రిలయన్స్ ఇండస్ట్రీస్ డైరెక్టర్, ధీరూబాయ్ అంబానీ ఇంటర్నేషనల్ స్కూల్ ఫౌండర్ నీతా అంబానీ గురించి తెలియని వారుండరు. నీతా లైఫ్ స్టైల్ గురించి కూడా వార్తల్లో చూస్తూనే ఉంటారు. ఆమె లగ్జరీ వస్తువులు కొనేందుకు ఎక్కువగా ఇష్టపడుతుంటారు.
ప్రపంచ కుబేరుల్లో ఒకరు, రిలయన్స్ సంస్థ అధినేతైన ముఖేశ్ అంబానీ భార్య నీతా అంబానీ గురించి అందరికీ తెలిసిందే. అంబానీ భార్యగా ఆమె ఎలాగూ ఫేమసే. కానీ తనకంటూ పేరు ప్రఖ్యాతులు ఉండాలని, తన సక్సెస్‌తో పాపులర్ అవ్వాలని నీతా కోరుకున్నారు. ఆ దిశగా కృషి చేసిన నీతా.. సక్సెస్ఫుల్ బిజినెస్ ఉమెన్‌గా పేరు తెచ్చుకున్నారు. తన స్టైల్, ఫ్యాషన్‌తో అభిమానులను ఎప్పుడూ కట్టిపడేస్తారు నీతా. వయసు పెరుగుతున్నా ఆమె మాత్రం తన స్టైలింగ్‌తో ఏజ్ తక్కువగా కనిపిస్తుంటారు. ట్రెండ్‌కు తగ్గట్లు జ్యువెల్లరీ, హ్యాండ్‌బ్యాగ్స్, పాదరక్షలు, లిప్స్టిక్స్, అధునాతన డ్రెస్సింగ్, మేకప్‌తో పర్ఫెక్ట్ లుక్‌లో దర్శనమిస్తుంటారు. నీతా అటెండ్ అయ్యే ఈవెంట్లో ఆమెనే సెంటరాఫ్ అట్రాక్షన్‌గా నిలుస్తుంటారు. ఐపీఎల్లో తన జట్టు ముంబై ఇండియన్స్ మ్యాచులు చూసేందుకు వస్తుంటారు నీతా అంబానీ.
ముంబై ఇండియన్స్ ప్లేయర్లను ప్రోత్సహిస్తూ, మైదానంలో సందడి చేస్తుంటారు నీతా అంబానీ. ఆమె స్టేడియంలో ఉన్నారంటే చాలు.. కెమెరామెన్ లెన్స్ అటు తిప్పేస్తుంటారు. ఇటీవల ముంబై ఆడిన ఒక మ్యాచ్‌లో ఇలాగే కెమెరా కళ్లకు చిక్కారు నీతా. ఒక ఫొటోలో ఆమె తన చేతికి ఖరీదైన గడియారం వేసుకుని కనిపించారు. నీతా ధరించినది ఒక లగ్జరీ స్విస్ వాచ్ అని తెలిసింది. పటేక్ ఫిలిప్ సంస్థ తయారు చేసిన స్పెషల్ ఎడిషన్ వాచ్‌గా చెబుతున్న దీని ధర సుమారు రూ.85 లక్షలు అని సమాచారం. ఈ వాచ్‌లోని డయల్, కేస్, లగ్స్ వజ్రాలతో పొదగబడి ఉన్నాయి. నీతా అంబానీ వాచ్‌పై సోషల్ మీడియాలో నెటిజన్స్ రకరకాల కామెంట్స్ చేస్తున్నారు. వాళ్లు.. డబ్బున్నోళ్లు ఎంత ఖరీదైనవైనా వేసుకుంటారని కొందరు వ్యాఖ్యలు చేస్తున్నారు. మరికొందరు మాత్రం అన్ని డబ్బులు పోసి లగ్జరీ వాచ్‌లు కొనేకంటే.. పేదవారికి సాయం చేస్తే ఏం పోతుందని ప్రశ్నిస్తున్నారు.