ఫ్లాట్ లేదా ఇల్లు కొంటున్నారా? అయితే మీరు ఈ విషయాలు ఖచ్చితంగా తెలుసుకోవాలి. లేదంటే మీరు మోసపోయే అవకాశం ఉంది.
ఫ్లాట్ లేదా ఇల్లు కొనాలని చాలా మందికి ఒక డ్రీమ్. రూపాయి రూపాయి పోగుజేసుకుని, బ్యాంకులో ఋణం తీసుకుని నగరంలో ఒక ఫ్లాట్ లేదా ఇల్లు కొనుక్కుంటారు. స్థలం కొనడం, కట్టించడం పెద్ద తలనొప్పి అని భావించి కట్టేసిన ఫ్లాట్ లను, ఇండ్లను కొంటున్నారు. అయితే దీన్ని ఆసరాగా తీసుకుని కొంతమంది మోసాలకు పాల్పడుతున్నారు. ఇల్లు గానీ ఫ్లాట్ గానీ కొనే ముందు కొన్ని విషయాలు మైండ్ లో పెట్టుకోవాలి. లేదంటే మాయ చేసి డబ్బు కాజేస్తారు. ఆ తర్వాత డబ్బూ ఉండదు, ఇల్లూ ఉండదు. మరి ఇల్లు గానీ ఫ్లాట్ గానీ కొనే ముందు తెలుసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమిటి? ఇల్లు కొనే ముందు ఉండాల్సినవి ఏమిటి? అనే వివరాలు మీ కోసం.
ఫ్లాట్ లేదా ఇల్లు కొనే ముందు డాక్యుమెంట్స్ అన్నీ పర్ఫెక్ట్ గా ఉన్నాయో లేదో చూసుకోవాలి. లేదంటే మోసపోయే అవకాశాలు ఎక్కువ. కొంతమంది లిటికేషన్ లో ఉన్న ల్యాండ్ అమ్ముతారు. కొన్ని సందర్భాల్లో ఓనర్ కి తెలియకుండా బిల్డర్, బిల్డర్ కి తెలియకుండా ఓనర్ ఫ్లాట్ లేదా ఇల్లు అమ్ముతుంటారు. వారి మాటలు నమ్మి డాక్యుమెంట్స్ చెక్ చేసుకోకుండా కొన్నారో మోసపోయినట్టే. ఒక్క డాక్యుమెంట్ లేకపోయినా సరే వారు మోసం చేస్తున్నట్టు అర్థం చేసుకోవాలి. కొనే ముందు లీగల్ డాక్యుమెంట్స్ ని వెరిఫై చేసుకోవాలి. టైటిల్ డీడ్, కన్వేయన్స్/సేల్ డీడ్, పన్ను రశీదులు, బిల్లులు, 7/12 ఎక్స్ట్రాక్ట్ డాక్యుమెంట్, బిల్డింగ్ ప్లాన్ అప్రూవల్, ఆక్యుపెన్సీ & కమ్మెన్స్ మెంట్ సర్టిఫికెట్, నో అబ్జెక్షన్ సర్టిఫికెట్, ఎన్కంబరెన్స్ సర్టిఫికెట్, ఐఓడీ, బిల్డింగ్ కంప్లీషన్ సర్టిఫికెట్ వంటి డాక్యుమెంట్స్ ని తనిఖీ చేసుకోవాలి. ఫ్లాట్ లేదా ఇల్లు అమ్మే వ్యక్తికి అమ్మే హక్కు ఎలా వచ్చింది? ఆ ఆస్తి ఎలా సంక్రమించింది? అనే విషయాలు తెలుసుకోవాలి.
లింక్ డాక్యుమెంట్స్, ఈసీ తీసుకుంటే అందులో మొత్తం వివరాలు ఉంటాయి. అలానే అమ్మే వ్యక్తి కట్టిన ఇంటి పన్నులు, ప్రాపర్టీ ట్యాక్సులకు సంబంధించి డాక్యుమెంట్స్ తీసుకోవాలి. లేఅవుట్ ప్లాన్ అప్రూవల్ ఉందో లేదో చూసుకోవాలి. ప్లాన్ అప్రూవ్ అయ్యిందా లేదా చూసుకోవాలి. లోకల్ అథారిటీస్ అనుమతి ఉందా లేదా చూసుకోవాలి. అమ్మే వ్యక్తి డెవలపర్ అయితే డెవలపర్ అగ్రిమెంట్ లో ఏముందో చూసుకోవాలి. జీపీఏ హోల్డర్ ఐతే జీపీఏ రిజిస్టర్ అయ్యిందా? లేదా? జీపీఏ ఇచ్చిన వ్యక్తి బతికున్నారా? లేదా? చూసుకోవాలి. అయితే ఈ డాక్యుమెంట్లు వెరిఫై చేసుకోవడం అనేది సామాన్యులకు కష్టమే. ఇందుకోసం ఒక అడ్వకేట్ ని సంప్రదిస్తే లీగల్ గా అన్ని డాక్యుమెంట్లు ఉన్నాయో లేదో తనిఖీ చేస్తారు. మీకు అవగాహన ఉంటే మీరే తనిఖీ చేసుకోవచ్చు లేదా అడ్వకేట్ ని మాట్లాడుకోవచ్చు. ఇలా చేస్తేనే ఒక ఇల్లు లేదా ఫ్లాట్ ని కొన్న తర్వాత భవిష్యత్తులో ఎలాంటి చిక్కులూ రాకుండా ఉంటాయి.