ప్రస్తుత కాలంలో మన ఇళ్లల్లో ఎలాంటి శుభకార్యం జరిగినా.., మగవాళ్లంతా తెల్లని పంచెకట్టులో మెరిసిపోతుంటారు. కానీ.., అందరిలో కామన్ పాయింట్ ఏమిటంటే.. అవన్నీ చాలావరకూ రామ్రాజ్ బ్రాండ్ కి చెందినవే ఉంటాయి. ఎందుకంటే పంచెల మార్కెట్లో ఆ బ్రాండే రారాజు. దీని వెనక ఉన్న వ్యక్తి.. ఆ సంస్థ వ్యవస్థాపకుడు కె.ఆర్.నాగరాజన్. తమిళనాడులోని వస్త్ర నగరం తిరుపూర్ నుంచి దేశవిదేశాలకు రామ్రాజ్ సామ్రాజ్యాన్ని విస్తరించిన తీరు అద్భుతం అనే చెప్పుకోవాలి.వ్యాపారంలో అడుగుపెట్టాలని కె.ఆర్.నాగరాజన్ చిన్నతనంలోనే నిర్ణయించుకున్నారు. కానీ.., వారిది వ్యాపారుల కుటుంబం కాదు. కానీ.., పెద్దయ్యాక వ్యాపారం మాత్రమే చేయాలని నిర్ణయించుకున్నాడు. అందుకు కారణం వేరే ఉంది. కె.ఆర్.నాగరాజన్ ది తమిళనాడులోని అవినాశి అనే గ్రామం. వస్త్ర రంగానికి ప్రసిద్ధి అయిన తిరుపూర్కు దగ్గర్లో ఉంటుంది ఆ ఊరు. ఆ ఊరిలో అందరూ చిరు ఉద్యోగులే. అంతా బాగా చదువుకున్నారు. కానీ.., మూడో క్లాస్ తో చదువు ఆపేసి వ్యాపారంలోకి దిగిన ఒక వ్యక్తి మాత్రమే అందరికన్నా బాగా సెటిల్ అయ్యాడు. అతనికి సొంత కార్ ఉండేది. చదువుకున్న ఎవ్వరికీ అంత స్థోమత ఉండేది కాదు. దీనితో కె.ఆర్.నాగరాజన్ పెద్దయ్యాక బిజినెస్ మేన్ అవ్వాలని డిసైడ్ అయిపోయారు.
అలా తొమ్మిదో తరగతి చదువుతున్నపుడు.. పిల్లలు ఇష్టపడే బాలమిత్ర మ్యాగజైన్కి ఏజెన్సీ తీసుకోవాలన్న ఆలోచన వచ్చింది కె.ఆర్.నాగరాజన్ కి. ఆ ఆలోచన సూపర్ సక్సెస్ అయ్యింది. అక్కడితో అవసరాలకి ఇంట్లో వారిని డబ్బులు అడగడం మానేశాడు.వ్యాపారం మీద మాత్రమే శ్రద్ధ ఉండటంతో ఇంటర్ ఫస్టియర్తో చదువు ఆగిపోయింది. కె.ఆర్.నాగరాజన్ వ్యాపారిగా విజయవంతం కావడానికి ఆ వైఫల్యమే మొదటి అడుగు. తరువాత ఒక వస్త్ర వ్యాపార సంస్థలో గుమస్తాగా చేరారు కె.ఆర్.నాగరాజన్. 15 రోజులు దుకాణంలో ఉంటూ, మరో 15 రోజులు గ్రామాలకు వెళ్తూ చేనేత కార్మికుల్ని కలుస్తూ పనిని పర్యవేక్షించాలి. ఇక్కడే చాలా మెళుకువలు నేర్చుకున్నారు కె.ఆర్.నాగరాజన్. కానీ.., వస్త్ర వ్యాపారాలు చేనేత కార్మికులున చులకనగా చూడటం ఆయనకి నచ్చేది కాదు. కానీ.., మరో మార్గం లేక అక్కడే ఆరేళ్ళ పాటు.. పని చేశారు కె.ఆర్.నాగరాజన్. కావాల్సినంత అనుభవం వచ్చాక సొంతగా వ్యాపారాన్ని మొదలు పెట్టారు.నాన్న రామస్వామి పేరులోని రామ్, తన పేరులోని రాజ్ని తీసుకుని 1983లో తిరుపూర్లో ‘రామ్రాజ్ ఖాదీ ట్రేడర్స్’ పేరుతో పంచెల హోల్సేల్ వ్యాపారం మొదలుపెట్టారు. నిజానికి అప్పటికే పంచెల వాడకం బాగా తగ్గిపోయింది. ఏటికి ఎదురీదడం ఎందుకు’ అనేది అందరి ప్రశ్న. కానీ.., కె.ఆర్.నాగరాజన్ తన నమ్మకాన్ని వదులుకోలేదు.
