బ్యాంకుల్లో డబ్బు దాచుకునేదే రేపొద్దున ఏ కష్టమొస్తుందో.. ఏ అవసరమొస్తుందో అన్న భయంతో.. మరి అలా దాచిన డబ్బు కోసం ఎవరూ రాకుంటే..? అది ప్రభుత్వానికే. అవును కొన్నేళ్ల పాటు ట్రాన్సక్షన్స్ జరగపోయినా.. డబ్బు కోసం ఎవరూ రాకపోయినా వారి ఖాతాలో మొత్తాన్ని ఆర్‌బీఐకి బదిలీ చేస్తారు.
సంపాదించేది పది రూపాయలైనా అందులో నాలుగు రాళ్లు బ్యాంకుల్లో దాచుకోవడం అన్నది ఈ రోజుల్లో కామన్. భవిష్యత్తులో ఏ కష్టమొస్తుందో.. ఏ అవసరమొస్తుందో అన్న భయంతో దాచుకునేవారు కొందరైతే.. బ్యాంకుల్లో అయితే మన డబ్బు ఎక్కడికి పోదు.. భద్రంగా ఉంటుందన్న నమ్మకంతో దాచుకొనేవారు మరికొందరు. ఇలా ప్రజలందరూ కలిసి దేశమంతటా ఉన్న బ్యాంకుల్లో కొన్ని లక్షల కోట్ల రూపాయలు డిపాజిట్ చేసుంటారు. అందులో కొంత మొత్తాన్ని వారి రోజువారీ అవసరాల కోసం విత్ డ్రాయల్ చేస్తున్నప్పటికీ.. కొంత మొత్తాన్ని అందులోనే దాస్తుంటారు. కానీ, ఒకసారి బ్యాంకుల్లో దాచాక మళ్లీ ఆ డబ్బు కోసం ఎవరూ రాకపోతే ఏమవుతుందో తెలుసా..! ప్రభుత్వానికి చెందుతుంది.
అలా గత పదేళ్లుగా ఎవరూ క్లెయిమ్ చేయని 35వేల కోట్ల రూపాయలను ప్రభుత్వ రంగ బ్యాంకులు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్‌బీఐ)కి బదిలీ చేసినట్లు కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి భగవత్ కరాడ్ వెల్లడించారు. ఈ డిపాజిట్లు 10.24 కోట్ల ఖాతాలకు సంబంధించినవి అని ఆయన పేర్కొన్నారు. సాధారణంగా 10 ఏళ్లు లేదా అంతకుమించి క్రియాశీలకంగా లేని డిపాజిట్లను అన్‌క్లెయిమ్డ్ డిపాజిట్లుగా వ్యవహరిస్తారు. ఈ అన్‌క్లెయిమ్డ్ డిపాజిట్లు ఎక్కువగా ఉన్న బ్యాంకుల్లో.. రూ.8,086 కోట్లతో ఎస్‌బీఐ అగ్రస్థానంలో ఉండగా.. పంజాబ్ నేషనల్ బ్యాంక్ (రూ.5,340 కోట్లు), కెనరా బ్యాంక్ (రూ.4,558 కోట్లు), బ్యాంక్ ఆఫ్ బరోడా (రూ.3,904 కోట్లు) తరువాతి స్థానాల్లో ఉన్నాయి. మరీ ఇంత భారీ మొత్తంలో డబ్బులు ఎలా ఉండిపోయాయ్? ఒకవేళ ఖాతాదారుడు మరణించాడనుకుంటే.. అతని ఖాతాలోని డబ్బును వారి కుటుంబాలు క్లెయిమ్ చేసుకునేందుకు వీలుగా బ్యాంకులు వెసులుబాటు కల్పిస్తున్నాయి. అలాంటప్పుడు ఇంత మొత్తంలో అన్‌క్లెయిమ్డ్ డిపాజిట్లు ఎలా ఉంటున్నాయని మార్కెట్ నిపుణులు ప్రశ్నిస్తున్నారు.
ఈ నేపథ్యంలో క్లెయిమ్ చేయని నగదును సంబంధిత వ్యక్తులకు అందించేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రయత్నాలు మొదలుపెట్టింది. ఇందు కోసం మార్గదర్శకాలను సిద్ధం చేయాల్సిందిగా ఆర్థికశాఖ నిపుణులకు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ సూచనలు జారీ చేశారు. ఇప్పటికే బ్యాంకుల్లో ఉన్న అన్‌క్లెయిమ్డ్ డిపాజిట్ల వివరాలు తెలుసుకునేందుకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కామన్ పోర్టల్ అందుబాటులోకి తీసుకొచ్చి సంగతి తెలిసిందే. అలాగే బ్యాంకులు సైతం తమ అధికారిక వెబ్ సైట్ ద్వారా ఆ వివరాలు తెలుసుకునే వెసులుబాటు కల్పించాయి.
SPECIAL DRIVE FOR UNCLAIMED DEPOSITS ! FM Nirmala Sitharaman calls for special drive to help people get their unclaimed deposits in banks ?? pic.twitter.com/YsbFXWMGxn
— shashwat amrev (@AmrevShashwat) May 11, 2023