అద్దె కట్టే డబ్బులకు సొంతిల్లు ఎలా వస్తుంది? అని అనుకుంటున్నారా? మీరు కరెక్ట్ గా ప్లాన్ చేస్తే మీ సొంతింటి కల నెరవేరుతుంది. ఆ కల నెరవేరాలంటే మీరు కొన్ని టిప్స్ ఫాలో అవ్వాలి.
అద్దె ఇంట్లో ఎన్నాళ్లని ఉంటాం చెప్పండి. మనకంటూ ఒక సొంత ఇల్లు ఉంటే ఎంత బాగుంటుంది కదా. ఇలానే అనిపిస్తుంది చాలా మందికి. కానీ సొంతింటి కల అనేది కలగానే మిగిలిపోతుంది. నగరంలో స్థలం కొనాలంటే కళ్ళు బయ్యర్లు గమ్ముతున్నాయి. ఏడాది అయితే ఇంటి అద్దెలే పెరిగిపోతున్నాయి. సిటీలో చాలా ఏరియాల్లో 1 బీహెచ్కే ఇల్లు కావాలంటే కనీసం 8 నుంచి 10 వేలు పెట్టాల్సి ఉంటుంది. 10 వేలు పెడితే కాస్త నీట్ గా ఉండే ఇల్లు వస్తుంది. జీతం ఎక్కువగా వచ్చే వాళ్ళు 12 నుంచి 15 వేల అద్దె ఇంట్లో ఉంటారు. అయితే ఈ అద్దె కట్టే బదులు సొంత ఇంట్లో ఉండవచ్చు కదా అని మీకు ఎప్పుడైనా అనిపించిందా? మరి ఎందుకు మీరు మీ సొంతింటి కలను నిజం చేసుకోకూడదు.
సొంతిల్లు అంటే ఫ్లాట్ కొనుక్కోవచ్చు, లేదా ఒక స్థలం కొనుక్కుని అందులో ఇల్లు కట్టుకోవచ్చు. లేదా ఇండివిడ్యువల్ ఇల్లు కొనుక్కోవచ్చు. ఫ్లాట్ లు, ఇళ్ళు కొనుక్కోవాలనుకుంటే కొత్తవి అయినా కొనుక్కోవచ్చు, పాతవి అయినా కొనుక్కోవచ్చు. పాతవి కొనుక్కుంటే మీకు పెట్టుబడి తక్కువ అవుతుంది. కొత్తవి కావాలంటే కనుక కొంచెం ఎక్కువ పెట్టుబడి పెట్టాల్సి ఉంటుంది. నిర్మాణంలో ఉన్న ఇల్లు లేదా ఫ్లాట్ కూడా కొనుక్కోవచ్చు. అయితే నిర్మాణంలో ఉండగా దీని కోసం పెట్టుబడి పెడితే వడ్డీ లాస్ అవుతుంది. 1 బీహెచ్కే ఫ్లాట్ లేదా రీమోడలింగ్ చేసిన ఫ్లాట్ 25 లక్షల నుంచి 30 లక్షలకు దొరుకుతున్నాయి. సికింద్రాబాద్, హైదరాబాద్ లోని కొన్ని ప్రాంతాల్లో ఈ 30 లక్షలోపు ఉంటున్నాయి.
మీరు కావాలంటే ఆన్ లైన్ లో ఒకసారి చెక్ చేసుకోవచ్చు. వెబ్ సైట్స్ లో ఓనర్లు పోస్ట్ చేసిన ఇల్లు, ఫ్లాట్లు చూసుకోవచ్చు. మణికొండ, టోలి చౌకి, చందానగర్ వంటి ప్రాంతాల్లో 20 లక్షల లోపే ఇవి దొరుకుతున్నాయి. వీటిలో పాతవి కూడా ఉండచ్చు. రీమోడలింగ్ వి కూడా ఉండవచ్చు. అవి ఒకసారి చూసుకోవాల్సి ఉంటుంది.ఉదాహరణకు ఒక ఫ్లాట్ ఖరీదు 25 లక్షలు అనుకుందాం. మీ దగ్గర సొంతంగా కొంత డబ్బు ఉంటే మిగతాది లోన్ పెట్టుకోవచ్చు. లేకపోయినా గానీ 25 లక్షలకు లోన్ పెట్టుకోవచ్చు. లోన్ కోసం మీరు పెద్దగా చింతించాల్సిన పని లేదు. ప్రాపర్టీని బేస్ చేసుకుని బ్యాంకులే లోన్లు ఇస్తాయి.
