దేశంలో యూపీఐ లావాదేవీలు దూసుకెళ్తున్నాయి. టీ, కాఫీలకు చెల్లించే పదీ ఇరవై రూపాయల నుంచి వేల రూపాయల వరకు డిజిటల్ పేమెంట్స్ యాపులనే వాడుతున్నారు. అందులోను సులువుగా చెల్లించుకునే సౌలభ్యం ఉండటంతో ఈ యాప్స్ ప్రజలకు బాగా చేరువయ్యాయి. దీంతో యూపీఐ చెల్లింపుల విలువ కొత్త శిఖరాలను అధిరోహిస్తున్నాయి. ఈ క్రమంలో ఫిన్‌టెక్ ప్లాట్‌ఫామ్ ‘ఫోన్‌పే’ సరికొత్త ఫెసిలిటీ అందుబాటులోకి తెచ్చింది. ఈ ఫీచర్ ద్వారా ఆధార్‌తో ఈ ప్లాట్‌ఫామ్‌పై యూపీఐ సర్వీస్ పొందొచ్చు.
ఇంతకు ముందు యూపీఐ సెటప్ కోసం ఖాతాదారులు డెబిట్ కార్డు డిటైల్స్ తెలియజేయడం కంపల్సరీ. ఆ తరవాతే యూపీఐ పిన్ జనరేట్ చేసుకునే వెసులుబాటు ఉండేది. ఈ నిర్ణయం వల్ల డెబిట్ కార్డు లేని వారు యూపీఐ సేవలను పొందలేకపోయేవారు. దీంతో ఫోన్‌పే.. ఆధార్ బేస్డ్ యూపీఐ సర్వీసులు అందుబాటులోకి తెచ్చింది. దీనివల్ల డెబిట్ కార్డు లేని వారికి లబ్ధి చేకూరనున్నది. మీరు కొత్త యూజర్ అయితే, ఆధార్ నంబర్ ద్వారా ఫోన్‌పేపై మీ యూపీఐ సేవలు సెట్అప్ చేసుకోవచ్చు.
#PhonePe becomes the first UPI app to roll out Aadhaar-based UPI onboarding. This will enable crores of Indians to adopt UPI and become a part of the digital payment ecosystem!
Read more: https://t.co/7X2AfJEmyZ
— PhonePe (@PhonePe) November 11, 2022
ఏదేమైనా యూపీఐ సేవలు అందుబాటులోకి వచ్చాక డిజిటల్ చెల్లింపుల ప్రపంచంలో విప్లవాత్మక మార్పులు వచ్చాయి. బ్యాంక్ ఖాతాకు నేరుగా మనీ ట్రాన్స్‌ఫర్ చేసే ఫెసిలిటీ అందుబాటులోకి రావడంతో.. బ్యాంకులకు వెళ్లే వారు చాలా వరకు తగ్గారు. ఇంతకుముందు డిజిటల్ వాలెట్ ట్రెండ్ ఉండేది. వాలెట్‌లో కేవైసీ ప్రక్రియ పూర్తి చేయాల్సి వచ్చేది. అయితే యూపీఐ సేవల కోసం కేవైసీ ప్రక్రియ పూర్తి చేయాల్సిన అవసరం లేదు. ఒకసారి బ్యాంకుకు లింక్ అయిన మొబైల్ నెంబర్ తో యూపీఐ యాపులలో అకౌంట్ ను లింక్ చేయాలి. ఆ తరువాత నుంచి ఎవరికైనా మనీ పంపాలనుకుంటే.. వారి మొబైల్ ఫోన్ నంబర్/అకౌంట్ నంబర్/ యూపీఐ ఐడీ ఉంటే చాలు పంపేయచ్చు. అంతేకాదు.. ఈ యాప్స్ ద్వారా 24×7 బ్యాంకింగ్ సేవలు అందుబాటులో ఉంటాయి.