వయస్సులో ఉన్నప్పుడు డబ్బు విలువ తెలియదు. వృద్ధాప్యం వచ్చాక దాని అవసరం తెలుస్తుంది. ఎందుకంటే.. ఆ వయస్సు వచ్చాక.. సంపాదన తగ్గుతుంది. ఆర్థిక అవసరాలు పెరుగుతాయి. అందువల్ల.. వృద్ధాప్యంలో ఎలాంటి అవాంతరాలు లేకుండా జీవితం సాఫీగా సాగాలంటే మంచి ప్లానింగ్ అవసరం. ఇప్పుడే మంచి రాబడి ఇచ్చే పొదుపు పథకాన్ని ఎందుకొని అందులో పెట్టుబడి పెట్టడం మంచిది. లేదంటే కేంద్ర ప్రభుత్వం అమలుచేస్తోన్న పెన్షన్ పథకాలను ఎంచుకొని అందులో పొదుపు చేయవచ్చు. ఇప్పుడు చెప్పబోయేది అలాంటి పథకం గురుంచే.
కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న అనేక పథకాల్లో ‘ప్రధాన మంత్రి శ్రమ యోగి మాన్ ధన్ యోజన‘ ఒకటి. అసంఘటిత రంగాల్లోని కార్మికులకు సామాజిక ఆర్థిక భద్రత కల్పించాలనే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం 2019లో ఈ పథకాన్ని తీసుకువచ్చింది. ప్రధానంగా అల్పాదాయ వర్గాల వారికి, తక్కువ వేతనాలు పొందే వారికి, మహిళలు, స్వయం ఉపాధి పొందే వారికి ఈ పథకం ఎక్కువ ప్రయోజనకరమని చెప్పుకోవచ్చు. ఈ పథకం కింద లబ్ధిదారునికి రూ. 60 ఏళ్లు నిండిన తర్వాత ప్రతి నెలా 3000 రూపాయలు పెన్షన్ రూపంలో అందిస్తారు. ఈ లెక్కన ఏడాదికి రూ. 36 వేలు పెన్షన్ పొందవచ్చు. అలాగే, లబ్ధిదారుని మరణానంతరం పెన్షన్‌లో 50% లబ్ధిదారుని జీవిత భాగస్వామికి కుటుంబ పెన్షన్‌గా ఇవ్వబడుతుంది. ఈ పథకంలో ఎలా చేరాలి? ఏయే రంగాల వారు అర్హులు? అన్నది ఇప్పుడు చూద్దాం..
ఈ పథకంలో చేరాలని భావించే వారు ఒక విషయం తప్పక తెలుసుకోవాలి. వయసు ప్రాతిపదికన ప్రతి నెలా కొంతమొత్తంలో డబ్బులు కడుతూ వెళ్లాలి. ఈ మొత్తం నెలకు రూ.55 నుంచి రూ.200 వరకు ఉంటుంది. మీరు ఏ వయసులో ఈ పథకంలో చేరారనే అంశం ప్రాదిపదికన మీరు చెల్లించాల్సిన మొత్తం ఆధారపడి ఉంటుంది. ఉదాహరణకు 20 ఏళ్ల వ్యక్తి పాలసీ తీసుకుంటే రోజుకు రూ. 3 చెల్లించాల్సి ఉంటుంది. అదే.. 18 ఏళ్ల వయసులో చేరితే నెలకు రూ.55, 40 ఏళ్లలో చేరితే నెలకు రూ.200 చెల్లించాలి. ఇలా కడుతూపోయాక 60 ఏళ్లు నిండాక ప్రతి నెల పెన్షన్ అందిస్తారు. దీని వల్ల లబ్ధిదారులకు వయసు మళ్లాక ఆర్థిక భద్రత ఉంటుందని చెప్పవచ్చు. డబ్బులు నేరుగా లబ్ధిదారుల బ్యాంక్ ఖాతాల్లో జమవుతాయి.
18 నుంచి 40 ఏళ్ల మధ్య వయసుండి.. నెలకు రూ.15 వేల లోపు ఆదాయం పొందుతున్న అసంఘటిత రంగాల కార్మికులు ఈ పథకానికి అర్హులు. అంటే.. వీధి వర్తకులు, వ్యవసాయ కార్మికులు, రిక్షా డ్రైవర్లు, నిర్మాణ కార్మికులు, మధ్యాహ్న భోజన కార్మికులు, ఇటుక బట్టీ కార్మికులు, చెప్పులు కుట్టేవారు, రాగ్ పికర్స్, బీడీ కార్మికులు, చేనేత కార్మికులు, తోలు కార్మికులు.. మొదలైన అసంఘటిత రంగ కార్మికులు.
ఈ పథకంలో చేరాలనుకునే వారు అధికారిక మాన్ ధన్ వెబ్‌సైట్‌లోకి వెళ్లి ఆన్ లైన్ లో రిజిస్టర్ చేసుకోవచ్చు. లేదా దగ్గరిలోని కామన్ సర్వీస్ సెంటర్‌కు వెళ్లి, అవసరమైన డాక్యుమెంట్లు అందించి పథకంలో చేరొచ్చు. ఆధార్ నెంబర్, బ్యాంకు ఖాతా, రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్ తప్పనిసరిగా కలిగి ఉండాలి.
Assurance of old age protection and #SocialSecurity for unorganised workers through Pradhan Mantri Shram-yogi Maan-dhan (PMSYM) Pension Yojana. To register, visit https://t.co/qzBx0cdoLC or go to your nearest Common Service Centre.#PMSYM pic.twitter.com/4RLB8KcvlD
— Ministry of Labour (@LabourMinistry) December 14, 2021