యూపీఐ పేమెంట్స్ విషయంలో ఇకపై ఛార్జీల మోత మోగనుంది. ఈ సమయంలో పేటీఎం తమ యూజర్లకు గుడ్ న్యూస్ చెప్పింది. తమ కస్టమర్ల కోసం ఒక కొత్త సదుపాయాన్ని తీసుకొచ్చింది. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు మీ కోసం..
ఇంటర్నెట్ విప్లవం తర్వాత మొబైల్స్ వినియోగం బాగా పెరిగింది. ఫోన్ వల్ల ప్రతిదీ అరచేతిలోకి వచ్చేసింది. కూర్చున్న చోట నుంచి ప్రతిదీ ఆర్డర్ చేయొచ్చు. క్యాబ్ కావాలన్నా యాప్ నుంచి బుక్ చేసుకోవచ్చు. ఆహారం కావాలన్నా బుక్ చేసేయడమే. నగదు రహిత చెల్లింపుల విషయంలోనూ అనూహ్య మార్పులు వచ్చేశాయి. యూపీఐ యాప్‌ల ప్రవేశంతో బయట ఏది కొనాలన్నా అంతా ఫోన్ నుంచే అయిపోతోంది. స్కాన్ చేసి డబ్బులు చెల్లించడం అందరికీ అలవాటైపోయింది. కేంద్ర సర్కారు కూడా చాన్నాళ్లుగా నగదు రహిత చెల్లింపులను ప్రోత్సహిస్తూ వస్తోంది. దీంతో సామాన్యల నుంచి డబ్బున్న వారి దాకా బయట ఏది కొనాలన్నా యూపీఐ యాప్స్ ద్వారా నగదు రహిత చెల్లింపులు చేస్తున్నారు.
గమనించాల్సిన విషయం ఏంటంటే.. ఇప్పటిదాకా యూపీఐ లావాదేవీల మీద ఎలాంటి ఛార్జీలు లేవు. ఇలాంటి సమయంలో యూపీఐ సంస్థలు బాంబు పేల్చాయి. ఇకపై ఛార్జీల మోత మోగిస్తామని స్పష్టం చేశాయి. ఏప్రిల్ 1 నుంచి యూపీఐ యాప్స్ ద్వారా చేసే ప్రీపెయిడ్ పేమెంట్ ఇన్స్ట్రుమెంట్ ట్రాన్సాక్షన్లు రూ.2 వేలు దాటితే 1.1 శాతం ఛార్జీలు పడనున్నాయి. ఈ నేపథ్యంలో పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ తమ యూజర్లకు గుడ్ న్యూస్ చెప్పింది. తన వ్యాలెట్ కస్టమర్ల కోసం పేటీఎం ఒక మంచి సదుపాయాన్ని తీసుకొచ్చింది. వ్యాలెట్ నుంచి క్యూఆర్ కోడ్ సాయంతో ఏ మర్చంట్‌కైనా చెల్లింపులు చేసుకోవచ్చని వెల్లడించింది.
ఏ మర్చంట్‌కైనా చెల్లింపులు చేసుకోవచ్చంటూ కస్టమర్లకు స్పష్టం చేసిన పేటీఎం.. మరో గుడ్ న్యూస్ కూడా చెప్పింది. ఆన్లైన్లో యూపీఐ ట్రాన్సాక్షన్స్ చెల్లింపులను అనుమతించే ప్రతి చోట పేటీఎం వ్యాలెట్ నుంచి చెల్లింపులు చేసుకోవచ్చని పేర్కొంది. అయితే కేవైసీ పూర్తి చేసిన వ్యాలెట్ యూజర్లకు మాత్రమే ఈ సదుపాయం ఉంటుందని స్పష్టం చేసింది. పేటీఎం పేమెంట్స్ బ్యాంక్‌కు మొత్తంగా 10 కోట్ల వ్యాలెట్ కస్టమర్స్ ఉన్నారు. వివిధ కంపెనీల వ్యాలెట్ల మధ్య ఇంటర్ ఆపరేటబులిటీకి ఎన్పీసీఐ ఛాన్స్ కల్పించడంతో పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ ఈ సదుపాయాన్ని తీసుకొచ్చినట్లు తెలుస్తోంది. తమ కస్టమర్ల కోసం పేటీఎం తీసుకొచ్చిన ఈ కొత్త సదుపాయంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.