మార్కెట్లో సామాన్యులు కూరగాయలు కొనే పరిస్థితి లేనే లేదు. కూరగాయల ధరలు మండిపోతున్నాయి. టమాటా ధరలు కొండెక్కిన విషయం తెలిసిందే. అదే బాటలో ఉల్లి కూడా ఘాటెక్కనుంది.
ప్రస్తుతం సామాన్యులు కూరగాయలు కొనలేని పరిస్థితి ఏర్పడింది. నిత్యం వండుకునే కూరగాయలకు చాలా డిమాండ్ ఏర్పడడంతో రేట్లు మండిపోతున్నాయి. భారీ వర్షాలతో పంట నష్టం, మర్కెట్లకు సరఫరాలో ఇబ్బందులు ఎదుర్కొనవలసి వస్తుంది. దీంతో ధరలు విపరీతంగా పెరుగుతున్నాయి. మార్కెట్‌కు వెళితే అన్ని కూరగాయలలో ముందు గుర్తుకు వచ్చేవి టమాట, మిర్చి, ఉల్లి. ఈ మూడు లేనిదే ఏ కూరలు వండలేం. ఉల్లి చేసిన మేలు తల్లికూడా చేయలేదు అన్న సామెత ఉంది. అందకే ఉల్లి లేని వంటిల్లు ఉండదు. కూరగాయల్లో ఎక్కువగా వాడేవి ఇవే. ప్రస్తుతం టమాటా ధర కిలో రూ.200 పైనే కొనసాగుతోంది. టమాటా బాటలోనే ఉల్లిపాయల రేటు కూడా పరుగెత్తనుంది.
2020 సంవత్సరం ఉల్లి రేటు భారీగా పెరిగి హాట్ టాపిక్ గా మారింది. ఈ ఏడాది అలాగే టమాటా ధరలు పరుగెడుతున్నాయి. వర్షాలు విపరీతంగా కురవడంతో ఉల్లి సరఫరాలో అంతరాయం, కొరత ఏర్పడుతుంది. దీంతో ధరలు విపరీతంగా పెరుగుతాయి. ఉల్లి ధరలు ఈ నెల చివర వరకు పెరుగుతూ.. సెప్టెంబర్ వరకు కిలో రూ.60-70 వరకు పెరుగవచ్చని ‘క్రిసిల్ మార్కెట్ ఇంటలిజెన్స్ అండ్ అనలిటిక్స్’ పేర్కొంది. 2020 సంవత్సరంలో ఉన్న గరిష్ట ధరల కంటె దిగువ రేటు కొనసాగవచ్చని తెలిపింది. రబీ ఉల్లి నిల్వ కాలం 1నుండి 2 నెలలు తగ్గాయి. ఈ నిల్వలు ఆగస్టు చివరికే తగ్గుముఖం పట్టనున్నాయి.
అందువల్ల సెప్టెంబర్ వరకల్లా సరఫరాలు తగ్గుముఖం పట్టి ఉల్లి ధరలు పెరిగే చాన్స్ ఉందని తెలిపింది. ఆగస్టు నెల చివర నుండి సెప్టెంబర్ నెల చివర వరకు ఉల్లి ధరలు పెరిగుతాయి. తిరిగి అక్టోబర్ నుండి తగ్గుముఖం పడతాయి. అక్టోబర్ నెల నుంచి ఖరీఫ్ పంట చేతికొస్తే, ఉల్లి ధరలు మళ్లీ తగ్గుతాయని నివేదికలో పేర్కొంది. అక్టోబర్ నుండి డిసెంబర్ వరకు పండగల సీజన్‌లో ఉల్లి ధరలు స్థిరంగా ఉంటాయని అంచనా వేస్తోంది. తృణ ధాన్యాలు, పప్పు ధాన్యాలు, వేరే ఇతర కూరగాయల ధరలతో బెంబేలెత్తుతున్న జనాలు ఈ సంవత్సరం జనవరి నుండి మే నెల వరకు ఉల్లిధరలు తగ్గడంతో కొంత ఊపిరి పీల్చుకున్నారు.
ఖరీఫ్ సీజన్‌లో ధర లేనందున తక్కువగా ఉల్లిపంట సాగుచేశారు. దీంతో ఈ సంవత్సరం 8 శాతం మేరకు పంట తగ్గింది. ఖరీఫ్ ఉల్లి ఉత్పత్తి 5% తగ్గింది. సంవత్సరం మొత్తంగా ఉత్పత్తి 29 మిలియన్ టన్నులు ఉండొచ్చని అంచనా. గత ఐదేళ్ల కంటే సగటు 7 శాతం అధికమని నివేదిక పేర్కొంది. ఖరీఫ్,రబీ సీజన్లలో ఉల్లి పంట దిగుబడి తక్కువగా ఉన్నప్పటికీ సరఫరా అంత కొరతగా ఉండదు. టమాటా మాదిరి ధరలు ఉల్లికి ఈ ఏడాది ఉండదని తెలిపింది. ఆగస్టు, సెప్టెంబర్ నెలల్లో కురుస్తున్న వర్షపాతాన్ని బట్ట ఉల్లి పంట దిగుబడి ఆధారపడి ఉంటుందని పేర్కొంది.