మీ ఏటీఎం కార్డు పాడైపోయిందా? లేక ఎక్కడో పెట్టి మర్చిపోయారా? ఏటీఎంకి వస్తూ కార్డుని మర్చిపోయారా? అయితే టెన్షన్ పడకండి. ఏటీఎం కార్డు లేకున్నా కూడా ఏటీఎంలోంచి డబ్బులు విత్ డ్రా చేసుకోవచ్చు. అదెలాగో చూసేయండి.
ఇప్పుడు అంతా ఫోన్ పే, గూగుల్ పే, పేటీఎం వంటి ఆన్ లైన్ పేమెంట్ యాప్స్ వచ్చేశాయి. దీంతో దాదాపు చాలా వరకూ లావాదేవీలు ఆన్ లైన్ లోనే జరిగిపోతున్నాయి. ఏటీఎంలకు వెళ్లేవారు తక్కువయ్యారు. అయినప్పటికీ ఆ తక్కువ మందే ఎక్కువగా ఏటీఎంలలో డబ్బులు తీసుకుంటూ ఉంటారు. అయితే ఏటీఎంలో డబ్బులు తీసుకోవాలంటే ఖచ్చితంగా సంబంధిత బ్యాంకు ఏటీఎం కార్డు ఉండాల్సిందే. అది ఏటీఎంలో పెట్టి ఆప్షన్లు నొక్కితేనే గానీ డబ్బులు రావు. ఒక్కోసారి ఏటీఎంని మర్చిపోతుంటారు కొంతమంది. ఏటీఎం కార్డు పాడైపోవడం కూడా జరుగుతుంటుంది. ఆ సమయంలో అత్యవసరంగా డబ్బులు తీయాల్సి ఉంటే చాలా ఇబ్బందులు పడాల్సి వస్తుంది. కొత్త కార్డుకి అప్లై చేస్తే వెంటనే రాదు.
మరి ఇటువంటి సమస్యలకు పరిష్కారాన్ని తీసుకొచ్చింది ఎస్బీఐ బ్యాంక్. భారతీయ స్టేట్ బ్యాంక్ ఖాతాదారులకు శుభవార్త చెప్పింది. ఖాతాదారుల పనులను మరింత సులభతరం చేసేందుకు యోనో యాప్ లో సరికొత్త ఫీచర్ ని అందుబాటులోకి తీసుకొచ్చింది. ఏటీఎం కార్డు లేకపోయినా యోనో యాప్ ద్వారా క్యూఆర్ కోడ్ ని స్కాన్ చేసి ఏటీఎం నుంచి డబ్బులు తీసుకోవచ్చు. ఎస్బీఐ 68వ వార్షికోత్సవం సందర్భంగా ఈ సరికొత్త అప్ డేట్ ని తీసుకొచ్చింది. ఎస్బీఐ ఖాతాదారులే కాకుండా ఇతర బ్యాంకుల ఖాతాదారులు కూడా ఈ యాప్ ద్వారా ఏటీఎం కార్డు లేకుండా డబ్బులు విత్ డ్రా చేసుకోవచ్చునని ఎస్బీఐ తెలిపింది. ఎస్బీఐ ఇంటర్ ఆపరేబుల్ కార్డు లెస్ క్యాష్ విత్ డ్రాయల్ సర్వీస్ ద్వారా ఇతర బ్యాంకుల ఖాతాదారులు కూడా ఈ ప్రయోజనం పొందవచ్చు.
దీంతో పాటు లావాదేవీలు, షాపింగ్ లు, ఇతర చెల్లింపులు వంటి యూపీఐ కార్యకలాపాలు యోనో యాప్ లో చేసుకోవచ్చునని ఎస్బీఐ ప్రకటించింది. స్కాన్ అండ్ పే, పే బై కాంటాక్ట్స్, రిక్వెస్ట్ మనీ వంటి సర్వీసులు ఇందులో అందుబాటులో ఉంటాయి. అంటే ఏ షాప్ దగ్గరైనా స్కాన్ చేసి క్షణాల్లో డబ్బు ట్రాన్స్ ఫర్ చేయవచ్చు. అలానే ఎవరికైనా డబ్బు యూపీఐ ద్వారా పంపించవచ్చు. ఎవరినైనా ఈ యాప్ ద్వారా డబ్బు కావాలని రిక్వెస్ట్ కూడా చేసుకోవచ్చు. అయితే యూపీఐ పేమెంట్స్ కోసం ప్లాట్ ఫామ్ ఫీజు కింద సర్వీస్ ఛార్జీ ఎంత వసూలు చేస్తుందో అనే విషయంపై స్పష్టత రావాల్సి ఉంది. మరి ఎస్బీఐ తీసుకొచ్చిన కార్డు లెస్ మనీ విత్ డ్రా సర్వీస్ పై మీ అభిప్రాయమేమిటో కామెంట్ చేయండి.