తిరుపూర్ చుట్టూ ఉన్న గ్రామాలకు వెళ్లి నేత కార్మికుల్ని కలిశాడు కె.ఆర్.నాగరాజన్. అప్పట్లో వాళ్లకి మీటరు వస్త్రానికి రెండు రూపాయలు వచ్చేది. నాతో పనిచేస్తే ఏడాది పొడుగునా పని కల్పిస్తానంటే, సరేనన్నారు. ఇంకా ఆశ్చర్యం ఏమిటంటే మన అందరికీ వస్త్రాలు చేసే చేనేత కార్మికులకు అప్పుడు ఒంటి మీద చొక్కాలు ఉండేవి కాదు. కె.ఆర్.నాగరాజన్ తాను గుమస్తాగా ఉన్నప్పటి నుండి చేనేత కార్మికులు సరుకు తీసుకుని షాప్స్ కి చొక్కాలు లేకుండానే వచ్చేవారు. అందుకే ఆయన కార్మికులకు ఒక కండీషన్ పెట్టారు. మీకు ఇప్పటి వరకు అందరూ ఇస్తోంది మీటరుకి రూ.2 మాత్రమే. కానీ.., నేను మీటర్ కి 3.రూ ఇస్తాను. కానీ.., మీరు నా దుకాణానికి వచ్చేటపుడు కచ్చితంగా చొక్కాతో రావాలని చెప్పారు కె.ఆర్.నాగరాజన్. ఇక తమ పంచెల తయారీకి మార్కెట్లో ఉండే నాణ్యమైన పత్తిని ఎంచుకున్నారు. అలా మొదటిసారి రూ.85 వేలు విలువచేసే సరుకు తీసుకుని తనకు బాగా తెలిసిన పుత్తూరులోని ఒక రిటైల్ దుకాణానికి వెళ్లారు. ఒక్కో పంచె ధర రూ.110 అని చెప్పాడు. నిజానికి పంచెలకి అప్పట్లో మార్కెట్లో ఉన్న ధర కేవలం రూ.60-70 మాత్రమే. అయినా కె.ఆర్.నాగరాజన్ తన పంచె ధర తగ్గించేలేదు. క్వాలిటీ బాగుంటే ప్రజలు కొనుకుంటారని షాప్ యజమానిని ఒప్పించాడు. ఫలితం వారం లోపే ఆ స్టాక్ అంతా అయిపొయింది.
తరువాత కంపెనీ పేరులో ‘ఖాదీ’ కాస్త కాటన్గా మారింది. అలా రామ్ రాజ్ కాటన్ మార్కెట్ లోకి వచ్చింది. డిమాండ్ బాగా ఉండటంతో పంచెలతోపాటు షర్టులూ తీసుకొచ్చారు. దక్షిణాది మొత్తం రామ్ రాజ్ కాటన్ విస్తరించింది. కానీ.., పంచెలపై కె.ఆర్.నాగరాజన్ ఇంత నమ్మకం రావడానికి కారణం ఏమిటంటే అయన ఎదుర్కొన్న అవమానాలే. ఒకరోజు ఆయన తన వ్యాపార భాగస్వామి కూతురి పెళ్లి రిసెప్షన్కి ఫ్రెండ్స్తో కలిసి చెన్నైలోని ఓ స్టార్ హోటల్కి వెళ్లారు. ప్యాంటూ షర్టూ వేసుకున్న వాళ్లందరినీ లోపలకి పంపించి పంచెకట్టులో ఉన్న తనని మాత్రం అడ్డుకున్నారు సెక్యూరిటీ. ఇక్కడే కాదు.. బ్యాంకులూ, ప్రభుత్వ కార్యాలయాలూ, ఎక్కడికి వెళ్లినా ప్యాంటూచొక్కా వేసుకున్నవాళ్లతో పోల్చితే తనని చులకనగా చూసేవారు. జనాల్లో పంచెకట్టు అంటే గౌరవ మర్యాదలు తక్కువనీ… పల్లెటూరి బైతు అన్న చులకనభావం ఉందనీ ఆయనకి అర్థమైంది. ఇంతే.., మర్నాడే చెన్నైలో ప్రకటనలు రూపొందించే కంపెనీకి వెళ్లి పంచెకట్టు గౌరవం పెంచేలా ఒక యాడ్ చేయమని అడిగాడు. తనకి ఎలాంటిచోటైతే అవమానం జరుగుతుందో.., అలాంటి చోటకు పంచెకట్టుతో వెళ్లిన వ్యక్తికి గౌరవమిస్తున్నట్టు ఆ యాడ్లో కనిపించాలని చెప్పారు అలా తీసిన ‘సెల్యూట్ రామ్రాజ్’ ప్రకటనకు మంచి పేరొచ్చింది. ఇప్పుడు దక్షిణాదిలో రామ్ రాజ్ కు సుమారు 170 దాకా బ్రాంచ్ లు ఉన్నాయి. చూశారు కదా? పట్టుదల ఉంటే తెలిసిన రంగంలోకి ఎంత బాగా ఎదగవచ్చో. ఈ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియచేయండి.