మనలో చాలా మంది పెద్ద పెద్ద కలలు కంటారు. కానీ వాటిని సాకారం చేసుకునేవారు కొందరే ఉంటారు. ఆ కల వారిని నిద్రపోనివ్వదు.. నిరంతరం వెంటాడుతూనే ఉంటుంది. కల సాకారం అయ్యే వరకు వారు విశ్రమించారు. అలాంటి వారికే విజయం దాసోహం అంటుంది. ఈ కోవకు చెందిన వ్యక్తి గురించి ఇప్పుడు తెలుసుకుందాం..
కృషి ఉంటే మనుషులు రుషులవుతారు.. మహా పురుషులవుతారు.. అనే మాట ఊరికే అనలేదు. కటకి పేదరికం అనుభవిస్తూ.. మంచి నీళ్లతో కడుపు నింపుకుంటూ.. కాళ్లకు కనీసం చెప్పులు కూడా లేకుండా.. కష్టపడుతూ.. రోజంతా పని చేస్తూ.. అహర్నిశలు శ్రమిస్తూ.. కష్టాల కడలిని ఈదుతూ.. జీవితంలో ఒక్కో మెట్టు ఎదుగుతూ.. విజయ శిఖరాలు అందుకున్న వారు ఎందరో ఉన్నారు. మనమీద మనకు బలమైన నమ్మకం, దృఢమైన సంకల్సం.. నిద్ర పోనివ్వని ఓ కోరిక.. ఇవి ఉంటే చాలు.. ఆ మనిషి విజయ తీరాలకు చేరతాడు. కృషితో నాస్తి దుర్భిక్షమ్ అనే మాటను ఎందరో నిజం చేసి చూపగా.. ఇక తాజాగా మరో వ్యక్తి ఈ జాబితాలో చేరాడు. ప్యూన్‌గా కెరీర్ ప్రారంభించి.. అంచెలంచెలుగా ఎదిగి.. రెండు టెక్ కంపెనీలకు బాస్‌గా మారాడు. నేడు కోట్ల రూపాయల టర్నోవర్‌తో బిజినెస్ మ్యాన్ అయ్యాడు. అతడి జీవితం ఎందరికో ఆదర్శం. ఆ వివరాలు..
ప్యూన్ నుంచి టెక్ కంపెనీలకు బాస్‌గా ఎదిగిన ఆ వ్యక్తి పేరు చోటు శర్మ. స్వస్థలం హిమాచల్ ప్రదేశ్, కాంగ్రా జిల్లాలోని ఓ కుగ్రామం. డిగ్రీ పూర్తి చేసిన చోటు శర్మకు.. కంప్యూటర్ కోర్స్ చేయాలని.. ఆ రంగంలో స్థిరపడాలనే కోరిక మెండుగా ఉండేది. కానీ కుటుంబ ఆర్థిక పరిస్థితులు అందుకు అనుకూలించలేదు. దాంతో తన కలను నెరవేర్చుకోవడం కోసం.. ఓ కంప్యూటర్ సెంటర్‌లో ప్యూన్‌గా చేరాడు చోటు శర్మ. పార్ట్‌టైమ్ ప్యూన్‌గా పని చేస్తూ.. కంప్యూటర్ కోర్సులు నేర్చుకున్నాడు. అలా ఒక్కో మెట్టు ఎక్కుతూ.. గుర్తింపు పొందిన సాఫ్ట్‌వేర్ డెవలపర్‌గా ఎదిగాడు.
2000 సంవత్సరంలో సాఫ్ట్‌వేర్ డెవలపర్‌గా మారిన చోటు శర్మ.. తాను అనుకున్న లక్ష్యాన్ని చేరుకోలేకపోయాడు. దాంతో.. తనకున్న పరిజ్ఞానాన్ని విద్యార్థులకు అందించాలని భావించాడు. అలా కంప్యూటర్ ట్రైనింగ్ సెంటర్‌లో చేరి.. అక్కడ శిక్షణకు వచ్చేవారికి క్లాస్‌లు చెప్పడం ప్రారంభించాడు. చోటు శర్మ క్లాస్ చెప్పే విధానం నచ్చడంతో.. అనతి కాలంలోనే అతడు పని చేసే సంస్థలో శిక్షణకు వచ్చే వారి సంఖ్య పెరిగింది. దాంతో తానే సొంతంగా ఒక ప్లాట్ అద్దెకు తీసుకుని.. కంప్యూటర్ సెంటర్ ప్రారంభించాడు చోటు శర్మ. కేవలం ఆరు నెలల్లోనే అతడి దగ్గర 80 మంది శిక్షణ తీసుకున్నారు. వీరిలో చాలా మంది.. 500 కోట్ల రూపాయలకు పైగా టర్నోవర్ ఉన్న కంపెనీల్లో ఉద్యోగాలు సాధించారు.
ఈ క్రమంలో 2007లో సీఎస్ ఇన్ఫోటెక్, సీఎస్ సాఫ్ట్ సొల్యూషన్స్ పేరుతో రెండు టెక్ కంపెనీలను ఏర్పాటు చేశాడు చోటు శర్మ. ప్రస్తుతం ఈ రెండు కంపెనీల టర్నోవర్ 10 కోట్ల రూపాయలకు పైగానే ఉంది. త్వరలోనే మొహాలీలో పెద్ద సంస్థను ఏర్పాటు చేసి.. 1800 మందికి పైగా ఉపాధి కల్పించాలని భావిస్తున్నాడు శర్మ. ఆ దిశగా ప్రయత్నాలు చేస్తున్నాడు. ప్రస్తుతం చోటు శర్మ ఏర్పాటు చేసిన కంప్యూటర్ కేంద్రాల్లో వెయ్యి మందికి పైగా శిక్షణ పొందుతుండగా.. 150 మందికి పైగా ఉపాధి పొందుతున్నారు. మొత్తం చోటు శర్మ దగ్గర 500 వందల మంది ఉపాధి పొందుతున్నారు. మరి ప్యూన్ నుంచి నేడు టెక్ కంపెనీ సీఈఓగా ఎదిగిన శర్మ ప్రస్థానంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.