రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత, బిలియనీర్ ముఖేష్ అంబానీ మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. కొత్త వ్యాపారంలోకి ప్రవేశించాలని ఆయన డిసైడ్ అయ్యారు. ఆ వివరాలు మీ కోసం..!
ప్రముఖ పారిశ్రామికవేత్త, అపర కుబేరుడు ముఖేష్ అంబానీ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటికే టెలికామ్, రీటైల్ రంగాల్లో దూసుకెళ్తున్న రిలయన్స్ ఇప్పుడు మరో రంగంలోకి ప్రవేశించనుంది. హెల్త్ కేర్ సెక్టార్‌లోకి ఎంట్రీ ఇవ్వనుంది. జియో తరహాలో మరో సునామీ సృష్టించేందుకు రిలయన్స్ ఇండస్ట్రీస్ సిద్ధమవుతోంది. స్థానిక ధరల కంటే తక్కువకే జినోమ్ మ్యాపింగ్ పరీక్షలను అందుబాటులోకి తీసుకొచ్చేందుకు సన్నద్ధమవుతున్నట్లు రిలయన్స్ వర్గాలు పేర్కొన్నాయి. క్యాన్సర్లు, న్యూరో డీజనరేటివ్ వ్యాధులు, గుండె సంబంధిత ప్రమాదాల వంటి వ్యాధులు, వాటి ప్రభావాలను తెలుసుకునేందుకు జినోమ్ మ్యాపింగ్స్ను వినియోగిస్తారు.
ఈ ప్రొఫైల్‌ను స్ట్రాండ్ లైఫ్ సైన్సెస్ డెవలప్ చేసింది. తాము తయారు చేసిన జినోమ్ సీక్వెన్సింగ్ కిట్‌ను రూ.12 వేలకే అందుబాటులోకి తీసుకొస్తున్నట్లు స్ట్రాండ్ లైఫ్ సైన్సెస్ ప్రైవేట్ లిమిటెడ్ సీఈవో రమేష్ హరిహరన్ వెల్లడించారు. మార్కెట్ రేట్లతో పోలిస్తే ఇది దాదాపుగా 86 శాతం తక్కువని హరిహరన్ తెలిపారు. ప్రపంచంలోనే అత్యంత చౌకైన జినోమిక్ ప్రొఫైల్ ఇదేనన్నారు. ఈ పరీక్ష ఔషధాల అభివృద్ధికి సాయపడే జీవసంబంధిత డేటా రిపోజిటరీని తయారు చేయడానికీ అనుమతిస్తుందని పేర్కొన్నారు. కాగా, బెంగళూరుకు చెందిన స్ట్రాండ్ లైఫ్ సైన్సెస్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థలో దాదాపు 80 శాతం వాటాలను రిలయన్స్ గ్రూప్ 2021లోనే కొనుగోలు చేసింది.
అలాంటి స్ట్రాండ్ లైఫ్ సైన్సెస్ కంపెనీ రూపొందించిన జినోమ్ మ్యాపింగ్ టెస్ట్ కిట్స్‌ను మార్కెటింగ్ చేయాలని రిలయన్స్ భావిస్తోంది. కొన్ని జన్యుపరమైన రుగ్మతలు, వ్యాధులను గుర్తించడానికి జినోమ్ మ్యాపింగ్ పరీక్షలను ఉపయోగిస్తారు. మైజియో యాప్‌లో రాబోయే వారాల్లో ఈ టెస్ట్‌ను దూకుడుగా ప్రమోట్ చేయాలని రిలయన్స్ సంస్థ ప్లాన్ చేస్తోంది. మరి.. హెల్త్ కేర్ సెక్టార్లో రిలయన్స్ ఇండస్ట్రీస్ సక్సెస్ అవుతుందని మీరు భావిస్తున్నారా? అయితే మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.