ఎటువంటి రిస్క్ లేకుండా పెట్టిన పెట్టుబడులపైన మంచి ఆదాయం రావాలంటే పోస్ట్ ఆఫీస్ డిపాజిట్ స్కీమ్స్ ఉత్తమమైనవి అని చెప్పుకోవాలి. పోస్టాఫీస్.. పెట్టుబడులపై భద్రతతో పాటు మంచి రాబడి కూడా అందిస్తుంది. అందులోనూ.. ప్రభుత్వ సంస్థ కనుక పథకాలు నమ్మదగినవి కూడాను. ఇప్పుడు మనం చెప్పబోయే స్కీం.. కిసాన్ వికాస్ పత్ర. పోస్టాఫీస్ అందిస్తున్న సేవింగ్ స్కీమ్‌లలో ఇది కూడా ఒకటి. ఈ సేవింగ్ స్కీమ్‌లో మీ సొమ్మును మదుపుచేశారంటే 124 నెలల్లో(10 సంవత్సరాల 4 నెలలు) అది రెట్టింపవుతుంది. అంతేకాకుండా మీ డబ్బు పూర్తిగా సురక్షితంగానూ ఉంటుంది.
ఇక్కడ మీకొక డౌట్ రావొచ్చు. బ్యాంకుల్లో ఇన్ని రోజులు పెట్టినా.. ఇంతే మొత్తంలో డబ్బు వస్తుంది కదా అని. బ్యాంకులు దివాలా తీస్తే కేవలం 5 లక్షలు మాత్రమే తిరిగి పొందుకునే అవకాశం ఉంటుంది. ఐతే పోస్టాఫీసులో అలా కాదు. ఇక్కడ పెట్టుబడి పెట్టిన మొత్తం సొమ్ముకు ప్రభుత్వం బాధ్యత వహిస్తుంది. బాండ్ల రూపంలో మనం పెట్టిన పొదుపుకు కేంద్ర ప్రభుత్వ హామీ ఉంటుంది.
ఎంత వరకు పెట్టుబడి పెట్టొచ్చు?
కిసాన్ వికాస్ పత్రలో డబ్బు పెట్టుబడి పెట్టడానికి పరిమితి లేదు. కానీ కనీస పెట్టుబడి రూ.1000 ఉండాలి. అంటే మీరు ఎంత డబ్బునైనా 1000 రూపాయల గుణిజాల్లో పెట్టుబడి పెట్టవచ్చు. అంటే.. రూ. 1,000, రూ. 2,000, రూ. 3,000.. ఇలా పొదుచేయాల్సి ఉంటుంది.
ఖాతా తెరవడానికి ఎవరు అర్హులు?
కిసాన్ వికాస్ పత్ర పథకానికి సంబంధించిన అకౌంట్‌లో ముగ్గురు సభ్యులవరకు జాయింట్ అకౌంట్ తెరవొచ్చు. పదేళ్ల వయసున్న మైనర్లు కూడా తమ పేరు మీద నేరుగా ఖాతా తెరవొచ్చు.
వడ్డీ రేటు?
ప్రస్తుతం కిసాన్ వికాస్ పత్రపై సంవత్సరానికి 6.9 శాతం వడ్డీ లభిస్తోంది. ఇందులో పెట్టుబడి పెడితే, మీరు డిపాజిట్ చేసిన మొత్తం 124 నెలల్లో (10 సంవత్సరాల 4 నెలలు) రెట్టింపు అవుతుంది. ఉదాహరణకు, మీరు ఈ పథకంలో రూ. 5 లక్షలు పెట్టుబడి పెట్టారని అనుకుందాం.. 124 నెలల తర్వాత మీకు రూ. 10 లక్షలు వస్తాయి.
కిసాన్ వికాస్ పత్ర వల్ల కలిగే మొట్టమొదటి ప్రయోజనం.. మన పెట్టుబడిపై వచ్చే రాబడికి హామీ ఉండడం. ఈ స్కీం గడువు 124 నెలలు అయినప్పటికీ, లాక్-ఇన్ వ్యవధి 30 నెలలు. కావాలంటే అంతకుముందు కూడా క్లోజ్ చేసుకునే వెసులుబాటు ఉంది. కానీ 30 నెలల తర్వాత క్లోజ్ చేస్తేనే రాబడి ఉంటుంది. దీనికోసం ఖాతాదారుడు దరఖాస్తు ఫారం-2ను పోస్టాఫీసులో సమర్పించాలి. కిసాన్ వికాస్ పత్రలో రూ.1000 ఇన్వెస్ట్ చేస్తే, లాక్-ఇన్ పీరియడ్ ముగిసే సమయానికి, 30 నెలల నుంచి 36 నెలల లోపు విత్ డ్రా చేస్తే రూ.1154 మొత్తాన్ని పొందుతారు. 60 నుంచి 66 నెలల లోపు విత్ డ్రా చేస్తే రూ. 1332 లభిస్తుంది. ఏడున్నర సంవత్సరాల నుంచి 8 ఏళ్ల లోపు విత్ డ్రా చేస్తే రూ.1537 లభిస్తుంది.
కేవీపీలో చేరాలంటే కావాల్సిన డాకుమెంట్స్..
కిసాన్ వికాస్ పత్ర స్కీంలో మీరు చేరాలనుకుంటే.. దగ్గరలోని పోస్టాఫీస్ ను సంప్రదించండి. ఈ పథకంపై.. మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.