ఇండియన్ బిగ్ బుల్ రాకేశ్ ఝున్‌ఝున్‌వాలా కేవలం 10 నిమిషాల్లో ఏకంగా 850 కోట్ల రూపాయలు సంపాదించి రికార్డు సృష్టించారు. ఏస్ ఇన్వెస్టర్ పెట్టుబడుల్లోని అతి పెద్ద స్టాక్ బెట్ టైటాన్, అక్టోబర్ 7న ట్రేడింగ్‌లో ధగధగా మెరిసింది. దాదాపు 10 శాతం ర్యాలీ చేసింది. కేవలం 10 నిమిషాల్లోనే మార్కెట్ క్యాపిటల్‌కు మరో రూ.17,770 కోట్లను ఈ కంపెనీ జోడించింది. ట్రేడింగ్ ప్రారంభంలోనే టైటాన్ షేర్లు 9.32% పెరిగి, రూ.2,347 రికార్డు స్థాయికి చేరుకున్నాయి. ఈ టాటా గ్రూపు కంపెనీలో ఝున్‌ఝున్‌వాలాకు, ఆయన భార్యకు కలిపి 4.81% వాటా ఉంది.
దీంతో ఇప్పుడు వారి వాటా విలువ రూ.854 కోట్ల మేర పెరిగింది. ఇంట్రాడేలో రూ.2,08,350 కోట్ల మార్కెట్ క్యాపిటల్‌కు టైటాన్ చేరుకుంటే.. ఈ సమయంలో టైటాన్ గ్రూప్ కంపెనీలో రాకేశ్ ఝున్‌ఝున్‌వాలా వాటా విలువ రూ.10,000 కోట్లకు చేరుకుంది. సెప్టెంబర్ త్రైమాసికంలో ఆభరణాల తయారీదారు వ్యాపార లావాదేవీలు ప్రీ-కోవిడ్ స్థాయిలకు తిరిగి చేరుకున్నాయి. అలాగే, రాబోయే పండుగ సీజన్ దృష్టిలో పెట్టుకొని మదుపరుల భారీగా పెట్టుబడులు పెట్టినట్లు నిపుణులు పేర్కొన్నారు. గత ఏడాదితో పోలిస్తే 78 శాతం వృద్ధిని టైటాన్ సాధించింది. టాటా గ్రూప్ కంపెనీ ఈ త్రైమాసికంలో కొత్తగా మరో 13 దుకాణాలను ప్రారంభించినట్లు టైటాన్ తెలిపింది.