ ఏడాది సురక్షిత బ్యాంకులను ప్రకటించిన ఆర్బీఐ.. మిగతా బ్యాంకులపై మాత్రం నిఘా ఉంటుందని చెప్పకనే చెప్పింది. అలానే ఈ ఏడాది 8 బ్యాంకుల లైసెన్సును ఆర్బీఐ రద్దు చేసింది. నిర్వహణ లోపం కారణంగా రద్దు చేసింది. మరి ఆ బ్యాంకులేమిటో చూసేయండి.
దేశ ఆర్థిక వ్యవస్థలో కీలక పాత్ర పోషించే బ్యాంకుల్లో గ్రామీణ ప్రాంతాలు, పట్టణ ప్రాంతాల్లో ఉండే బ్యాంకులు కూడా ఉంటాయి. వీటిలో కోఆపరేటివ్ బ్యాంకులు చాలా కీలకం. మారుమూల గ్రామాలకు సైతం ఇవి బ్యాంకింగ్ సేవలను అందిస్తాయి. అయితే ఈ బ్యాంకులపై కఠిన నిబంధనలు ఉండడం, ఆర్థిక పరిస్థితులు పేలవంగా ఉండడం, స్థానిక రాజకీయాల ఒత్తిడి ఎక్కువగా ఉంటాయి. ఈ పరిస్థితులు బ్యాంకుల పనితీరు మీద తీవ్ర ప్రభావం చూపిస్తాయి. ఈ క్రమంలో దేశంలో ఉన్న కోఆపరేటివ్ బ్యాంకుల పనితీరుపై ఆర్బీఐ గట్టి నిఘా పెట్టింది. ఈ బ్యాంకుల పనితీరును ఎప్పటికప్పుడు గమనిస్తూ కఠిన నిర్ణయాలు తీసుకుంటోంది.
కోఆపరేటివ్ బ్యాంకుల పనితీరు సరిగా లేకపోయినా, మూలధనం లేకుండా దివాళా తీసే పరిస్థితికి చేరుకున్నా వాటిపై ఆర్బీఐ ప్రత్యేక దృష్టి సారిస్తోంది. ఆ బ్యాంకులపై ఆంక్షలు విధించడమే కాకుండా లైసెన్సులు కూడా రద్దు చేస్తోంది. ఈ ఏడాది నాలుగు నెలల వ్యవధిలో 8 బ్యాంకుల లైసెన్సులను ఆర్బీఐ రద్దు చేసింది. నిర్వహణ సరిగా లేక దివాళా అంచుకు చేరుకోవడంతో ఈ బ్యాంకుల లైసెన్సులను రద్దు చేసింది. వీటిలో సేవా వికాస్ కోఆపరేటివ్ బ్యాంకు, దక్కన్ అర్బన్ కోఆపరేటివ్ బ్యాంకు, మిలాత్ కోఆపరేటివ్ బ్యాంకు, శ్రీ ఆనంద్ కోఆపరేటివ్ బ్యాంకు, ముధోల్ కోఆపరేటివ్ బ్యాంకు, రూపీ కోఆపరేటివ్ బ్యాంకు, బాబాజీ దాతే మహిళా అర్బన్ బ్యాంకు, లక్ష్మీ కోఆపరేటివ్ బ్యాంకులు ఉన్నాయి.
భవిష్యత్తులో కూడా ఈ బ్యాంకుల్లో ఆదాయ మార్గాలు లేకపోవడంతో ఆర్బీఐ లైసెన్సులను రద్దు చేసింది. కొన్ని ఇతర బ్యాంకులకు కూడా జరిమానా విధించింది. నియమాలను ఉల్లంఘించిన బ్యాంకులకు 50 వేల నుంచి 5 లక్షల వరకూ జరిమానా విధించింది. మానిటరీ పాలసీ నిబంధనలు ఉల్లంఘించి రుణాలు మంజూరు చేయడం, లబ్ధిదారులకు వివరాలు వెల్లడించడంతో అశ్రద్ధ, అలసత్వం వహించిన కారణంగా జరిమానా విధించింది. నియమాల ఉల్లంఘన ఇలానే కొనసాగితే ఈ బ్యాంకుల లైసెన్సులను కూడా ఆర్బీఐ రద్దు చేసే అవకాశం ఉంది. కాగా 2022లో 12 కోఆపరేటివ్ బ్యాంకుల లైసెన్సులను రద్దు చేసింది. ఈ ఏడాది 4 నెలల్లోనే 8 బ్యాంకులను రద్దు చేయడం గమనార్హం.