‘ఏడాదికి 20 రూపాయలు కడితే చాలు.. 2 లక్షల రుపాయల ప్రమాద బీమా..’ ప్రధానమంత్రి సురక్షా బీమా యోజన(పీఎంఎస్‌బీవై) పథకం ద్వారా ఈ భీమా అందిస్తున్నారు. ఏదైనా అనుకోని ప్రమాదాలు సంభవించి మరణించినా లేదా వైకల్యం సంభవించినా ఆపద వేళల అండగా నిలిచేందుకు కేంద్ర ప్రభుత్వం పీఎంఎస్‌బీవై పథకాన్ని తీసుకొచ్చింది. ఈ పథకం ద్వారా అకాల మరణానికి, శాశ్వత అవిటితనానికి 2లక్షల రూపాయల బీమాను, శాశ్వత పాక్షిక్ష అవిటితనానికి లక్ష రూపాయల బీమాను అందిస్తున్నారు.
ప్రధాన మంత్రి సురక్షా బీమా యోజన అనేది ఒక సామాజిక భద్రతా పథకం. 2015 బడ్జెట్ లో కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన మూడు సామాజిక భద్రతా పథకాల్లో ఇదీ ఒకటి. ఈ పాలసీ తీసుకున్న వ్యక్తి ప్రమాదవశాత్తు మరణించినా లేదా వైకల్యం పొందినా ఈ పథకం అండగా ఉంటుంది. చందాదారుడు ప్రమాదానికి గురై మరణించినా లేదా శాశ్వతంగా వైకల్యానికి గురైనా రూ.2 లక్షలు, పాక్షిక వైకల్యానికి గురైతే రూ.1 లక్ష పరిహారం లభిస్తుంది. అంటే.. ప్రమాదంలో రెండు కళ్లు పూర్తిగా కోల్పోయినా, రెండు చేతులు/కాళ్ళు కోల్పోయినా దానిని శాశ్వత వైకల్యంగా.. అదే ఒక కాలు లేదా ఒక చెయ్యి కోల్పోయి, కంటి చూపు కోల్పోయినా దానిని పాక్షిక వైకల్యంగా పరిగణిస్తారు.
దీని కాలపరిమితి ఒక సంవత్సరం మాత్రమే. ప్రతి సంవత్సరం జూన్ 1వ తేదీ నుంచీ బీమా ప్రారంభమై మే 31వ తేదీతో ముగుస్తుంది. ఏటా దీన్ని పునరుద్ధరించుకోవాల్సి ఉంటుంది. 18 నుంచి 70 సంవత్సరాల మధ్య వయసున్న ఎవరైనా ఇందులో చేరొచ్చు. ఇందుకోసం ఏదైనా బ్యాంకులో పొదుపు ఖాతా ఉండాలి. ఆ ఖాతాతో మీ ఆధార్ కార్డు తప్పనిసరిగా అనుసంధానమై ఉండాలి. ఒకవేళ మీరు ఒకటి కంటే ఎక్కువ బ్యాంకు ఖాతాలను కలిగి ఉంటే, అప్పుడు మీరు ఏదైనా ఒక బ్యాంకు ఖాతా ద్వారా మాత్రమే ఈ పథకంలో చేరే అవకాశం ఉంటుంది. ఉమ్మడి ఖాతా విషయానికి వస్తే, ఖాతాలో పేర్లు ఉన్నవారందరూ ఈ పథకంలో చేరవచ్చు. ఎన్నారైలు కూడా ఈ పథకంలో చేరడానికి అర్హులు. కానీ క్లెయిమ్ చేయాల్సి వచ్చిన సమయంలో లబ్ధిదారుడికి/నామినీకి భారత కరెన్సీలో చెల్లింపు చేస్తారు. ఇంతకుముందు ప్రీమియం రూ.12గా ఉండేది. ఈ మధ్యనే దాన్ని రూ.20కి పెంచారు.
అన్ని ప్రభుత్వరంగ బ్యాంకుల్లో ఈ పథకం అమలులో ఉంది. బ్యాంకులు తమ ఖాతాదారుల కోసం ఉచితంగా ఈ పథకాన్ని అమలు చేసేందుకు సాధారణ బీమా సంస్థలతో కలిసి పనిచేస్తున్నాయి. మీరు చేయాల్సిందల్లా బ్యాంకుకు సందర్శించి.. సిబ్బందికి మీ ఆసక్తిని తెలియజేయడమే. నెట్ బ్యాంకింగ్ ద్వారా కూడా ఈ పథకంలో చేరవచ్చు.
గమనిక: సహజ విపత్తుల కారణంగా జరిగిన ప్రమాదాలు, మరణం లేదా వైకల్యం మాత్రమే ప్రధాన మంత్రి సురక్షా బీమా యోజన పథకం కింద కవర్ అవుతుంది. ఆత్మహత్య చేసుకున్న సందర్భాల్లో ఈ పథకం వర్తించదు. అలాగే.. బ్యాంకులో సేవింగ్స్ ఖాతా లేనివారు ఈ పథకానికి అర్హులు కారు.
Protecting your loved ones is a responsibility that needs the utmost trust. Now, you’ve found one with Pradhan Mantri Suraksha Bima Yojana & Pradhan Mantri Jeevan Jyoti Bima Yojana. Know more: https://t.co/LkSzZerFcy https://t.co/DkL4wRjD4v#AmritMahotsav #PoweredByGoodness pic.twitter.com/F97X0ryT3I
— Union Bank of India (@UnionBankTweets) November 15, 2022