గత కొన్ని రోజులుగా ఇంధన ధరలు పెరుగుతూనే ఉన్నాయి. మన దేశంలో చాలా ప్రాంతాల్లో లీటర్ పెట్రోల్, డీజిల్ ధర 100 రూపాయలకు పైగానే ఉంది. కరోనా కాలంలో పెట్రోల్ ధరలు తగ్గుతాయని అందరూ భావించారు. కానీ మన దగ్గర మాత్రం అలా జరగలేదు. ఇక ఇంధన ధరల పెరుగదల వల్ల.. సామాన్యుల జీవితాలు మరింత భారంగా మారాయి. ఇంధన ధరల పెరుగుదల ప్రతి దాని మీద ప్రభావం చూపుతుంది. ఫలితంగా కూరగాయలు మొదలు.. గ్యాస్ సిలిండర్ వరకు ఇలా అన్ని రేట్లు పెరిగాయి. ఇక రష్యా-ఉక్రేయిన్ యుద్ధం కారణంగా అంతర్జాతీయ మార్కెట్‌లో చమురు ధరలు విపరీతంగా పెరిగాయి. అలానే వంట నూనె ధరలు కూడా కొండెక్కాయి. దేశ ఆర్థిక వ్యవస్థకు ఇంధనం అన్నది వెన్నెముకలాంటిది అని చెప్పవచ్చు.
ఈ క్రమంలో గత రెండు రోజులుగా మన దేశంలో ఇంధన ధరలు తగ్గుతాయని జోరుగా ప్రచారం సాగుతుంది. త్వరలోనే ఇంధన ధరలు తగ్గిస్తూ.. కేంద్రం నిర్ణయం తీసుకుంటుందని మార్కెట్ విశ్లేషకులు అంటున్నారు. ఒకవేళ అలా కేంద్రం ఇంధన ధరలు తగ్గిస్తూ.. నిర్ణయం తీసుకుంటే.. లీటర్ పెట్రోల్‌పై ఏకంగా 14 రూపాయలు తగ్గే అవకాశం ఉంది అంటున్నారు. ఎందుకు ఇంత భారీగా తగ్గుతుంది అంటే..
గత కొన్ని రోజులుగా అంతర్జాతీయ మార్కెట్‌లో క్రూడాయిల్ ధరలు భారీగా తగ్గాయి. ఈ ఏడాది జనవరి నుంచి పోలిస్తే.. ప్రస్తుతం అంతర్జాతీయ మార్కెట్‌లో క్రూడాయిల్ ధరలు చాలా కనిష్టంగా ఉన్నాయి. ప్రస్తుతం 81 డాలర్లకు తగ్గింది. యూఎస్ క్రూడ్ బ్యారెల్‌కు 74 డాలర్ల దగ్గర ఉంది. ముడి చమురు ధరలలో గణనీయమైన తగ్గుదల కారణంగా.. భారతీయ రిఫైనరీలకు సగటు ముడి చమురు ధర బ్యారెల్ 82 డాలర్లకు లభిస్తోంది. కాగా ఈ ఏడాది మార్చిలో ఈ ధర 112.8 డాలర్లుగా ఉండగా.. ప్రస్తుతానికి 31 డాలర్లు తగ్గింది అంటే 27 శాతం మేర తగ్గింది.
ఇక ఎస్‌ఎంసీ గ్లోబల్ ప్రకారం.. మన దేశంలోని ఆయిల్ కంపెనీలకు.. ముడి చమురులో ప్రతి డాలర్ తగ్గుదలకి.. శుద్ధి చేయడంపై లీటరుకు 45 పైసలు ఆదా అవుతుంది. దీని ప్రకారం.. లీటర్ పెట్రోల్-డీజిల్ ధరపై రూ.14 అవుతుంది. అయితే, నిపుణుల అభిప్రాయం ప్రకారం, ఇంత మొత్తం తగ్గింపు ఒకేసారి జరగదని.. దశల వారిగా ఉంటుందని అంటున్నారు. మరి కేంద్ర ప్రభుత్వం చమురు ధరల తగ్గింపు గురించి ఎలాంటి నిర్ణయం వెల్లడిస్తుందో చూడాలి. .