జీవితం చాలా షార్ట్ అయిపోయింది. ఒకప్పుడు యూట్యూబ్ లో షార్ట్ ఫిల్మ్స్ హవా నడిచేది. 30 నిమిషాల షార్ట్ ఫిల్మ్స్ చూసే స్టేజ్ నుంచి 10 నిమిషాల నిడివి ఉంటేనే చూసే స్టేజ్ కి వచ్చేసారు. ఆ తర్వాత అంత ల్యాగ్ అయితే కష్టం గానీ ఒక్క నిమిషం అయితే కేటాయిస్తాం అనే పరిస్థితికి వచ్చేసారు జనం. నిజానికి అలా అలవాటు చేశారు. కానీ ఏ మాటకామాట చెప్పుకోవాలి. యూట్యూబ్ షార్ట్స్ వల్ల చాలా మంది తమ కుటుంబ సభ్యులతో కలిసి వీడియోలు చేస్తున్నారు. ఆ రకంగా అయినా వాళ్ళు ఒకరితో ఒకరు ఎక్కువ సమయం గడుపుతున్నారనే చెప్పాలి. వాళ్ళ సంగతేమో గానీ.. షార్ట్ వీడియోలు చూసేవారికి మాత్రం ఫోన్ పట్టుకుంటే చాలు.. గంటలు గంటలు అలా చూస్తూనే ఉంటారు. ఒక్కో వీడియోకి ఎక్కువ సమయం కేటాయించే పని లేదు.
పనికొచ్చే వీడియోలు, పనికిరాని వీడియోలు అన్నీ ఒక్కొక్కటి ఒక్క నిమిషంలో చూసుకుంటూ పోతున్నారు. దీని వల్ల చూసే జనాలకు సమయం వృధా అవుతుందన్న ఫీలింగ్ కలగదు. పైగా షార్ట్ వీడియోలు చేసే వారికి కూడా ఎక్కువ వ్యూస్ వస్తున్నాయన్న సంతృప్తి కలుగుతుంది.ఫేమస్ కూడా అవ్వచ్చు. ఫేమస్ ఎవరికి కావాలి గురూ.. పెట్టే షార్ట్స్ కి డబ్బులు రావాలి గానీ అని అనుకుంటున్నారా? షార్ట్స్ కి కూడా యాడ్స్ ద్వారా రెవెన్యూ వస్తే బాగుణ్ణు.. వచ్చినప్పుడే షార్ట్ వీడియోలు చేయడం మొదలుపెట్టాలన్న ఆలోచనలో ఉన్నారా? అయితే మీరు ఫేమస్ అవ్వడానికి.. యాడ్స్ ద్వారా డబ్బు సంపాదించడానికి ఎంతో దూరంలో లేరు. మీకు తెలుసా.. ఇప్పుడు యూట్యూబ్ షార్ట్స్ ద్వారా కూడా మీరు డబ్బులు సంపాదించుకోవచ్చు.
యూట్యూబ్ షార్ట్స్ ద్వారా డబ్బులు సంపాదించాలి అనుకునేవారికి యూట్యూబ్ శుభవార్త చెప్పింది. ఇప్పటి వరకూ షార్ట్స్ చేస్తూ.. ఆ వీడియో కంటెంట్ ద్వారా లక్షల్లో సబ్స్క్రైబర్స్ ని సంపాదించిన క్రియేటర్స్.. ఇక నుంచి యూట్యూబ్ ద్వారా డైరెక్ట్ రెవెన్యూ సంపాదించుకోవచ్చు. కొత్తగా షార్ట్స్ చేయాలని ఆలోచించే వారు కూడా షార్ట్స్ చేసి భారీగా సంపాదించుకోవచ్చు. యూట్యూబ్ షార్ట్స్ ఛానల్ ని మానిటైజేషన్ చేసే ముందు యూట్యూబ్ పాలసీలకు అనుగుణంగా ఛానల్ ఉండాలి. కమ్యూనిటీ గైడ్ లైన్స్, టర్మ్స్ ఆఫ్ సర్వీస్, గూగుల్ యాడ్ సెన్స్ ప్రోగ్రాం పాలసీలకు అనుగుణంగా ఉండాలి. అలానే కాపీ రైట్ లేని ఒరిజినల్ కంటెంట్ అయి ఉండాలి. మానిటైజేషన్ ఎనేబుల్ అవ్వాలంటే మానిటైజింగ్ పార్టనర్స్ షార్ట్స్ మానిటైజేషన్ మాడ్యూల్ ని అంగీకరించాల్సి ఉంటుంది.
ఇది షార్ట్స్ ఫీడ్ లో యాడ్స్ మరియు యూట్యూబ్ ప్రీమియం నుంచి డబ్బు సంపాదించడానికి ఉపయోగపడుతుంది. ఫిబ్రవరి 1 నుంచి యూట్యూబ్ షార్ట్స్ మానిటైజేషన్ అందుబాటులో ఉంటుంది. ఫిబ్రవరి 1 తర్వాత ఏ రోజైతే ఈ మానిటైజేషన్ మాడ్యూల్ ని అంగీకరిస్తే.. ఆరోజు నుంచి మాత్రమే అప్ లోడ్ చేసిన షార్ట్స్ కి వచ్చిన వ్యూస్ ను బట్టి యాడ్ రెవెన్యూ అనేది వస్తుంది. మానిటైజేషన్ మాడ్యూల్ కి అప్లై చేయక ముందు ఉన్న వీడియోస్ కి ఎన్ని వ్యూస్ వచ్చినా గానీ షార్ట్స్ యాడ్ రెవెన్యూ అనేది రాదు. అయితే షార్ట్స్ రెవెన్యూ వేరు, లాంగ్ వీడియోలకు వచ్చే రెవెన్యూ వేరు. దేనికదే ప్రత్యేకమని గమనించాలి. ఇప్పటి వరకూ పాపులర్ క్రియేటర్స్.. తమ షార్ట్స్ మీద ‘బయ్ సూపర్ థాంక్స్’ అనే ఆప్షన్ ద్వారా యూజర్లు ఇంట్రస్ట్ ఉండి డబ్బులు పే చేస్తే ఆదాయం పొందే వీలు ఉండేది. ఇక నుంచి యూట్యూబ్ ప్రకటనల ద్వారా కూడా మరింత ఆదాయం వస్తుంది.