‘అనిల్ అంబానీ..’ కొద్దికాలం కిందటి వరకు అందరకీ ఆయనే స్ఫూర్తి. కానీ, నేడు ఆయనలా అవ్వకూడదనే వారందరకీ ప్రత్యక్ష ఉదాహరణ. ఇతనే ఎవరో కాదు.. ఆసియా కుబేరుడు ముఖేష్ అంబానీ స్వయానా సోదరుడు. ముఖేష్ అంబానీ అంతకంతకూ ఆస్తులను పెంచుకుంటూ దూసుకెళ్తుంటే.. అనిల్ అంబానీ మాత్రం అప్పుల కోసం ఉన్న ఆస్తులను సైతం ఆస్తులను అమ్ముకుంటున్నారు. ఈయన దెబ్బకు ప్రభుత్వ రంగ సంస్థ ఎల్ఐసీ సైతం భారీ మెుత్తంలో సొమ్మును కోల్పోనుంది.
రిలయన్స్ క్యాపిటల్(RCAP), ఎల్ఐసీకి రూ.3,400 కోట్లు చెల్లించాల్సి ఉంది. అయితే ఆ డబ్బులను సకాలంలో చెల్లించలేకపోవడంతో ఎల్ఐసి.. రిలయన్స్ లోని తన రుణాన్ని విక్రయించేందుకు స్విస్ ఛాలెంజ్‌ని ఆశ్రయించింది. అయినప్పటికీ కొనుగోలు చేసేందుకు ఎవ్వరూ ముందుకు రాలేదని తెలుస్తోంది. ఒకవేళ రికవరీ జరిగినా కేవలం రూ.782 కోట్లు మాత్రమే అందనున్నట్లు తెలుస్తోంది. అంటే రుణ మొత్తంలో ఇది 27 శాతమే. మిగిలిన 73 శాతం ప్రజల సొమ్ము మునిగిపోవచ్చని తెలుస్తోంది.
స్విస్ ఛాలెంజ్ అనేది బిడ్డింగ్ పద్ధతి. ఇందులో ఒక పార్టీ ఆస్తి కోసం వేలం వేస్తుంది. వేలంలో వివరాలు బహిరంగపరచబడతాయి. ఇతర వ్యక్తుల నుంచి బిడ్లు కోరతారు. కానీ ‘ఆర్ క్యాప్’ విషయంలో మాత్రం ఎవరూ వేలం వేయలేదు. ప్రాసెస్ అడ్వైజర్ IDBI ట్రస్టీషిప్.. LIC రుణాన్ని విక్రయించడానికి ఎటువంటి బిడ్‌ను స్వీకరించలేదు. ఇందుకు సంబంధించిన బిడ్డింగ్ గడువు శుక్రవారంతో ముగిసింది. కాగా, అప్పుల ఊబిలో కూరుకుపోయిన రిలయన్స్ క్యాపిటల్ బోర్డును ఆర్బీఐ నవంబర్ 30, 2021లో రద్దు చేసిన సంగతి తెలిసిందే.