మీకు నెలకు ఒక 20 వేల జీతం వస్తుందనుకుందాం. అందులో రూమ్ ఇంటి అద్దె 10 వేలు కడుతున్నారనుకుంటే.. మిగతా డబ్బులు మెయింటెనెన్స్ కి, ఇతర ఖర్చులకు వాడుతున్నారనుకుందాం. చదువుకునే వయసున్న పిల్లలు ఉంటే గనుక కాస్త ఇబ్బంది అవుతుంది. కానీ మీరు తలచుకుంటే సాధించగలరు. ఇంటి అద్దె కట్టే పది వేల రూపాయలతో బ్యాంకు ఈఎంఐ కడితే ఇల్లు మీ సొంతమవుతుంది కదా. ఎస్బీఐ బ్యాంకులో లోన్ అప్లై చేస్తే మీకు నూటికి 70 పైసలు వడ్డీ పడుతుంది. అంటే లక్షకు రూ. 700 వడ్డీ అవుతుంది. 20 ఏళ్లకు లోన్ పీరియడ్ పెట్టుకుంటే కనుక వడ్డీ అనేది 6.4 శాతం పడుతుంది. అప్పుడు మీకు నెలకు ఈఎంఐ రూ. 12,944 అవుతుంది. అంటే మీరు 20 ఏళ్లలో 31 లక్షల 6 వేల 560 రూపాయలు బ్యాంకుకి చెల్లిస్తున్నట్టు. ఇలా చేయడం వల్ల అసలు, వడ్డీ రెండూ తీరిపోతున్నాయి.
మీరు ఇల్లు లేదా ఫ్లాట్ కి పెట్టిన పెట్టుబడి 25 లక్షలు అనుకుంటే అదనంగా 20 ఏళ్లకు 6 లక్షల 6 వేల 560 రూపాయలు వడ్డీ పడుతుంది. అంటే ఏడాదికి 30 వేలు, నెలకు 2527 రూపాయలు. మీరు కట్టే వడ్డీ కేవలం నెలకు 2527 రూపాయలు ఐతే.. పైన 10 వేలు ఇంటిని సొంతం చేసుకునేందుకు అసలు కడుతున్నట్టు. అదే మీరు 10 వేల చొప్పున ఇంటి అద్దె కడుతూ ఉంటే కనుక 20 ఏళ్లకు రూ. 24 లక్షలు అవుతుంది. అద్దె ఏమైనా అలానే ఉంటుందా? అంటే ఉండదు. ఏటా రూ. 500 నుంచి రూ. 1000 పెరుగుతుంది. ఈ లెక్కన ఇంకో లక్ష 50 వేలు అదనంగా మీ మీద భారం పడుతుంది. అంటే అద్దె ఇంట్లో ఉంటూ మీరు 20 ఏళ్ళు చెల్లించేది రూ. 25 లక్షలు పైనే.
దీన్ని బట్టి మీకు ఏమర్థమైంది. అద్దె ఇంటి కంటే సొంత ఇల్లే ఉత్తమం అని అనిపిస్తుంది కదూ. 25 ఏళ్ల వయసులో ఇల్లు కొని 20 ఏళ్ళు కష్టపడి ఇల్లు లోన్ తీర్చుకుంటే 45 ఏళ్ళకి మీరు రిలీఫ్ అవుతారు. సొంతిల్లు కావాలనుకుంటే ఎస్బీఐ, హెచ్డీఎఫ్సీ వంటి బ్యాంకులు అతి తక్కువ వడ్డీతో లోన్లు ఇస్తున్నాయి. మీకు ఎస్బీఐ బ్యాంకులో లోన్ కావాలంటే కనీసం 18 నుంచి 70 ఏళ్ళు వయసు ఉండాలి. ఇద్దరు అప్లై చేస్తే గనుక ఒకరికి రూ. 15 వేలు, మరొకరికి రూ. 10 వేలు ఆదాయం ఉండాలి. లేదా ఒకరికి రూ. 25 వేలు ఉన్నా చాలు. లోన్ కాల పరిమితి 5 నుంచి 30 ఏళ్ళు పెట్టుకోవచ్చు. 5 ఏళ్ళు అంటే మీరు నెలకు బ్యాంకు లోన్ కనీసం రూ. 10 లక్షలు ఇస్తుంది. హెచ్డీఎఫ్సీ బ్యాంకు కూడా ఇంతే. మీకు కనుక ఏ ఏ బ్యాంకులు ఎంత హోమ్ లోన్లు ఇస్తున్నాయి, ఎంత వడ్డీ తీసుకుంటాయి వంటి వివరాలు కావాలంటే కనుక కామెంట్లో అడగండి. మరి అద్దె ఇంటికి డబ్బులు కట్టేకంటే సొంత ఇంటికి ఈఎంఐ కట్టుకోవడం ఉత్తమం కదా. దీనిపై మీరేమంటారో కామెంట్ చేయండి.