ఒకప్పుడు ఎక్కడో దూరంగా ఉన్న వ్యక్తులకు డబ్బులు ఇవ్వాలంటే షర్ట్ ఏసుకోవాలి, ప్యాంట్ ఏసుకోవాలి, స్కూటర్ స్టార్ట్ చేయాలి, బ్యాంకుకెళ్ళాలి, డిపాజిట్ ఫార్మ్ రాయాలి, డబ్బులు కట్టాలి, అవి వాళ్ళ అకౌంట్ లో పడాలి. మళ్ళీ వాళ్ళు షర్టు, ప్యాంటు, స్కూటరు, బ్యాంకు, విత్ డ్రా పెద్ద ప్రాసెస్ ఉండేది. ఆ తర్వాత డెబిట్ కార్డులొచ్చాక రాసుడు ప్రక్రియ పోయి ఏటీఎం నుంచి తీసుడు, ఆన్ లైన్ లో గీకుడు ప్రక్రియ మొదలైంది. ఎప్పుడైతే పెద్ద నోట్ల రద్దు జరిగిందో అప్పటి నుంచి అందరూ డిజిటల్ లావాదేవీల వైపు మొగ్గు చూపారు. మగ్గులో జీవితం.. లుంగీ కట్టుకుని బ్యాంకుకెళ్లే పని లేకుండా.. ఇంట్లోనో, బాత్రూమ్ లోనో, ఆఫీసులోనే ఎక్కడుంటే అక్కడ నుంచి నిమిషాల్లో అవతల వ్యక్తికి డబ్బులు పంపించుకునే సౌకర్యం వచ్చేసింది.
పేటీఎం, ఫోన్ పే , గూగుల్ పే వంటి ఆన్ లైన్ డిజిటల్ యూపీఐ యాప్ లు ప్రస్తుతం డిజిటల్ బ్యాంకింగ్ ని శాసిస్తున్నాయి. ఈ యాప్ లను జనాల్లోకి తీసుకెళ్లేందుకు మొదట్లో ఉచితంగా పేమెంట్లు చేసుకునే వీలు కల్పించారు. ఏ సంస్థ అయినా మొదట ఉచితంగానే అలవాటు చేస్తుంది. ఆ తర్వాత తాము అనుకున్న ఫిగర్ ని ఛార్జ్ చేస్తుంది. ఇది యాపారం. వాళ్ళు మాత్రం బతకొద్దా? మొదట్లో మొబైల్ రీఛార్జ్ లు, కరెంటు బిల్లులు, ఆ బిల్లులు, ఈ బిల్లులు కట్టడానికి ఉచితంగా వెసులుబాటు కల్పించిన యూపీఐ యాప్ లు.. ఇప్పుడు మెల్లగా ఛార్జ్ చేయడం ప్రారంభించాయి. ఇప్పటికే ఫోన్ పే మొబైల్ రీఛార్జ్ ల మీద అదనంగా ఛార్జ్ చేస్తుంది. మిగతా యూపీఐ యాప్ లు కూడా ఇదే ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తోంది.
సరే ఇది వారి వ్యాపారం కాబట్టి ఎవరూ ఏమీ అనలేరు. ఇదే రీఛార్జ్ ఇంట్లోంచి బయటకు వెళ్లి షాప్ లో చేయించుకోవడం కంటే ఇంట్లోనే ఇట్టే క్షణాల్లో అయిపోతుంది. ఇంతకంటే ఇంకేం కావాలి. సరే ఈ విషయం పక్కన పెడితే.. యూపీఐ యాప్ లను వినియోగించే కస్టమర్లకు ఊరట లభించింది. ఫోన్ పే, గూగుల్ పే, పేటీఎం వంటి థర్డ్ పార్టీ యాప్ ల ద్వారా.. వ్యక్తుల నుంచి వ్యక్తులకి, వ్యక్తుల నుంచి వ్యాపారులకు మధ్య లావాదేవీలు జరుగుతున్నాయి కదా. అయితే గతంలో నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా.. థర్డ్ పార్టీ యూపీఐ యాప్ ల ద్వారా జరిగే లావాదేవీలు 30 శాతానికి మించకూడదని నిబంధనను తీసుకొస్తున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే.
ఈ మేరకు యూపీఐ సంస్థల లావాదేవీలు 30 శాతానికి మించి ఉండకూడదని 2020 నవంబర్ నెలలో ఎన్పీసీఐ నిర్ణయం తీసుకుంది. దాని కోసం రెండేళ్లు గడువు పెట్టింది. అంటే డిసెంబర్ 31తో గడువు ముగుస్తుంది. నిజానికి 2023 జనవరి 1 నుంచి ఈ నిబంధన అమలు కావాల్సి ఉంది. అయితే ఇప్పుడు గడువు ముగిసే సమయం సమీపిస్తున్న తరుణంలో.. ఆ గడువును పెంచుతూ ఎన్పీసీఐ నిర్ణయం తీసుకుంది. యూపీఐలోని TPAP వాల్యూమ్ క్యాప్ ను 30 శాతం పరిమితిని 2024 డిసెంబర్ 31 వరకూ మరో రెండేళ్ల పాటు పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది. దీంతో ఫోన్ పే, గూగుల్ పే, పేటీఎం, ఫ్రీఛార్జ్ వినియోగదారులకి భారీ ఊరట లభించినట్టయ్యింది. ఒక్కో యూపీఐ యాప్ కి 30 శాతానికి మించి లావాదేవీలు జరగకూడదని నిబంధన అమలైతే.. కస్టమర్లకు రోజూ ఎక్కువ లావాదేవీలు జరిపే అవకాశం ఉండేది కాదు. ఇప్పుడు ఎన్పీసీఐ గడువు రెండేళ్లకు పొడిగించడంతో వినియోగదారులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.